VVS Laxman: నా ఆట మెరుగయ్యేలా బాబీ సాయం చేశారు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

తన ఆటను మెరుగుపర్చుకోవడంలో  మాజీ క్రికెటర్‌ ఎంవీ నరసింహారావు (బాబీ) సాయం చేశాడని జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వెల్లడించాడు.

Updated : 05 Feb 2023 12:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: తన ఆటను మెరుగుపర్చుకోవడంలో  మాజీ క్రికెటర్‌ ఎంవీ నరసింహారావు (బాబీ) సాయం చేశాడని జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వెల్లడించాడు. శనివారం సికింద్రాబాద్‌ క్లబ్‌లో నరసింహారావు ఆత్మకథ ‘బాబీ.. ఇండియా అండ్‌ ఐర్లాండ్‌.. ఏ లవ్‌ స్టోరీ’ పుస్తక ఆవిష్కరణ జరిగింది. లక్ష్మణ్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘1987లో హైదరాబాద్‌ రంజీ టైటిల్‌ గెలిచిన తర్వాత తొలిసారి బాబీని కలిశా. వీలైనప్పుడల్లా నా ఆట మెరుగయ్యేందుకు అతను సాయం చేశాడు. ఐర్లాండ్‌లో మైదానం బయట అతని సేవలు స్ఫూర్తిగా నిలిచాయి. అతనికి అక్కడ లభిస్తోన్న ప్రేమ, గౌరవం చూస్తుంటే గొప్పగా ఉంది. క్రికెటర్‌గా ఎదిగేటప్పుడు తనపై బాబీ ప్రభావం ఉందని మోర్గాన్‌ (ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌) చెప్పడం విశేషం’’ అని లక్ష్మణ్‌ తెలిపాడు. బాబీ మైదానం లోపల, బయట ఓ రాక్‌స్టార్‌ అని రోజర్‌ బిన్నీ పేర్కొన్నాడు. పాత్రికేయుడు కానర్‌ షార్కీతో కలిసి నరసింహారావు తన ఆత్మకథను పుస్తకంగా తీసుకొచ్చాడు. క్రికెట్‌ వర్గాల్లో బాబీగా సుపరిచితమైన అతను భారత్‌ తరపున నాలుగు టెస్టులాడాడు. చివరగా రంజీల్లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు (1987) అతనే కెప్టెన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని