ఐపీఎల్‌కు ఎవరూ దూరం కాకపోవచ్చు

గాయపడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పనిభార నిర్వహణలో భాగంగా ఏ ఆటగాడైనా ఐపీఎల్‌కు దూరం కావడం అనుమానమేనని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు

Updated : 24 Mar 2023 07:53 IST

చెన్నై: గాయపడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పనిభార నిర్వహణలో భాగంగా ఏ ఆటగాడైనా ఐపీఎల్‌కు దూరం కావడం అనుమానమేనని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘‘గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తుది జట్టులో ఉండే ఆటగాళ్లను కోల్పోతున్నాం. ఆటగాళ్లకు తమ శరీరాన్ని ఎలా చూసుకోవాలో తెలుసు. ఐపీఎల్‌లో పని భారం ఎక్కువవుతుందని అనిపిస్తే ఎప్పుడైనా మాతో మాట్లాడొచ్చు. ఒకట్రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ అలా జరగడం అనుమానమే’’ అని చెప్పాడు. ఐపీఎల్‌ ముగిశాక డబ్ల్యూటీసీ ఫైనల్‌ (జూన్‌ 7)కు సిద్ధం కావడానికి భారత ఆటగాళ్లకు కొన్ని రోజుల సమయమే ఉంటుంది. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సంకేతాలిచ్చిందని రోహిత్‌ పేర్కొన్నాడు. ‘‘ఇక ఇప్పుడంతా ఫ్రాంఛైజీల చేతుల్లో ఉంది. ఆటగాళ్లు ఫ్రాంఛైజీల సొంతం. మేం కొన్ని సంకేతాలిచ్చాం. చివరికి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఫ్రాంఛైజీలే. ముఖ్యంగా ఆటగాళ్లు తమ శరీరాలను తామే జాగ్రత్తగా చూసుకోవాలి’’ అని చెప్పాడు.


ఆసియాకప్‌ పాకిస్థాన్‌లో..భారత్‌ మ్యాచ్‌లు యూఏఈలో!

దుబాయ్‌: ఆసియా కప్‌లో భారత్‌ ఆడనుంది. అయితే పాకిస్థాన్‌లో కాదు. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే సెప్టెంబరులో పాకిస్థాన్‌లో ఈ టోర్నీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఆ దేశ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అంటున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా టీమ్‌ఇండియా మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహించడానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్‌ మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇవ్వొచ్చని సమాచారం. ఇంగ్లాండ్‌, శ్రీలంకలు కూడా వేదికలుగా పరిశీలనలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని