Gautam Gambhir - KKR: కోల్‌కతా రాత మారుస్తాడా!

Published : 23 Nov 2023 17:48 IST

ఐపీఎల్‌ (IPL)లో ఎక్కువ పోటీ ఇచ్చే జట్లలో ప్రధానంగా గుర్తొచ్చేది కోల్‌కతా నైట్‌రైడర్స్‌(KKR). లీగ్‌ దశలో అదరగొట్టి ప్లేఆఫ్స్‌ అనగానే తేలిపోతూ ఉంటుంది కోల్‌కతా. అయితే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా 16 సీజన్లలో రెండుసార్లు టైటిళ్లు కొట్టగలిగింది. అది కూడా ఒకే కెప్టెన్‌ సారథ్యంలో!. అతడే గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir). అందుకే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను అతడికి ముందు అతడి తర్వాత అతని చెప్పుకోవాలి ఆ జట్టును. ఎందుకంటే అతడు ఆ జట్టును వీడాక మళ్లీ కప్‌ గెలవలేదు. అయితే గంభీర్‌ తిరిగి సొంత గూటికి వచ్చేశాడు. ఈసారి మార్గనిర్దేశకుడి పాత్ర పోషించనున్నాడు. మరి అతడు కోల్‌కతాను ఇంకో టైటిల్‌ దిశగా నడిపించగలడా!

కోల్‌కతా అనగానే..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అనగానే గుర్తొచ్చే పేరు గంభీర్‌. అంతలా ఆ జట్టుపై ముద్ర వేశాడు గౌతి. 2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నా గంభీర్‌ వచ్చాక కానీ కప్పును ముద్దాడలేకపోయింది కోల్‌కతా. ఒకసారి కాదు అతడి హయాంలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవగలిగింది. 2012, 2014 టోర్నీల్లో కప్‌ను ముద్దాడింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌ తర్వాత ఎక్కువ టైటిల్స్‌ గెలిచిన ఘనత కోల్‌కతాదే. అతడి కెప్టెన్సీలో దూకుడుగా ఆడిన ఈ జట్టు అనూహ్య విజయాలు సాధించింది. బిస్లా లాంటి పేరు లేని ఆటగాళ్లు కూడా ప్రధాన ఆటగాళ్ల స్థాయిలో సత్తా చాటారు. అయితే గంభీర్‌ వెళ్లిపోయిన తర్వాత మళ్లీ షరా మాములే. కోల్‌కతా ఢీలాపడిపోయింది. ఆ జట్టు ఆట ఎప్పటిలాగే సాగింది. లీగ్‌ దశలో అదిరే ప్రదర్శన చేసినా ఫినిషింగ్‌ చేయకపోవడం ఆ జట్టును చాలా కాలంగా వేధిస్తోంది. గత ఆరేళ్లలో ఆ జట్టు ఒక్కసారి మాత్రమే లీగ్‌ దశను అధిగమించింది. 2021లో రన్నరప్‌ కావడమే గత మూడేళ్ల కాలంలో కోల్‌కతా సాధించిన మెరుగైన ఫలితం.

అతడి రాకతోనైనా

కాలం గడిచిపోయింది. ఇప్పుడు గంభీర్‌ ఆటగాడి నుంచి కోచ్‌గా మారిపోయాడు. జట్లకు మార్గనిర్దేశకుడిగా పని చేస్తున్నాడు. ఇప్పటిదాకా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. గత సీజన్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో తమ ఆటగాడు నవీనుల్‌ హక్‌ విషయంలో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లితో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి వచ్చాడు. నిజానికి ఎల్‌ఎస్‌జీ మెంటార్‌గా గౌతి బాగానే పని చేశాడు. 2021 సీజన్లో ఈ జట్టుతో చేరిన అతడు.. 2022 టోర్నీలో ఎల్‌ఎస్‌జీని ఫైనల్‌ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అప్పుడు రన్నరప్‌ అయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎల్‌ఎస్‌జీ గట్టిగానే ఆడినా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో లఖ్‌నవూకు గుడ్‌బై చెప్పిన గౌతి.. మళ్లీ తనకు ఎంతో అచ్చొచ్చిన కోల్‌కతా గూటికి చేరాడు. కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌తో కలిసి అతడు ముందుకెళ్లబోతున్నాడు. కోల్‌కతా జట్టులో ప్రతిభావంతులకు కొదువ లేకపోయినా దూకుడు లోపించింది. అంతేకాదు గంభీర్‌ లాంటి ఫోర్సింగ్‌ పవర్‌ లేకపోవడం ఆ జట్టుకు లోపంగా మారింది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో గౌతి ఈ లోపాలను సరిదిద్ది జట్టుకు కప్‌ అందించగలడని కోల్‌కతా ఆశలు పెట్టుకుంది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని