Sehwag: విండీస్‌ పతనానికి కారణమదే: సెహ్వాగ్‌

ప్రాంతీయ రాజకీయాలే వెస్టిండీస్‌ క్రికెట్‌ను దెబ్బ తీశాయని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘వెస్టిండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం సిగ్గు చేటు.

Updated : 03 Jul 2023 08:58 IST

దిల్లీ: ప్రాంతీయ రాజకీయాలే వెస్టిండీస్‌ క్రికెట్‌ను దెబ్బ తీశాయని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘వెస్టిండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం సిగ్గు చేటు. నైపుణ్యం ఉంటే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక జట్టును నడిపించాలనడానికి విండీస్‌ మంచి ఉదాహరణ. రాజకీయాలే ఆ జట్టును దెబ్బ తీశాయి. ఇంతకుమించి పడిపోవడానికి విండీస్‌కు ఇంకేమి మిగల్లేదు’’ అని వీరూ ట్వీట్‌ చేశాడు. ‘‘వన్డే ప్రపంచకప్‌కు విండీస్‌ అర్హత సాధించలేకపోవడం చూస్తే బాధ కలుగుతోంది. వాళ్లకు టీ20లు అంటేనే ఆసక్తి ఉంది. దేశానికి ఆడడాన్ని గర్వకారణంగా భావించట్లేదు’’ అని 1982 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యుడు మదన్‌లాల్‌ అన్నాడు. విండీస్‌ బలంగా పుంజుకుంటుందని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘విండీస్‌ అంటే నాకెంతో ఇష్టం. ప్రపంచ క్రికెట్లో నంబర్‌వన్‌ జట్టుగా నిలిచే సత్తా వారికి ఉందని ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని గౌతి ట్వీట్‌ చేశాడు.

ఈ పతనం ఇప్పటిది కాదు: వెస్టిండీస్‌ క్రికెట్‌ పతనం ఇప్పటిది కాదని.. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు ఆటలోకి రాకముందు నుంచే మొదలైందని వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ ఇయాన్‌ బిషప్‌ అన్నాడు. ‘‘నెమ్మది నెమ్మదిగా జరిగిన పతనమిది. ప్రస్తుత జట్టు క్రికెట్‌ మొదలుపెట్టక ముందే వెస్టిండీస్‌ పతనం మొదలైంది. దాదాపు పదేళ్లుగా మా జట్టు వన్డేల్లో అగ్ర జట్లపై సరైన ప్రదర్శన చేయట్లేదు. టీ20ల్లో మాత్రమే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయ్యాం. ఆ తర్వాత ఇంకా మెరుపులు లేవు. పతనం వేగంగా సాగింది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినట్లుగా మా జట్టు ఇప్పుడు లేదు. మిగిలిన జట్లు రోజు రోజుకు బలపడితే విండీస్‌ బలహీనంగా మారింది. సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడే నైపుణ్యం ఆటగాళ్లలో తగ్గిపోయింది. కరీబియన్‌ బోర్డు ఆర్థిక సంక్షోభం కూడా ఇందుకు కారణం. అయితే ఆర్థిక పరిస్థితులే పతనానికి కారణమని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకంటే దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న జింబాబ్వే.. వేగంగా కోలుకుంది. ఇప్పుడు ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో సత్తా చాటుతోంది. ప్రస్తుత విండీస్‌కు ఇంతకు మించి ప్రదర్శన చేసే సత్తా ఉందని నమ్ముతున్నా. కెప్టెన్‌, కోచ్‌లు మారారు. వారికి కుదురుకునే సమయం ఇవ్వాలి. తక్కువ వనరులతోనే జింబాబ్వే అదరగొడుతుంటే.. వెస్టిండీస్‌ ఎందుకు మెరుగుకాకూడదూ?’’ అని బిషప్‌ ప్రశ్నించాడు.

ఆ ఆలోచన మార్చుకోవాలి: భిన్న ప్రాంతాలకు చెందిన వాళ్లమనే ఆలోచనను మార్చుకుని ఒకే జట్టుగా ఆడాలని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ సహచరులకు సలహా ఇచ్చాడు. విండీస్‌ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించని నేపథ్యంలో అతడిలా అన్నాడు. ‘‘క్రికెట్‌ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన క్రికెటర్లు జట్టుగా ఏర్పడి కలిసి ఆడే ఆట. ఒక బృందంగా ఎలా ముందుకెళ్లాలో ఆలోచించాలి. క్వాలిఫయర్‌ టోర్నీలో స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి.. విండీస్‌ పతనంలో అత్యంత అధ్యాన్న స్థితి. ఈ టోర్నీలో ఏదైనా సానుకూలత ఉందంటే అది పూరన్‌ బ్యాటింగే. విండీస్‌ పుంజుకోవాలంటే సమయం పడుతుంది. దిగువ స్థాయి నుంచి ప్రక్షాళన జరగాలి. ప్రతిభావంతులను వెలికి తీసి సానబట్టాలి. దేశవాళీ టోర్నీలను మరింత మెరుగుపరచాలి. సీనియర్‌ స్థాయికి వచ్చేసరికి యువ ఆటగాళ్లకు మంచి పునాది పడాలి. ఒకటి రెండేళ్లలో జట్టు బలంగా మారుతుందని ఆశిస్తున్నా’’ అని హోల్డర్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని