IPL 2024: ఐపీఎల్ ప్రారంభించకపోయుంటే.. బీసీసీఐ ‘అత్యంత చెత్త’ నిర్ణయంగా మిగిలేది: గంభీర్‌

ఐపీఎల్ (IPL).. దేశవాళీ క్రికెటర్లకు అపార అవకాశాలను కల్పించింది. సంపాదనతోపాటు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. ఇలాంటి ఐపీఎల్‌ను బీసీసీఐ ప్రారంభించడం అభినందనీయమని గౌతమ్‌ గంభీర్ ప్రశంసించాడు.

Published : 24 Dec 2023 11:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ చరిత్రలో ఐపీఎల్‌ (IPL) సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆదాయపరంగా, వీక్షణల పరంగా ఎన్నో ఘనతలను ఈ లీగ్‌ సాధించింది. 2007 పొట్టి ప్రపంచకప్‌ విజయవంతం కావడంతో బీసీసీఐ కూడా టీ20ల లీగ్‌ను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకుంది. తొలిసారి 2008లో ఐపీఎల్‌ను మొదలు పెట్టింది. చాలామంది దేశవాళీ క్రికెటర్లకు దీనిలో అద్భుతమైన అవకాశాలు లభించాయి. ఒకవేళ ఈ లీగ్‌ను ప్రారంభించకుండా ఉండుంటే.. బీసీసీఐ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయంగా మిగిలిపోయేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే కార్యక్రమంలో చేతన్‌ సకారియా కూడా పాల్గొన్నాడు. 

‘‘ఐపీఎల్‌ భారత క్రికెట్‌ను మార్చేసింది. దీనిలో యువ క్రికెటర్లకు మంచి అవకాశాలు దక్కాయి. దేశ, విదేశీ సీనియర్‌ ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను మన కుర్రాళ్లు పంచుకున్నారు. అందుకే.. ఐపీఎల్‌ను ప్రారంభించకుండా ఉంటే.. అది బీసీసీఐ అత్యంత చెత్త నిర్ణయంగా మిగిలేదని భావిస్తున్నా’’ అని గంభీర్‌ తెలిపాడు. గత సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌.. వచ్చే సీజన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్‌ వేలంలో మిచెల్‌ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లు వెచ్చించి మరీ కేకేఆర్‌ దక్కించుకుంది. యువ బౌలర్‌ చేతన్‌ సకారియాను కోల్‌కతా రూ. 50 లక్షలకు తీసుకుంది.

నిరుత్సాహానికి గురయ్యా.. : చేతన్‌

ఐపీఎల్ వేలానికి ముందు దిల్లీ క్యాపిటల్స్‌ వదిలేయడం కాస్త షాక్‌గా అనిపించలేదని.. కానీ నిరుత్సాహానికి గురైనట్లు చేతన్‌ సకారియా వ్యాఖ్యానించాడు. ‘‘దిల్లీ తీసుకున్న నిర్ణయం నన్నేమీ షాక్‌కు గురి చేయలేదు. కానీ, కాస్త నిరుత్సాహపరిచింది. జట్టు తీసుకున్న విధానపర నిర్ణయాల ప్రకారం కరెక్టే. నా స్థాయి ప్రదర్శన చేయలేదనిపించింది. నాకు దక్కిన ధరకు (రూ.4.20 కోట్లు) న్యాయం చేయలేకపోయానేమో. ఆ జట్టులో భారత్‌కు చెందిన ఇతర బౌలర్లు ఉన్నారు. ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముకేశ్‌ కొనసాగుతున్నారు. దిల్లీ జట్టులో ఉన్నప్పుడు ముస్తాఫిజర్‌ నుంచి చాలా నేర్చుకున్నా. బంతిని ఎలా సంధించాలనే విషయాలపై  పట్టు సాధించా. ఇప్పుడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నా. మిచెల్‌ స్టార్క్‌ వంటి స్టార్‌ బౌలర్‌తోపాటు గౌతమ్‌ గంభీర్‌ వంటి మెంటార్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నన్ను కేకేఆర్‌ రూ.50 లక్షలకే కొనుగోలు చేసిందని బాధేమీ లేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. ఎక్కువ మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చే జట్టులో ఉండటమే ముఖ్యం’’ అని చేతన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని