MS DHONI - Gambhir: చెన్నైతో కష్టమే.. భారత్‌లో ధోనీని మించిన కెప్టెన్‌ లేడు: గౌతమ్‌ గంభీర్‌

భారత్‌ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు, ఐపీఎల్‌లో చెన్నైకు ఐదు టైటిళ్లను అందించిన ఏకైక సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni). ఈ సీజన్‌లో కెప్టెన్సీని త్యజించిన సంగతి తెలిసిందే. తాజాగా ధోనీపై మాజీ క్రికెటర్ గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు.

Published : 08 Apr 2024 15:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెపాక్ వేదికగా కోల్‌కతాతో తలపడేందుకు చెన్నై సిద్ధమైంది. వరుసగా రెండు ఓటములను చవిచూసిన రుతురాజ్‌ నాయకత్వంలోని ఆ జట్టు మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్‌ విక్టరీలతో దూకుడు మీదున్న కోల్‌కతా ఆ ఊపును కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై (MS Dhoni) ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఆ వీడియోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. 

‘‘నేను ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాలని అనుకుంటా. స్పష్టమైన ఆలోచనతో ఉంటా. స్నేహితులైనా సరే పరస్పరం గౌరవించుకోవాలి. నేను కోల్‌కతా సారథిగా ఉన్నప్పుడు.. ధోనీ సీఎస్‌కే కెప్టెన్. ప్రత్యర్థులుగా బరిలోకి దిగినప్పుడు గెలుపు కోసమే కష్టపడతాం. ఇదే ప్రశ్న ధోనీని అడిగినా అతడు ఇలానే స్పందిస్తాడు. ప్రతిఒక్కరూ విజయం సాధించాలని అనుకోవడం సహజమే. భారత క్రికెట్‌లో ఎంఎస్ ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదు. ఇప్పటివరకు అలాంటి సారథి లేడు. మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్‌ఇండియా కెప్టెన్’’ అని తెలిపాడు.

ధోనీ వ్యూహాలు అద్భుతం.. ఆస్వాదించా

‘‘ఐపీఎల్‌లో నేను ఆడుతున్న ప్రతీ క్షణం ఆస్వాదించా. ధోనీకి ప్రత్యర్థిగా బ్యాటింగ్‌ చేయడం ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. వ్యూహాలకు పదునుపెట్టే మైండ్‌సెట్‌ అద్భుతం. ఒక్కో బ్యాటర్‌కు ఎలా ఫీల్డింగ్‌ను సెట్‌ చేయాలనేది అతడికి తెలుసు. చివరి బంతి వరకూ మ్యాచ్‌ను చేజారనీయకుండా ఉండేందుకు పట్టు బిగిస్తాడు. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే మ్యాచ్‌ను ముగిస్తాడని తెలిసిపోతుంది. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైనా సరే చెన్నై భయపడదు. ఎందుకంటే అక్కడ ధోనీ ఉంటాడు. ఆ జట్టుపై బౌలింగ్‌ చేయడమంటే కఠిన సవాల్‌ అని నాకు తెలుసు. చెన్నై వంటి టీమ్‌పై విజయం సాధించేవరకూ విశ్రమించకూడదు. చివరి బంతితోనైనా ఫలితం మార్చేయగల ఆటగాళ్లు ఆ జట్టు సొంతం’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని