సంక్షిప్త వార్తలు (6)

టీమ్‌ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ కౌంటీ క్రికెట్లో ఆడనున్నాడు. చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సలహా మేరకు సుదీర్ఘ ఫార్మాట్‌పై పట్టుసాధించడం కోసం అర్ష్‌దీప్‌ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.

Updated : 18 Mar 2023 13:28 IST

కెంట్‌కు ఆడనున్న అర్ష్‌దీప్‌

కెంట్‌: టీమ్‌ఇండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ కౌంటీ క్రికెట్లో ఆడనున్నాడు. చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సలహా మేరకు సుదీర్ఘ ఫార్మాట్‌పై పట్టుసాధించడం కోసం అర్ష్‌దీప్‌ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. రానున్న ఇంగ్లిష్‌ కౌంటీ సీజన్‌లో కెంట్‌ తరఫున అతను అయిదు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడతాడు. ‘‘ఇంగ్లాండ్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నా. నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా. గొప్ప చరిత్ర కలిగిన క్రికెట్‌ క్లబ్‌ కెంట్‌ అని ద్రవిడ్‌ నాతో అన్నారు’’ అని అర్ష్‌దీప్‌ తెలిపాడు. ఐపీఎల్‌ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌కు వెళ్తుంది. ఆ సమయంలో అర్ష్‌దీప్‌ అక్కడే ఉండనున్నాడు.


న్యూజిలాండ్‌ 155/2

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో రెండో టెస్టును న్యూజిలాండ్‌ మెరుగ్గా ఆరంభించింది. తొలి రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. డెవాన్‌ కాన్వే (78) రాణించాడు. లేథమ్‌ (21)తో తొలి వికెట్‌కు అతడు 87 పరుగులు జోడించాడు. విలియమ్సన్‌ (26), నికోల్స్‌ (18) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా మొదటి రోజు 48 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఉదయం సెషన్లో ఒక్క బంతి కూడా పడలేదు.


ఐర్లాండ్‌ పర్యటనకు భారత్‌

డబ్లిన్‌: భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. డబ్లిన్‌ వేదికగా ఈ ఆగస్టులో ఈ సిరీస్‌ జరగనుంది. ఆగస్టు 18-23 మధ్య ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. హార్దిక్‌ పాండ్య సారథ్యంలోని భారత జట్టు గతేడాది ఐర్లాండ్‌లో రెండు టీ20ల సిరీస్‌ ఆడి 2-0తో నెగ్గింది.


ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌ నేడు

ఏటీకే × బెంగళూరు
రాత్రి 7.30 నుంచి

మార్గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్‌కు వేళైంది. తొలిసారి టైటిల్‌ ఆశిస్తున్న ఏటీకే మోహన్‌ బగాన్‌.. ఇప్పటికే ఒకసారి ఈ ట్రోఫీ నెగ్గిన బెంగళూరు ఎఫ్‌సీతో శనివారం పోటీకి సిద్ధమైంది. ఫైనల్‌ చేరే క్రమంలో చివరిగా ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో ఏటీకే అజేయంగా నిలిచింది. స్టార్‌ ఆటగాడు సునీల్‌ ఛెత్రి బెంగళూరుకు పెద్ద బలం. గత నాలుగు మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గోల్స్‌ కొట్టాడతను. గత ఆరు ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌ల్లో బెంగళూరు ఒక్కసారి మాత్రమే ఏటీకే మోహన్‌ బగాన్‌ను ఓడించింది. 2018-19 సీజన్లో బెంగళూరు ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ నెగ్గగా.. గత సీజన్లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటిదాకా మోహన్‌ బగాన్‌కు ఉత్తమ ప్రదర్శన.


ఉత్తమ హాకీ క్రీడాకారులుగా హార్దిక్‌, సవిత

దిల్లీ: హాకీ ఇండియా 2022 ఏడాది ఉత్తమ క్రీడాకారులుగా పురుషుల్లో హార్దిక్‌ సింగ్‌, మహిళల్లో సవిత పునియా ఎంపికయ్యారు. సీనియర్లు మన్‌ప్రీత్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌లను వెనక్కినెట్టి హార్దిక్‌ ఈ అవార్డు గెలుచుకున్నాడు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో హార్దిక్‌ సత్తా చాటాడు. గతేడాది డిసెంబర్‌లో భారత మహిళల జట్టు నేషన్స్‌ కప్‌ విజయంలో గోల్‌కీపర్‌ సవిత ప్రధానభూమిక పోషించింది.


క్రికెట్‌కు పైన్‌ వీడ్కోలు

హోబర్ట్‌: ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. శుక్రవారం టాస్మానియా, క్వీన్స్‌లాండ్‌ మధ్య షెఫీల్డ్‌ షీల్డ్‌ దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ అనంతరం అతడు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. 2018 నుంచి 2021 వరకు 23 టెస్టుల్లో పైన్‌ ఆసీస్‌కు సారథ్యం వహించాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం అనంతరం స్టీవ్‌ స్మిత్‌పై వేటుపడటంతో అతని స్థానంలో పైన్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే 2021 చివర్లో క్రికెట్‌ టాస్మానియా మాజీ ఉద్యోగినికి అసభ్యకర సందేశాలు పంపినట్లు తేలడంతో పైన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆసీస్‌ తరఫున పైన్‌ 35 టెస్టులు, 35 వన్డేలు, 12 టీ20లు ఆడాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని