దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్‌

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఆసక్తికర సమరానికి వేళైంది. ఇప్పటికే ఫైనల్‌ చేరిన దిల్లీ క్యాపిటల్స్‌తో కప్‌ కోసం తలపడే జట్టు తేలేది నేడే.

Published : 24 Mar 2023 04:08 IST

రాత్రి 7.30 నుంచి

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఆసక్తికర సమరానికి వేళైంది. ఇప్పటికే ఫైనల్‌ చేరిన దిల్లీ క్యాపిటల్స్‌తో కప్‌ కోసం తలపడే జట్టు తేలేది నేడే. ఎలిమినేటర్‌లో బలమైన ముంబయి ఇండియన్స్‌తో యూపీ వారియర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. బలాబలాలు లెక్కలు వేసుకుంటే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబయే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ స్ఫూర్తిదాయక ఆటతో సత్తా చాటుతున్న వారియర్స్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే యూపీతో ఆడిన గత మ్యాచ్‌లో ముంబయి ఓడిపోయింది. ఈ నేపథ్యంలో యూపీపై నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబయి పట్టుదలగా ఉంది. హర్మన్‌ప్రీత్‌ స్థిరంగా రాణిస్తుండడం ముంబయికి సానుకూలాంశం. నాట్‌ సీవర్‌, యాస్తిక భాటియా సత్తా చాటితే ఆ జట్టును ఆపడం యూపీకి కష్టమే. అమేలియా కేర్‌ రాణించడం ముంబయికి కీలకం. మరోవైపు యూపీ కెప్టెన్‌ అలీసా హీలీ, తాలియా మెక్‌గ్రాత్‌లనే నమ్ముకుంది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన గ్రేస్‌ హారిస్‌ తుది జట్టులో ఆడితే యూపీ గట్టి పోటీనే ఇవ్వగలదు. సమష్టిగా రాణిస్తోన్న యూపీ అంచనాల మేరకు ఆడితే ముంబయికి ఇంకోసారి ఝలక్‌ ఇవ్వగలదు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలమైన నేపథ్యంలో యూపీకి ఎకిల్‌స్టోన్‌.. ముంబయికి సైకా కీలకం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని