Sreesanth-Gambhir: సహచరులతో గొడవపడతాడు.. సీనియర్లకు గౌరవం ఇవ్వడు: గంభీర్‌పై శ్రీశాంత్

‘లెజెండ్‌ లీగ్‌ క్రికెట్‌’లో ఇద్దరు మాజీల మధ్య కవ్వింపు ఘటన చోటు చేసుకొంది. వారిద్దరూ భారత జట్టు మాజీలే కావడం గమనార్హం. 

Updated : 07 Dec 2023 15:33 IST

ఇంటర్నెట్ డెస్క్: తాజాగా లెజెండ్‌ లీగ్‌ క్రికెట్‌ (LLC)లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్‌, శ్రీశాంత్ మధ్య చిన్నపాటి కవ్వింపు ఘటన చోటు చేసుకొంది. ఈ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్‌ అద్భుతమైన షాట్లు కొట్టాడు. ఈ క్రమంలో గంభీర్‌ వైపు శ్రీశాంత్‌ తీక్షణంగా చూశాడు. అయితే, గంభీర్‌ కూడా ఏమాత్రం వెనక్కితగ్గకుండా ఏంటన్నట్లు సైగ చేశాడు. దీంతో మ్యాచ్‌ అనంతరం గంభీర్‌పై శ్రీశాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

‘‘మిస్టర్ ఫైటర్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఏం జరిగిందో చెప్పేందుకు వచ్చా. కారణం లేకుండానే సహచరులతో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. కనీసం తన సీనియర్లకు కూడా గౌరవం ఇవ్వడు. తాజాగా లెజెండ్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లోనూ నేను కవ్వించకపోయినా పరుష పదజాలం ప్రయోగించాడు. ఈ ఘటనలో నా తప్పేమీ లేదు. మైదానంలో అతడి మాటలు, చేతలు ఆమోదయోగ్యం కాదు. నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలు పడ్డారు. అభిమానుల మద్దతుతో పోరాడుతున్నా. అయితే, కొందరు అకారణంగా నన్ను కిందికి లాగాలని అనుకుంటున్నారు. అతడు (గంభీర్‌) అనకూడని మాటలు మైదానంలో అన్నాడు. 

సహచరులకే గౌరవం ఇవ్వని వారు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఏదైనా కామెంట్రీ సెక్షన్‌లోనూ విరాట్ గురించి అడిగితే దానిని గురించి మాట్లాడడు. ఇతర విషయాలపై స్పందిస్తాడు. అయితే, మరీ లోతుగా వెళ్లాలని అనుకోవడం లేదు. ఈ మ్యాచ్‌ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు నన్ను, నా కుటుంబాన్ని బాధించాయి. నాకు మద్దతుగా నిలిచే వారినీ బాధించింది. నేను మాత్రం అతడిని ఒక్క చెడు పదం కూడా అనలేదు. అతడు ఎప్పట్లానే స్పందించాడు. నేను ఒక్క పదమూ తప్పుగా మాట్లాడలేదు. ‘‘నువ్వు ఏమంటున్నావు?’ అని మాత్రమే అడిగా. అప్పుడు అతడు ‘‘ఫిక్సర్‌, నువ్వు ఫిక్సర్‌’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో విరక్తిగా నవ్వుతూ నిలబడిపోయా. వారిని బౌలింగ్‌లో కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా నన్ను ఫిక్సర్‌గా పిలిచాడు’’ అని శ్రీశాంత్‌ తెలిపాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని