Gautam Gambhir: అప్పుడు సెలక్టర్‌ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్

ఐపీఎల్ 17వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్‌ మెంటార్‌ గంభీర్‌ తన కెరీర్‌లో జరిగిన ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు.

Published : 21 May 2024 10:11 IST

ఇంటర్నెట్ డెస్క్: కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడి మరీ ఉన్నతస్థాయికి చేరుకున్నట్లు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) తెలిపాడు. భారత జట్టు వన్డే, టీ20 ప్రపంచ కప్‌లను నెగ్గడంలో గంభీర్‌దీ కీలక పాత్రే. ఓపెనర్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. మెంటార్‌గా జట్టును అతడు కేకేఆర్‌ను మూడోసారి విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను వెల్లడించాడు. అండర్ -14 జట్టు ఎంపిక సమయంలో చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 

‘‘నాకు అప్పుడు 12 లేదా 13 ఏళ్లు ఉంటాయనుకుంటా. అండర్ -14 టోర్నమెంట్ కోసం చాలా కష్టపడినా నేను ఎంపిక కాలేదు. దానికి కారణం ఏంటో తర్వాత తెలిసింది. నేను సెలక్టర్‌ కాళ్లు తాకలేదని ఎంపిక చేయలేదు. అప్పటి నుంచే ఎవరి కాళ్లూ పట్టుకోకుండా కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రతిజ్ఞ చేశా. అలాగే నా కాళ్లనూ ఎవరితోనూ పట్టించుకోకూడదని అనుకున్నా. అండర్ - 16, అండర్-19, రంజీ ట్రోఫీ, భారత జట్టు తరఫున ఆడుతూ విఫలమైనప్పుడల్లా బయట నుంచి చాలా కామెంట్లు వచ్చేవి. ‘నీకేమీ మంచి కుటుంబం నుంచి వచ్చావు. అసలు క్రికెట్‌ ఆడాల్సిన అవసరమే నీకు లేదు. చాలా ఆప్షన్లు ఉన్నాయి. మీ నాన్న బిజినెస్‌లను చూసుకుంటావు’ అంటూ వ్యాఖ్యలు చేసేవాళ్లు. అలాంటి వాటితో నా మది అంతా ఆలోచనలతో నిండిపోయేవి. నాకు కుటుంబం కంటే క్రికెట్టే ఎక్కువని ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియదు. దానిని అధిగమించేందుకు చాలా శ్రమించేవాడిని.  నా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితి ఏంటంటే ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని నిరూపించుకోవడానికి ప్రయత్నించడమే’’ అని గంభీర్ తెలిపాడు. 

షారుఖ్‌తో అనుబంధం..

‘‘గతంలోనే షారుఖ్‌ గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి అత్యుత్తమ ఫ్రాంచైజీ ఓనర్‌ అంటే షారుఖ్‌. జట్టు ఆటగాళ్లను పూర్తిగా నమ్మడంతోపాటు వారికి కావాల్సిన స్వేచ్ఛ ఇస్తాడు. నేను మళ్లీ తిరిగి రావడానికి ఇదే ప్రధాన కారణం కాకపోవచ్చు. నా ఏడేళ్ల కెప్టెన్‌ కాలంలో క్రికెట్‌ గురించి మేమిద్దరం 70 సెకన్లు కూడా మాట్లాడుకోని ఉండము. ఒక్క ప్రశ్న కూడా అతడు నన్న అడగలేదు. ఇది అస్సలు ఊహించి ఉండరు కదా..’’ అని కేకేఆర్‌ మెంటార్ వెల్లడించాడు. కెప్టెన్‌గా కోల్‌కతాను గంభీర్‌ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని