IND vs NZ: కివీస్‌తో ఇక ధనాధన్‌

ఇక దంచుడే. వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్‌ ఇండియా ఉంటే.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్‌ ఉంది.

Updated : 27 Jan 2023 07:14 IST

తొలి టీ20 నేడు
రాత్రి 7.30 నుంచి

ఇక దంచుడే. వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్‌ ఇండియా ఉంటే.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్‌ ఉంది. రెండు జట్ల మధ్య తొలి టీ20 నేడే. హార్దిక్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జోరు కొనసాగిస్తుందా అన్నది చూడాలి.

మరో ఆసక్తికర సమరానికి వేళైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మొదటి టీ20 శుక్రవారం జరగనుంది. రోహిత్‌, కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలతో హార్దిక్‌ నేతృత్వంలోని యువ జట్టు మరోసారి చెలరేగాలని తహతహలాడుతోంది. రాహుల్‌, షమి, సిరాజ్‌లకు కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన కివీస్‌ ఈ సిరీస్‌లో ఎలా ప్రతిఘటిస్తుందో చూడాలి.

ఇషాన్‌, గిల్‌ ఓపెనింగ్‌: జోరుమీదున్న టీమ్‌ఇండియా రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. గిల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండడం భారత్‌కు గొప్ప సానుకూలాంశం. వన్డే సిరీస్‌లో అతడు పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇక పొట్టి ఫార్మాట్లో మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ జోరు తెలిసిందే. వీళ్లతో పాటు రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడాలతో భారత బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షా ఓ ఓపెనింగ్‌ ప్రత్యామ్నాయం. అయితే అతడు నిరీక్షించక తప్పదని కెప్టెన్‌ హార్దిక్‌ చెప్పాడు. గిల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని తెలిపాడు. గిల్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. బ్యాటింగ్‌లో భారత్‌ మెరుగ్గానే కనిపిస్తున్నా బౌలింగ్‌లోనూ పుంజుకోవాల్సివుంది. శ్రీలంకతో సిరీస్‌లో పేస్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో పుణెలో జరిగిన టీ20లో అతడు కేవలం 2 ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. అర్ష్‌దీప్‌ మరింత నిలకడగా బౌలింగ్‌ చేయాలని జట్టు ఆశిస్తోంది. అయితే బౌలింగ్‌లో భారత్‌కు ఉత్సాహాన్నిచ్చే అంశం కూడా ఒకటుంది. శ్రీలంకతో సిరీస్‌లో పొట్టి క్రికెట్‌ అరంగేట్రం చేసిన పేస్‌ బౌలర్‌ శివమ్‌ మావి ఆకట్టుకున్నాడు. మంచి వేగంతో బౌలింగ్‌ చేసిన అతడు లంకతో తొలి టీ20లో 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌తో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకుంటాడు. సుందర్‌తో కలిసి ఎవరు స్పిన్‌ బాధ్యతలు తీసుకుంటారన్నదే ఆసక్తికరం. చాహల్‌, కుల్‌దీప్‌ మధ్య పోటీ ఉంది. కుల్‌దీప్‌కే అవకాశాలు మెండు.

కివీస్‌ పరిస్థితిలా..: వన్డే సిరీస్‌ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తుందనడంలో సందేహం లేదు. కానీ విలియమ్సన్‌, సౌథీ లేకపోవడం ఈ సిరీస్‌లోనూ ఆ జట్టుకు లోటే. జట్టుకు శాంట్నర్‌ నాయకత్వం వహించనున్నాడు. ఫిన్‌ అలెన్‌, కాన్వే, ఫిలిప్స్‌, బ్రాస్‌వెల్‌ వంటి వారితో కివీస్‌ బ్యాటింగ్‌ మెరుగే. ఇండోర్‌ వన్డేలో కేవలం 100 బంతుల్లో 138 పరుగులు చేసిన కాన్వే జోరుమీదున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో 188 పరుగులు చేసిన బ్రాస్‌వెల్‌ పొట్టి ఫార్మాట్లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. అయితే ఫెర్గూసన్‌ మినహా పేస్‌ బౌలింగ్‌లో అనుభవజ్ఞులు లేకపోవడం న్యూజిలాండ్‌కు సమస్యే. బెన్‌ లిస్టర్‌, హెన్రీ షిప్లీ ఈ ఫార్మాట్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. టిక్నర్‌, డఫీలు ఆడిన టీ20లు తక్కువే. అయితే స్పిన్నర్‌ ఇష్‌ సోథికి భారత్‌లో మంచి రికార్డు ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం.

తుది జట్లు (అంచనా)... భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌, హార్దిక్‌, దీపక్‌ హుడా, సుందర్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌, కుల్‌దీప్‌;

న్యూజిలాండ్‌: అలెన్‌, కాన్వే, చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌, బ్రాస్‌వెల్‌, శాంట్నర్‌, టిక్నర్‌, ఇష్‌ సోధి, బెన్‌ లిస్టర్‌, ఫెర్గూసన్‌


‘‘టీ20లు, వన్డేలు రెండింటిలోనూ న్యూజిలాండ్‌ మంచి జట్టే. ఆ జట్టు ఎప్పుడూ గట్టి సవాలు విసురుతుంది. కివీస్‌ను ఓడించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి’’ - హార్దిక్‌ పాండ్య


పిచ్‌..

రాంచీలో జరిగిన 25 టీ20 మ్యాచ్‌ల్లో 16 సార్లు ఛేదించిన జట్లే గెలిచాయి. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు మెండు. రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని