GT vs CSK: ఛాంపియన్‌ చమక్‌

మిల్లర్‌ అందుబాటులో లేడు.. విలియమ్సన్‌ గాయపడి బ్యాటింగ్‌కే రాలేదు.. హార్దిక్‌ పాండ్య పట్టుమని పది పరుగులైనా చేయలేదు. లక్ష్యం చూస్తే దాదాపు 180! అయితేనేం గుజరాత్‌ టైటాన్స్‌ తగ్గలేదు.

Updated : 01 Apr 2023 06:56 IST

అదరగొట్టిన శుభ్‌మన్‌
ఐపీఎల్‌-16లో గుజరాత్‌ శుభారంభం
రుతురాజ్‌ మెరుపులు వృథా

మిల్లర్‌ అందుబాటులో లేడు.. విలియమ్సన్‌ గాయపడి బ్యాటింగ్‌కే రాలేదు.. హార్దిక్‌ పాండ్య పట్టుమని పది పరుగులైనా చేయలేదు. లక్ష్యం చూస్తే దాదాపు 180! అయితేనేం గుజరాత్‌ టైటాన్స్‌ తగ్గలేదు. నిరుడు ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి సీజన్లోనే అంచనాల్ని మించి రాణించి టైటిల్‌ ఎగరేసుకుపోయిన ఆ జట్టు.. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో కూడా చెన్నై సూపర్‌కింగ్స్‌ విసిరిన సవాలును కాచుకుని విజయం సాధించింది. ఒత్తిడిలో ప్రశాంతంగా మెరుపులు మెరిపించిన శుభ్‌మన్‌ గిల్‌ గుజరాత్‌ హీరో. చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ వృథా అయింది.

అహ్మదాబాద్‌ : ఐపీఎల్‌-16 ఆరంభ పోరులో ఆరంభ వీరులదే జోరు. చెన్నై తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ (92; 50 బంతుల్లో 4×4, 9×6) చెలరేగిపోతే.. గుజరాత్‌ వైపు నుంచి శుభ్‌మన్‌ గిల్‌ (63; 36 బంతుల్లో 6×4, 3×6) రెచ్చిపోయాడు. అయితే మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేయడంతో విజయం డిఫెండింగ్‌ ఛాంపియన్‌నే వరించింది. రుతురాజ్‌ మెరుపులతో మొదట చెన్నై 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. శుభ్‌మన్‌కు తోడు సాహా (25; 16 బంతుల్లో 2×4, 2×6), విజయ్‌ శంకర్‌ (27; 21 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని టైటాన్స్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో అరంగేట్ర బౌలర్‌ రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌   (3/36) ఆకట్టుకున్నాడు.

అయినా తగ్గలేదు: ఛేదన మొదలవడానికి ముందే టైటాన్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ విలియమ్సన్‌ బ్యాటింగ్‌కు దూరమయ్యాడు. అయితే ఆ ప్రభావం కనిపించనివ్వకుండా గుజరాత్‌ ఛేదనలో దూసుకెళ్లింది. సాహా ఉన్నంతసేపు మెరుపు షాట్లు ఆడి జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చాడు. అతను వెనుదిరిగాక శుభ్‌మన్‌ అందుకున్నాడు. అతను చక్కటి క్రికెటింగ్‌ షాట్లతోనే చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. విలియమ్సన్‌ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సుదర్శన్‌ కూడా నిలకడగా ఆడటంతో టైటాన్స్‌ లక్ష్యం వైపు పరుగులు పెట్టింది. గిల్‌ 30 బంతుల్లోనే అర్ధశతకాన్ని చేరుకోగా.. టైటాన్స్‌ 11 ఓవర్లకే 100 దాటిపోయింది. సుదర్శన్‌, హార్దిక్‌ (8) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా.. గిల్‌ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. 15వ ఓవర్‌ చివరి బంతికి అతను ఔటవడంతో చెన్నై పోటీలోకి వచ్చింది. సమీకరణం 5 ఓవర్లలో 41గా మారింది. అయితే గతంలో ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న విజయ్‌ శంకర్‌ ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ను ఆదుకున్నాడు. సమయోచితంగా షాట్లు ఆడి జట్టును విజయానికి చేరువ చేశాడు. కానీ 18వ ఓవర్లో అతను ఔట్‌ కావడంతో మళ్లీ ఉత్కంఠ తప్పలేదు. గుజరాత్‌ 9 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి రావడంతో చెన్నైలో ఆశలు రేగాయి. కానీ రషీద్‌ ఖాన్‌ (10 నాటౌట్‌), తెవాతియా (15 నాటౌట్‌) మెరుపు షాట్లు ఆడి 4 బంతులుండగానే గుజరాత్‌ను గెలిపించారు.

అతనొక్కడే..: 50 బంతుల్లో 92 పరుగులు.. ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఈ స్థాయిలో చెలరేగితే.. ఆ జట్టు అలవోకగా 200 దాటేసి ఉండాలి. కానీ రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ను చెన్నై ఉపయోగించుకోలేకపోయింది. 178 పరుగులకే పరిమితం అయింది. ఓ ఎండ్‌లో రుతురాజ్‌ రెచ్చిపోయి ఆడుతున్నా.. అతడితో మిగతా బ్యాటర్లు భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడం వల్ల అనుకున్న దాని కంటే తక్కువ స్కోరే చేసింది. రుతురాజ్‌ తర్వాత మొయిన్‌ అలీ (23)వే అత్యధిక పరుగులు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆరంభంలోనే కాన్వే (1)ను షమి (2/29) బౌల్డ్‌ చేయడంతో చెన్నైకి శుభారంభం దక్కలేదు. కానీ మొయిన్‌ ఉన్నంతసేపూ ధాటిగా బ్యాటింగ్‌ చేయడం.. రుతురాజ్‌ కూడా చక్కటి షాట్లు ఆడటంతో చెన్నై ఆరో ఓవర్లోనే 50 మార్కును చేరుకుంది. కానీ ఆ ఓవర్లోనే బౌలింగ్‌ ఆరంభించిన రషీద్‌ (2/26).. మొయిన్‌ను ఔట్‌ చేసి చెన్నైని దెబ్బ కొట్టాడు. కాసేపటికే బెన్‌ స్టోక్స్‌ (7)ను కూడా అతనే పెవిలియన్‌ చేర్చాడు. కానీ సీఎస్‌కే స్కోరు వేగం మాత్రం తగ్గలేదు. రుతురాజ్‌ సిక్సర్ల మోత మోగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌ నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. రాయుడు (12), శివమ్‌ దూబె (19) ఇబ్బంది పడ్డారు. కానీ రుతురాజ్‌ మాత్రం స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ సాగిపోయాడు. 23 బంతుల్లోనే అర్ధశతకాన్నందుకున్న అతను.. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించడంతో చెన్నై 17 ఓవర్లకే 150కి చేరుకుంది. అప్పటికే రుతురాజ్‌ 92 మీద నిలవడంతో సెంచరీ లాంఛనమే అనిపించింది. కానీ జోసెఫ్‌ (2/33) వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికి భారీ షాట్‌ ఆడబోయి రుతురాజ్‌ ఔటైపోయాడు. ఆ వెంటనే జడేజా (1) కూడా వెనుదిరిగాడు. ఆపై దూబె, ధోని (14 నాటౌట్‌) కొన్ని షాట్లతో స్కోరు 180కి చేరువ చేశారు.


స్కోరు వివరాలు

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (బి) షమి 1; రుతురాజ్‌ (సి) శుభ్‌మన్‌ (బి) జోసెఫ్‌ 92; మొయిన్‌ అలీ (సి) సాహా (బి) రషీద్‌ 23; స్టోక్స్‌ (సి) సాహా (బి) రషీద్‌ 7; రాయుడు (బి) లిటిల్‌ 12; దూబె (సి) రషీద్‌ (బి) షమి 19; జడేజా (సి) శంకర్‌ (బి) జోసెఫ్‌ 1; ధోని నాటౌట్‌ 14; శాంట్నర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-14, 2-50, 3-70, 4-121, 5-151, 6-153, 7-163
బౌలింగ్‌: షమి 4-0-29-2; హార్దిక్‌ 3-0-28-0; లిటిల్‌ 4-0-41-1; రషీద్‌ ఖాన్‌ 4-0-26-2; అల్జారి జోసెఫ్‌ 4-0-33-2; యశ్‌ దయాళ్‌ 1-0-14-0

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) దూబె (బి) రాజ్యవర్ధన్‌ 25; శుభ్‌మన్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 63; సుదర్శన్‌ (సి) ధోని (బి) రాజ్యవర్ధన్‌ 22; హార్దిక్‌ (బి) జడేజా 8; శంకర్‌ (సి) శాంట్నర్‌ (బి) రాజ్యవర్ధన్‌ 27; తెవాతియా నాటౌట్‌ 15; రషీద్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 182
వికెట్ల పతనం: 1-37, 2-90, 3-111, 4-138, 5-156
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-29-0; తుషార్‌ దేశ్‌పాండే 3.2-0-51-1; రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ 4-0-36-3; శాంట్నర్‌ 4-0-32-0; జడేజా 4-0-28-1


డబుల్‌ ధమాకా

మొహాలి: ఘనంగా ఆరంభమైన ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలి డబుల్‌ ధమాకాకు రంగం సిద్ధమైంది. శనివారం పంజాబ్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌తో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ తలపడనున్నాయి. మొహాలిలో కొత్త కెప్టెన్ల సారథ్యంలో పంజాబ్‌, కోల్‌కతా ఆడబోతున్నాయి. ధావన్‌ నాయకత్వంలోని పంజాబ్‌.. వేలంలో అత్యధిక ధర పలికిన సామ్‌ కరన్‌తో పాటు అర్ష్‌దీప్‌, రాహుల్‌ చాహర్‌, భానుక రాజపక్స, షారుక్‌ ఖాన్‌, మాథ్యూ షార్ట్‌, సికందర్‌ రాజా లాంటి ఆటగాళ్లతో బలంగానే ఉంది. గాయంతో బెయిర్‌స్టో మొత్తం సీజన్‌కు, లివింగ్‌స్టోన్‌ తొలి మ్యాచ్‌కు దూరమవడం ఆ జట్టుకు దెబ్బే. అలాగే రబాడ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. మరోవైపు కొత్త కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌, కొత్త కెప్టెన్‌ నితీష్‌ రాణా ఆధ్వర్యంలో కోల్‌కతా ఉత్సాహంతో ఉంది. ఆ జట్టు ఆల్‌రౌండర్లు రసెల్‌, నరైన్‌, వీస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌పై ఆధారపడింది. మరోవైపు లఖ్‌నవూలో దిల్లీ, లఖ్‌నవూ మధ్య రాత్రి మ్యాచ్‌ జరుగుతుంది. వార్నర్‌ కెప్టెన్సీలో దిల్లీ బరిలో దిగుతోంది. ఇటీవల భారత్‌తో వన్డే సిరీస్‌లో చెలరేగిన మిచెల్‌ మార్ష్‌పైనే అందరి కళ్లు ఉండనున్నాయి. మరోవైపు జాతీయ జట్టు తరపున నిలకడగా విఫలమవుతున్న లఖ్‌నవూ సారథి కేఎల్‌ రాహుల్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని