IND vs PAK: ఇదేం పద్ధతి.. ఓడిపోతే సంబరాలు చేసుకోవడమా?: భారత్-పాక్‌ దిగ్గజాల అసహనం

దాయాదుల మధ్య (IND vs PAK) పోరంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ, ఇరు జట్లు వేరే టీమ్‌లతో ఆడి ఓడిపోయినా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకోవడం వింతగా అనిపిస్తోందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.

Updated : 27 Nov 2023 11:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) భారత్ ఫైనల్‌లో ఓటమిని చవిచూసింది. దాయాది దేశం పాకిస్థాన్‌ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. భారత్-పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తే ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకోవడం మామూలే. కానీ, భారత్‌ ఇతర జట్టుపై ఓడిపోతే పాక్‌ అభిమానులు.. అలాగే పాక్‌ ఓడితే భారత్‌లోని కొందరు అభిమానులు సంబరాలు చేసుకోవడంపై దాయాది దేశాల క్రికెట్‌ దిగ్గజాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ అభిమానులు కౌంటర్లు ఇచ్చుకోవడమూ సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇలా ఫ్యాన్స్‌ పోట్లాడుకోవడం మంచి పద్ధతి కాదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పాక్ మాజీ స్టార్‌ వసీమ్‌ అక్రమ్ సూచించారు.

‘ఇక్కడ నేను ఎవరి పేరును ప్రత్యేకంగా చెప్పట్లేదు. కానీ, ఇరు దేశాల నుంచి పలువురు ప్రముఖులు మాత్రం అవాకులు, చెవాకులు పేలారు. వారి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎవరి దేశంపై వారికి భక్తి ఉండటం సహజం. ప్రతి ఒక్కరూ కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు అవమానపరిచినట్లు ప్రవర్తించడం సరైంది కాదు. గేమ్‌ను గేమ్‌లానే చూడాలి’’ అని వసీమ్‌ అక్రమ్‌ వ్యాఖ్యానించాడు.

ఇదంతా నెగెటివ్‌ యాటిట్యూడ్: గంభీర్‌

పాక్ క్రికెట్ దిగ్గజం చేసిన వ్యాఖ్యలకు గౌతమ్‌ గంభీర్‌ మద్దతు తెలిపాడు. ‘‘మీ అభిమాన జట్టు విజయం సాధించినప్పుడు చేసే సంబరాలపై దృష్టిపెట్టాలి. అంతేకానీ, ఇతర జట్లు ఓడిపోయినా దానిని సెలబ్రేట్‌ చేసుకోవడం మంచి పద్ధతి కాదు. పక్క జట్టు ఓటమిని కూడా ఎంజాయ్‌ చేయాలనుకోవడం సంస్కారం కాదు. భారత్‌ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత పాక్‌లోని కొందరు ఆనంద పడ్డారు. అలానే పాక్‌ లీగ్‌లోనే ఇంటిముఖం పట్టినప్పుడు భారత్‌లోనూ పలువురు సంబరాలు చేసుకున్నారు. ఇదంతా నెగెటివ్‌ యాటిట్యూడ్. ఇలాంటి విధానం మారాలి. కనీసం క్రీడలకు సంబంధించిన వ్యవహారాల్లోనైనా మినహాయింపు ఇవ్వాలి. 

మన గెలుపును ఆస్వాదించాలి. ఇతరుల ఓటమిని కాదు. దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? క్రీడాస్ఫూర్తితో ఉండే ఎవరూ దానిని ప్రోత్సహించరు. కొంతమంది కేవలం సోషల్‌ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికే ఇలా చేస్తుంటారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. మరోసారి భారత్- పాకిస్థాన్‌ జట్లు తలపడేందుకు అవకాశం ఉంది. ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. అప్పుడు సంబరాలు చేసుకుంటే ఓ అర్థముంటుంది. కానీ, ఇతర జట్లపై ఓడినా ఎంజాయ్‌ చేస్తామంటే సరికాదు’’ అని గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని