IND vs AFG: కోహ్లీ-నవీనుల్ సంభాషణ.. దిల్లీ క్రికెట్ ప్రేక్షకులకు ఒకటే చెబుతున్నా: గౌతమ్ గంభీర్

దాదాపు ఆరు నెలల నుంచి విరాట్ అభిమానులకు నవీనుల్‌ హక్‌కు సోషల్‌ మీడియా వేదికగా జరిగిన ట్రోలింగ్‌కు శుభం కార్డు పడింది. వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో (ODI World Cup 2023) భారత్ - అఫ్గాన్ మ్యాచ్‌ సందర్భంగా విరాట్, నవీనుల్ సరదాగా ముచ్చటించుకొన్నారు. ఈ సంఘటనపై గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు.

Updated : 12 Oct 2023 12:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) అఫ్గాన్‌పై భారత్‌ విజయం సాధించింది. రోహిత్ శర్మ (131) మెరుపు శతకం సాధించాడు. అయితే, వీటన్నింటికి మించి మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అఫ్గాన్‌ పేసర్ నవీనుల్‌ హక్ సరదాగా ముచ్చటించుకొన్నారు. నవీనుల్‌ను ఉద్దేశించి దిల్లీ మైదానంలోని కొందరు ప్రేక్షకులు వ్యాఖ్యలు చేయడాన్ని కోహ్లీ (Virat Kohli) సున్నితంగా మందలించాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ సంఘటనపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. ఐపీఎల్‌లో గంభీర్-కోహ్లీ-నవీనుల్‌ హక్ మధ్యనే వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్-అఫ్గాన్‌ మ్యాచ్‌కు గంభీర్‌ కామెంట్రీ చెప్పాడు.

‘‘మైదానంలో పోరాడాలి. మైదానం బయట కాదు. ప్రతి ఒక్క ఆటగాడికి తమ జట్టు విజయం కోసం పోరాడే హక్కు ఉంటుంది. గౌరవం కోసం పోరాడే అధికారం ఉంది. అది ఏ దేశమనేది సంబంధం లేదు. నువ్వు ఎంత అద్భుత ఆటగాడివనేది అనవసరం. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీనుల్‌ హక్‌ను ఇలా చూడటం చాలా బాగుంది. ఎట్టకేలకు ఐపీఎల్ ఫైట్‌కు శుభం కార్డు పడినట్లే. ఇదే సమయంలో క్రికెట్ అభిమానులకు కూడా ఓ విజ్ఞప్తి.  మైదానంలోకానీ, సోషల్ మీడియా వేదికల్లోనైనా ఏ ఆటగాడినైనా సరే సరదా కోసం కూడా ట్రోలింగ్ చేయడం సరికాదు. జాతీయ జట్టు తరఫున ఆడాలనేది ప్రతి క్రికెటర్‌ కల. దాని కోసం ఎంతో శ్రమించి ఇక్కడి వరకు వస్తారు. ఇక నవీనుల్‌ హక్‌ అఫ్గాన్‌ వంటి దేశం నుంచి ఐపీఎల్‌ మెగా టోర్నీలో ఆడటం గొప్ప విషయం’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.

గత ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు-లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌, నవీనుల్‌ హక్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుజట్ల ఆటగాళ్లూ కల్పించుకుని సర్దుబాటు చేశారు. ఆ తర్వాత నవీనుల్‌ హక్‌ తన సోషల్‌ మీడియా వేదికగా కోహ్లీని ఉద్దేశించి పోస్టులు చేశాడు. దీంతో కింగ్‌ అభిమానుల ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇప్పుడు వీరిద్దరూ మైదానంలో చిరునవ్వులు చిందించడంతో గత సంఘటనకు ముగింపు పలికినట్లయిందని అభిమానులు సంబరపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు