Team India: అతడినే వేలెత్తి చూపడం సరికాదు.. అవకాశాలు ఇవ్వాల్సిందే: గావస్కర్

భారత మిడిలార్డర్‌ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో విఫలం కావడంపై వస్తున్న విమర్శలను మాజీ క్రికెటర్లు కొట్టిపడేశారు.

Updated : 07 Jan 2024 20:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో టెస్టు (SA vs IND) సిరీస్‌లో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. మిడిలార్డర్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్ రెండు టెస్టుల్లోనూ ప్రభావం చూపించలేదు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. వాటిని భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్ ఖండించాడు. కేవలం ఒక్కరినే వేలెత్తి చూపడం సరికాదని హితవు పలికాడు. 

‘‘శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రమే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో విఫలం కాలేదు.  విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ ఫర్వాలేదనిపించారు. రోహిత్, శుభ్‌మన్‌ గిల్ విఫలమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి. సఫారీ గడ్డపై ఆడటం బ్యాటర్లకు అంత తేలిక కాదు. అందుకే, కేవలం ఒకరినే నిందించడం సరికాదు. సెలక్షన్‌ కమిటీ కూడా శ్రేయస్‌ అయ్యర్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే మరింత మెరుగ్గా రాణించేందుకు వీలుంటుంది’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. 

మరీ డిఫెన్సివ్‌గా ఆడటం వల్లే: మంజ్రేకర్

‘‘పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్‌లపై మరీ డిఫెన్సివ్‌గా ఆడటం కూడా నష్టం చేస్తుంది. ఫుల్‌, షార్ట్‌ పిచ్‌ బంతులను  శ్రేయస్‌ అడ్డుకొనేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. విదేశీ మైదానాల్లో పరుగులు రాబట్టాలంటే దానిపై విపరీతంగా శ్రమించాలి. డిఫెన్స్‌ ఆడుతూ వికెట్లను సమర్పించుకునే బదులు.. రిస్క్‌ తీసుకుని దూకుడుగా ఆడేందుకు మొగ్గు చూపాలి. అలాంటప్పుడు బ్యాటింగ్‌లో స్థిరత్వం ఉండదు. కానీ, కౌంటర్‌ ఎటాక్‌ చేయడం వల్ల బౌలర్లు గతి తప్పే అవకాశం ఉంటుంది’’ అని భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని