IND Vs NZ: ఊడ్చేశారు..

టీమ్‌ఇండియాది అదే జోరు. మరోసారి పరుగుల వరద పారించిన భారత్‌ ఖాతాలో మరో క్లీన్‌స్వీప్‌. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ శుభ్‌మన్‌, సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్‌ శతకాలు బాదేసిన వేళ.. చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన భారత్‌.. సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది.

Updated : 25 Jan 2023 07:00 IST

సిరీస్‌ 3-0తో భారత్‌ క్లీన్‌స్వీప్‌
మూడో వన్డేలో కివీస్‌పై ఘనవిజయం
శతక్కొట్టిన గిల్‌, రోహిత్‌

టీమ్‌ఇండియాది అదే జోరు. మరోసారి పరుగుల వరద పారించిన భారత్‌ ఖాతాలో మరో క్లీన్‌స్వీప్‌. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ శుభ్‌మన్‌, సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్‌ శతకాలు బాదేసిన వేళ.. చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన భారత్‌.. సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. డెవాన్‌ కాన్వే మెరుపు శతకంతో కివీస్‌ను గట్టెక్కించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

టీమ్‌ఇండియా అదరగొట్టింది. చివరిదైన మూడో వన్డేలో మంగళవారం న్యూజిలాండ్‌ను 90 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (112; 78 బంతుల్లో 13×4, 5×6), రోహిత్‌ శర్మ (101; 85 బంతుల్లో 9×4, 6×6) శతకాలు బాదడంతో మొదట భారత్‌ 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ (3/45), కుల్‌దీప్‌ యాదవ్‌ (3/62) విజృంభించడంతో కివీస్‌ను 41.2 ఓవర్లలో 295 పరుగులకే పరిమితం చేసింది. కాన్వే (138; 100 బంతుల్లో 12×4, 8×6) మెరుపు శతకం న్యూజిలాండ్‌కు సరిపోలేదు. శార్దూల్‌ ఠాకూర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. శుభ్‌మన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌నూ భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

శార్దూల్‌ సూపర్‌: న్యూజిలాండ్‌ ఛేదనలో ఓపెనర్‌ కాన్వే ఇన్నింగ్సే హైలైట్‌. రెండో బంతికే మరో ఓపెనర్‌ అలెన్‌ను హార్దిక్‌ బౌల్డ్‌ చేసినా.. కివీస్‌ సానుకూల దృక్పథంతో సాగిందంటే కారణం కాన్వేనే. హార్దిక్‌తో పాటు సుందర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆరంభంలో జాగ్రత్తగానే ఆడినా.. క్రమంగా జోరు పెంచిన కాన్వే ఫోర్లు, సిక్స్‌లతో స్వేచ్ఛగా చెలరేగిపోయాడు. మరోవైపు నికోల్స్‌ కూడా ధాటిగా ఆడాడు. శార్దూల్‌ తొలి రెండు ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకున్నాడు. 15వ ఓవర్లో నికోల్స్‌ (42; 40 బంతుల్లో 3×4, 2×6)ను కుల్‌దీప్‌ ఔట్‌ చేశాడు. అయినా భారత్‌కు పెద్దగా ఉపశమనం లేదు. మరోవైపు మిచెల్‌ (24; 31 బంతుల్లో 2×4) నిలవగా కాన్వే దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువే ఉన్నా 25 ఓవర్లలో 184/2తో కివీస్‌ బలంగా నిలిచింది. కాన్వే సెంచరీ పూర్తి చేసి క్రీజులో ఉండడంతో చాలా ధీమాగా లక్ష్యం దిశగా సాగింది. కానీ శార్దూల్‌ చక్కని బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తొలి స్పెల్‌లో భారీగా పరుగులిచ్చిన అతడు ఈసారి చకచకా మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌ వెన్ను విరిచాడు. ఆ జట్టు ఆశలను దెబ్బతీసి.. టీమ్‌ఇండియాను పైచేయిలో నిలిపాడు. అతడి ధాటికి 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన కివీస్‌ 200/5తో నిలిచింది. ఇన్నింగ్స్‌ 26వ ఓవర్లో శార్దూల్‌ వరుస బంతుల్లో వికెట్లు సాధించాడు. ఓ బౌన్సర్‌తో మిచెల్‌ను వెనక్కి (కీపర్‌ క్యాచ్‌) పంపిన అతడు.. ఆ వెంటనే నకుల్‌ బాల్‌తో లేథమ్‌ను బోల్తా కొట్టించాడు. ఫుల్‌టాస్‌ను ఆడబోయిన లేథమ్‌.. మిడాఫ్‌లో హార్దిక్‌కు చిక్కాడు. శార్దూల్‌ తన తర్వాతి ఓవర్లో ఫిలిప్స్‌(5)ను ఔట్‌ చేశాడు. అయిదు వికెట్లు పోయినా కాన్వే క్రీజులో ఉండడంతో కివీస్‌ రేసులోనే ఉంది. కానీ 32వ ఓవర్లో జట్టు స్కోరు 230 వద్ద కాన్వేను ఉమ్రాన్‌ మాలిక్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ పట్టుబిగించింది. నిజానికి వ్యక్తిగత స్కోరు 58 వద్దే కాన్వే ఔట్‌ కావాల్సింది. కానీ తేలికైన స్టంపౌట్‌ అవకాశాన్ని ఇషాన్‌ చేజార్చాడు. కాన్వే ఔటయ్యాక.. బ్రాస్‌వెల్‌ (26), శాంట్నర్‌ (34) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 36 ఓవర్లకు స్కోరు 269/6. కానీ బ్రాస్‌వెల్‌ను కుల్‌దీప్‌ ఔట్‌ చేయడంతో కివీస్‌ ఓటమి ఖాయమైపోయింది. ఆ తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్‌ను ముగించడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు.

ఓపెనర్ల ధనాధన్‌: టాస్‌ గెలిచిన కివీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. చిన్న బౌండరీలున్న మైదానంలో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు చెలరేగిపోయారు. శుభ్‌మన్‌ గిల్‌ మరో శతకాన్ని ఖాతాలో వేసుకోగా.. చక్కని ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ మూడేళ్ల విరామం తర్వాత శతకాన్ని అందుకున్నాడు. నిజానికి వీళ్లిద్దరు తొలి అయిదు ఓవర్లు జాగ్రత్తగా ఆడారు. స్కోరు 31/0. కానీ ఆ తర్వాత విధ్వంసం మొదలైంది. ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. పరుగులే పరుగులు. కళాత్మక బ్యాటింగ్‌తో సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడిన గిల్‌.. నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో ఫెర్గూసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. షార్ట్‌ బంతిని అతడు అప్పర్‌కట్‌తో సిక్స్‌గా మలిచిన తీరు ఆకట్టుకుంది. గిల్‌ ఓ ముచ్చటైన డ్రైవ్‌తో శాంట్నర్‌ బంతిని ఎక్స్‌ట్రా కవర్లో బౌండరీకి తరలించి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. శాంట్నర్‌ తర్వాతి ఓవర్లో అతడి తలమీదుగా సిక్స్‌ కొట్టి రోహిత్‌ కూడా అర్ధశతకాన్ని అందుకున్నాడు. రోహిత్‌ అంతకుముందు కూడా అదిరే షాట్లు ఆడాడు. ఎదుర్కొన్న తొలి 26 బంతుల్లో 26 పరుగులే చేసిన అతడు ఆ తర్వాత రెచ్చిపోయాడు. డఫీ ఓవర్లో ఫోర్‌, రెండు సిక్స్‌లు దంచేశాడు. రోహిత్‌, గిల్‌ జోరు ఎలా సాగిందంటే ఓ దశలో వీళ్లాడే ప్రతి షాటూ బౌండరీ దిశగానే వెళ్లింది. రోహిత్‌, గిల్‌ కలిసి 22 ఫోర్లు, 11 సిక్స్‌లు బాదడంతో భారత్‌ 25వ ఓవర్లో 200కు చేరుకుంది. తర్వాతి ఓవర్లోనే ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు అలవోకగా 400 దాటేలాగా కనిపించింది. కానీ జోరుమీదున్న ఓపెనర్లను వరుస ఓవర్లలో ఔట్‌ చేసిన కివీస్‌ పోటీలోకి వచ్చింది. కోహ్లి (36)తో సమన్వయ లోపంతో ఇషాన్‌ కిషన్‌ (17) రనౌట్‌ కాగా.. కోహ్లి నిలదొక్కుకున్నాక భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (14) విఫలమయ్యాడు. 37 నుంచి 45 ఓవర్ల మధ్య 41 పరుగులే రాబట్టిన భారత్‌.. 325/6తో నిలిచింది. అయితే హార్దిక్‌ పాండ్య (54; 38 బంతుల్లో 3×4, 3×6) చెలరేగడంతో ఆఖరి అయిదు ఓవర్లలో 60 పరుగులు వచ్చాయి. శార్దూల్‌ (25; 17 బంతుల్లో 3×4, 1×6) కూడా కాస్త బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కానీ పరుగులు చేయడంలో కాదు.. ఇవ్వడంలో. కివీస్‌ బౌలర్‌ డఫి 10 ఓవర్లలో ఏకంగా 100 పరుగులిచ్చాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) బ్రాస్‌వెల్‌ 101; గిల్‌ (సి) కాన్వే (బి) టిక్నర్‌ 112; కోహ్లి (సి) అలెన్‌ (బి) డఫి 36; ఇషాన్‌ రనౌట్‌ 17; సూర్యకుమార్‌ (సి) కాన్వే (బి) డఫి 14; హార్దిక్‌ (సి) కాన్వే (బి) డఫి 54; సుందర్‌ (సి) మిచెల్‌ (బి) టిక్నర్‌ 9; శార్దూల్‌ (సి) లేథమ్‌ (బి) టిక్నర్‌ 25; కుల్‌దీప్‌ రనౌట్‌ 3; ఉమ్రాన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 385; వికెట్ల పతనం: 1-212, 2-230, 3-268, 4-284, 5-293, 6-313, 7-367, 8-379, 9-385; బౌలింగ్‌: డఫి 10-0-100-3; ఫెర్గూసన్‌ 10-1-53-0; టిక్నర్‌ 10-0-76-3; శాంట్నర్‌ 10-0-58-0; మిచెల్‌ 4-0-41-0; బ్రాస్‌వెల్‌ 6-0-51-1

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (బి) హార్దిక్‌ 0; కాన్వే (సి) రోహిత్‌ (బి) ఉమ్రాన్‌ 138; నికోల్స్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 42; మిచెల్‌ (సి) ఇషాన్‌ (బి) శార్దూల్‌ 24; లేథమ్‌ (సి) హార్దిక్‌ (బి) శార్దూల్‌ 0; ఫిలిప్స్‌ (సి) కోహ్లి (బి) శార్దూల్‌ 5; బ్రాస్‌వెల్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) కుల్‌దీప్‌ 26; శాంట్నర్‌ (సి) కోహ్లి (బి) చాహల్‌ 34; ఫెర్గూసన్‌ (సి) రోహిత్‌ (బి) కుల్‌దీప్‌ 7; డఫి ఎల్బీ (బి) చాహల్‌ 0; టిక్నర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (41.2 ఓవర్లలో ఆలౌట్‌) 295; వికెట్ల పతనం: 1-0, 2-106, 3-184, 4-184, 5-200, 6-230, 7-269, 8-279, 9-280; బౌలింగ్‌: హార్దిక్‌ 6-0-37-1; సుందర్‌ 6-0-49-0; శార్దూల్‌ 6-0-45-3; ఉమ్రాన్‌ 7-0-52-1; కుల్‌దీప్‌ 9-0-62-3; చాహల్‌ 7.2-0-43-2


* న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం గత 13 ఏళ్లలో భారత్‌కు ఇదే తొలిసారి.


* వన్డేల్లో రోహిత్‌ మూడేళ్ల తర్వాత శతకం సాధించాడు. అతను చివరగా 2020 జనవరిలో ఆస్ట్రేలియాపై మూడంకెల స్కోరును అందుకున్నాడు.


360

ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ పరుగులు. మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులతో (360) బాబర్‌ అజామ్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డును అతను సమం చేశాడు.


30

వన్డేల్లో రోహిత్‌ శతకాల సంఖ్య. సచిన్‌ (49), కోహ్లి (46)ల తర్వాత మూడో స్థానంలో ఉన్న పాంటింగ్‌ను అతను సమం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని