ODI WC 2011: అందరూ మా గురించే మాట్లాడతారు.. కానీ అతడే అసలైన హీరో: గౌతమ్ గంభీర్‌

రెండోసారి భారత్ వన్డే ప్రపంచకప్‌ విశ్వవిజేతగా నిలిచిన జట్టులో గౌతమ్‌ గంభీర్‌ సభ్యుడు. అయితే, టీమ్‌ఇండియ విజయం వెనుక మరొక కీలక ఆటగాడు ఉన్నాడని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 05 Sep 2023 15:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి వన్డే ప్రపంచ కప్‌ను (1983) నెగ్గిన 28 ఏళ్లకు కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ రెండో టైటిల్‌ను (2011) తన ఖాతాలో వేసుకుంది. ధోనీ కెప్టెన్సీ, యువరాజ్‌ సింగ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతోపాటు గౌతమ్‌ గంభీర్‌ కీలక ఇన్నింగ్స్‌లతో భారత్‌ విజేతగా నిలిచింది. అయితే, టీమ్‌ఇండియా విజేతగా నిలవడం వెనుక మరొకరు ఉన్నారని మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్‌లో భారత్ - నేపాల్‌ మ్యాచ్‌ అనంతరం ఓ క్రీడా ఛానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అభిమానులందరూ ఎక్కువగా ధోనీ, యువీతోపాటు తన ఇన్నింగ్స్‌ల గురించి మాట్లాడుతుంటారని.. అయితే జహీర్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించడం వల్లే భారత్ విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు. 

‘‘యువ్‌రాజ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. ఫైనల్‌లో ఎంఎస్ ధోనీతోపాటు నా ఇన్నింగ్స్‌లు గురించి అంతా మాట్లాడుతూ ఉంటారు. కానీ, టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో టోర్నీ ఆసాంతం కీలక పాత్ర పోషించిన మరొక ఆటగాడు జహీర్ ఖాన్. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన స్పెల్‌తో ఆండ్రూ స్ట్రాస్‌ను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్‌ ఓడిపోకుండా టై చేయగలిగాం. ఫైనల్‌లోనూ మంచి స్పెల్‌ వేశాడు. అందుకే, టోర్నీలో జహీర్ ఖాన్‌ పాత్ర అద్భుతం. వచ్చే వరల్డ్‌ కప్‌లోనూ బుమ్రా ఇలాంటి పాత్రనే పోషించాలి. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా గౌతమ్‌ గంభీర్‌ ప్రేక్షకులకు మధ్య వేలిని చూపించాడు. ఈ వీడియా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అతడు స్పందించాడు. ప్రేక్షకుల్లో ఒక వర్గం భారత వ్యతిరేక నినాదాలు చేసినందునే తాను వేలు చూపెట్టానని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని