RCB vs GT: ఆర్సీబీకి గిల్‌ స్ట్రోక్‌

బెంగళూరుకు భంగపాటు. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్‌ చేరాలనుకున్న ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమితో ఆర్సీబీ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది.

Updated : 22 May 2023 06:59 IST

ఛేదనలో శుభ్‌మన్‌ మెరుపు శతకం
బెంగళూరుపై టైటాన్స్‌ విజయం
కోహ్లి సెంచరీ వృథా

బెంగళూరు: బెంగళూరుకు భంగపాటు. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నెగ్గి ప్లేఆఫ్స్‌ చేరాలనుకున్న ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమితో ఆర్సీబీ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. విరాట్‌ కోహ్లి సూపర్‌ శతకం వృథా అయింది. ఎప్పుడో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన టైటాన్స్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (104 నాటౌట్‌; 52 బంతుల్లో 5×4, 8×6) సూపర్‌ శతకంతో ఆదివారం 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. విరాట్‌ కోహ్లి (101 నాటౌట్‌; 61 బంతుల్లో 13×4, 1×6) శతకంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. గిల్‌తో పాటు విజయ్‌ శంకర్‌ (53; 35 బంతుల్లో 7×4, 2×6)  మెరవడంతో లక్ష్యాన్ని టైటాన్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా మొదలైంది.

శుభ్‌మన్‌ అదుర్స్‌..: ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ ఆటే హైలైట్‌. పోరాటంతో, వరుసగా రెండో శతకంతో అతడు టైటాన్స్‌కు విజయాన్నందించాడు. మరో ఓపెనర్‌ సాహా (12) త్వరగానే ఔటైనా.. గిల్‌ అదరగొట్టాడు. అయిదు ఓవర్లకు గుజరాత్‌ స్కోరు 35 పరుగులే అయినా.. ఆ తర్వాత గిల్‌ చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిల్‌ చూడచక్కని షాట్లతో అలరించాడు. వైశాఖ్‌, హిమాంశు ఓవర్లలో సిక్స్‌లు కొట్టాడు. విజయ్‌ శంకర్‌ కూడా రాణించడంతో గుజరాత్‌ 10 ఓవర్లలో 90/1తో నిలిచింది.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన గిల్‌ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. విజయ్‌ శంకర్‌ దూకుడుగా ఆడకపోయినా.. గిల్‌ మాత్రం ధనాధన్‌ బ్యాటింగ్‌ను కొనసాగించడంతో గుజరాత్‌ సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. బ్రాస్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లో గిల్‌.. లాంగ్‌ లెగ్‌, డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌లు బాదేశాడు.  మరోవైపు విజయ్‌ శంకర్‌ కూడా జోరందుకుని వైశాఖ్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6 దంచేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఆ వెంటనే శానక (0)ను హర్షల్‌ ఔట్‌ చేయడం, స్కోరు వేగం తగ్గడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. బెంగళూరు పోటీలోకి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో టైటాన్స్‌ 34 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 18వ ఓవర్లో మిల్లర్‌ (6)ను సిరాజ్‌ ఔట్‌ చేసినా.. సూపర్‌ బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ గిల్‌ రెండు సిక్స్‌లు కొట్టాడు. అదే ఊపులో 19వ ఓవర్లో అతడు మరో సిక్స్‌ కొట్టాడు. హర్షల్‌ వేసిన ఆ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో టైటాన్స్‌కు 8 పరుగులు అవసరం కాగా.. పార్నెల్‌ మొదట నోబాల్‌, ఆ తర్వాత వైడ్‌ వేశాడు. ఆ తర్వాత సిక్స్‌ దంచిన గిల్‌ జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు.

వారెవ్వా విరాట్‌:

బెంగళూరు ఇన్నింగ్స్‌లో కోహ్లీనే హీరో. ఛాలెంజర్స్‌ అంత స్కోరు చేసిందంటే అందుకు ప్రధాన కారణం అతడి విలువైన ఇన్నింగ్సే. జట్టు తడబడ్డా కోహ్లి కడవరకూ క్రీజులో నిలవడంతో గట్టి సవాలు గుజరాత్‌ ముందు నిలిచింది. ఆద్యంతమూ చూడముచ్చటైన షాట్లతో కనువిందు చేసిన విరాట్‌.. వరుసగా రెండో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి కోహ్లి, డుప్లెసిస్‌ (28; 19 బంతుల్లో 5×4) అదిరే ఆరంభాన్నిచ్చారు. షమి ఓవర్లో డుప్లెసిస్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టగా.. యశ్‌ దయాల్‌ ఓవర్లో కోహ్లి వరుసగా మూడు బంతులను బౌండరీ దాటించాడు. పవర్‌ప్లే ముగిసే సరికే బెంగళూరు 62/0తో భారీ స్కోరుపై కన్నేసింది. కానీ చకచకా మూడు వికెట్లు కోల్పోయి 85/3తో నిలిచింది. అయితే చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన కోహ్లి.. బ్రాస్‌వెల్‌ (26; 16 బంతుల్లో 5×4)తో కలిసి ఇన్నింగ్స్‌ను తిరిగి గాడినపెట్టాడు. బ్రాస్‌వెల్‌ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. 14 ఓవర్లలో 127/3తో ఆర్సీబీ మళ్లీ మంచి స్థితికి వచ్చింది. కానీ వెంటవెంటనే బ్రాస్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌ (0) వికెట్లు చేజార్చుకుని 133/5తో నిలిచింది. ఆ దశలో కోహ్లి మరోసారి జట్టును నిలబెట్టాడు. అనుజ్‌ రావత్‌ (23 నాటౌట్‌) ఇచ్చిన కాస్త సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లి.. ప్రత్యర్థి బౌలర్లకు చిన్న అవకాశమైనా ఇవ్వకుండా ముచ్చటైన షాట్లతో చిన్నస్వామిలో అభిమానులను ఉర్రూతలూగించాడు. మోహిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు.. యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా కొట్టిన ఫ్లాట్‌ సిక్స్‌ను చూసి తీరాల్సిందే. ఆ తర్వాత అతడు మోహిత్‌ను మరో రెండు ఫోర్లతో దండించాడు. చివరి ఓవర్లో సింగిల్‌తో కోహ్లి శతకం పూర్తిగా చేయగా.. రావత్‌ ఓ సిక్స్‌, ఫోర్‌ దంచేశాడు. విరాట్‌ జోరుతో బెంగళూరు చివరి అయిదు ఓవర్లలో 61 పరుగులు రాబట్టింది. రావత్‌తో అభేద్యమైన ఆరో వికెట్‌కు అతడు 64 పరుగులు జోడించాడు.


బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 101; డుప్లెసిస్‌ (సి) తెవాతియా (బి) నూర్‌ అహ్మద్‌ 28; మ్యాక్స్‌వెల్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 11; లొమ్రార్‌ (స్టంప్డ్‌) సాహా (బి) నూర్‌ అహ్మద్‌ 1; బ్రాస్‌వెల్‌ (సి) అండ్‌ (బి) షమి 26; దినేశ్‌ కార్తీక్‌ (సి) సాహా (బి) యశ్‌ దయాల్‌ 0; అనుజ్‌ రావత్‌ నాటౌట్‌ 23; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 197; వికెట్ల పతనం: 1-67, 2-80, 3-85, 4-132, 5-133; బౌలింగ్‌: షమి 4-0-39-1; యశ్‌ దయాల్‌ 4-0-39-1; రషీద్‌ ఖాన్‌ 4-0-24-1; నూర్‌ అహ్మద్‌ 4-0-39-2; మోహిత్‌ 4-0-54-0
గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) పార్నెల్‌ (బి) సిరాజ్‌ 12; శుభ్‌మన్‌ నాటౌట్‌ 104; శంకర్‌ (సి) కోహ్లి (బి) వైశాఖ్‌ 53; శానక (సి) ప్రభుదేశాయ్‌ (బి) హర్షల్‌ 0; మిల్లర్‌ (సి) ప్రభుదేశాయ్‌ (బి) సిరాజ్‌ 6; తెవాతియా నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం: (19.1 ఓవర్లలో  4 వికెట్లకు) 198; వికెట్ల పతనం: 1-25, 2-148, 3-150, 4-171; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-32-2; పార్నెల్‌ 3.1-0-42-0; వైశాఖ్‌ 4-0-40-1; హిమాంశు 3-0-28-0; హర్షల్‌ 4-0-29-1; బ్రాస్‌వెల్‌ 1-0-16-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని