అతడొక్కడు 171.. వాళ్లు 130

ఇటీవలే వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఘోర వైఫల్యంతో ఆ మెగా టోర్నీకి దూరమైంది వెస్టిండీస్‌. ఎలాంటి జట్టు ఎలాంటి స్థితికి చేరిందంటూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆవేదన చెందారు.

Updated : 16 Jul 2023 02:37 IST

రెండో ఇన్నింగ్స్‌లోనూ కుప్పకూలిన విండీస్‌
భారత్‌కు ఇన్నింగ్స్‌, 141 పరుగుల విజయం
అశ్విన్‌కు 12 వికెట్లు

ఇటీవలే వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఘోర వైఫల్యంతో ఆ మెగా టోర్నీకి దూరమైంది వెస్టిండీస్‌. ఎలాంటి జట్టు ఎలాంటి స్థితికి చేరిందంటూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆవేదన చెందారు. ఇక కరీబియన్‌ దీవుల్లో మాజీ ఆటగాళ్లు, అభిమానుల వేదన అయితే అంతా ఇంతా కాదు!

ఇలాంటి స్థితిలో భారత జట్టుతో సిరీస్‌ అంటే.. గాయాలకు మందేసినట్లు, అభిమానులకు ఊరట కలిగేట్లు వెస్టిండీస్‌ ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తారని, కసితో ఆడతారని.. కరీబియన్‌ క్రికెట్‌ పునరుజ్జీవానికి ఈ సిరీస్‌తోనే శ్రీకారం చుడతారని అనుకుంటే.. పతనాన్ని ఇంకా కిందికి, పాతాళానికి తీసుకెళ్లారు.

మన జట్టులో అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్‌ ఒక్క ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేస్తే.. ఒక్క   ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్‌ అతడి స్కోరును అందుకోలేకపోయింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆ జట్టు సాధించిన పరుగులు 280. దీన్ని బట్టే వెస్టిండీస్‌ ఎంత ఘోరమైన ప్రదర్శన చేసిందో అర్థం చేసుకోవచ్చు.

రొసో (డొమినికా)

టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియాను వెస్టిండీస్‌ ఓడిస్తుందనే అంచనాలు ఎవరికీ లేవు! కానీ సొంతగడ్డపై పోటీ అయినా ఇస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. తొలి టెస్టులో కేవలం మూడు రోజుల్లోనే ఆ జట్టు కథ ముగించి ఇన్నింగ్స్‌, 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది రోహిత్‌ సేన. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే చేతులెత్తేసిన కరీబియన్‌ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా ఘోరంగా ఆడి 50 ఓవర్లలో 130కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈసారి ఏకంగా ఏడు వికెట్లతో విండీస్‌ నడ్డి విరిచాడు. మరో స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (2/38) కూడా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగులతో విండీస్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచిన అరంగేట్ర బ్యాటర్‌ అలిక్‌ అథనేజ్‌ (28) మరోసారి అత్యధిక పరుగులు సాధించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే భారీ శతకం సాధించిన యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ ఈ నెల 20న పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో మొదలవుతుంది.

నిలిచేవారేరీ?: ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో వెస్టిండీస్‌ క్రికెటర్లదే హవా! కానీ టీ20 క్రికెట్‌కు బాగా అలవాటు పడిపోయి కనీసం వన్డేల్లో 50 ఓవర్ల పాటు కూడా నిలవలేక ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించలేని దుస్థితికి చేరింది విండీస్‌. అలాంటి జట్టు ఇక టెస్టుల్లో అయిదు రోజులు పోరాడుతుందనుకోవడం అత్యాశే. తొలి టెస్టులో మూడో రోజుల్లోపే ఆ జట్టు కథ ముగిసింది. భారత బ్యాటర్లు రోజున్నరకు పైగా బ్యాటింగ్‌ చేయకుంటే.. ఇంకా ముందే విండీస్‌ పనైపోయేదే. మూడో రోజు 421/5 వద్ద భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాక 271 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కరీబియన్‌ జట్టు.. త్వరగా ఈ మ్యాచ్‌ను ముగించేస్తే ఓ పనైపోతుందన్నట్లుగా ఆడింది. ఆ జట్టులో ఒక్క ప్రధాన బ్యాటర్‌ కూడా 50 బంతులు ఆడలేదు. బంతి బాగా బౌన్స్‌ అవుతూ, కొద్దిగా టర్న్‌ కూడా అవుతున్న వికెట్‌ మీద అశ్విన్‌ (7/71)ను ఎదుర్కోవడం వారికి శక్తికి మించిన పనే అయింది. మరో ఎండ్‌ నుంచి జడేజా దాడిని కూడా విండీస్‌ తట్టుకోలేకపోయింది. పిచ్‌ స్పిన్నర్లకు పూర్తి సహకారం అందిస్తుండటం, విండీస్‌ బ్యాటర్లకు కూడా స్పిన్‌ను ఎదుర్కోవడమే సవాలుగా మారడంతో కెప్టెన్‌ రోహిత్‌.. పేసర్ల మీద ఆధారపడాల్సిన పనే లేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ మాత్రమే పేసర్‌ (సిరాజ్‌) ఖాతాలోకి వెళ్లింది. విండీస్‌ ఆడిన 50.3 ఓవర్లలో సిరాజ్‌ 6, ఉనద్కత్‌ 2 మాత్రమే వేశారు. మిగతా ఓవర్లను అశ్విన్‌, జడేజా దాదాపు సగం సగం పంచుకున్నారు. పదో ఓవర్‌ వరకు వికెట్‌ ఇవ్వకపోవడమే ఇన్నింగ్స్‌లో విండీస్‌ సాధించిన ఘనత! త్యాగ్‌నారాయణ్‌ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని జడేజా పతనానికి తెరతీస్తే.. ఆ తర్వాత అశ్విన్‌ విజృంభించాడు. ఇషాన్‌ క్యాచ్‌ వదిలేయడంతో ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (7)ను అద్భుతమైన బంతితో స్లిప్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేసిన అశ్విన్‌.. కాసేపటికే బ్లాక్‌వుడ్‌ (5)ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. రీఫర్‌ (11)ను సైతం జడేజా వికెట్ల ముందు బలిగొన్నాడు. దీంతో విండీస్‌ 32/4తో ఇన్నింగ్స్‌ ఓటమి దిశగా అడుగులేసింది. ఈ దశలో అథనేజ్‌ మరోసారి విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. దసిల్వా (13) కూడా కొంత పట్టుదలను ప్రదర్శించాడు. కానీ దసిల్వాను సిరాజ్‌ ఔట్‌ చేశాక.. మళ్లీ పతనం ఊపందుకుంది. ఓ ఎండ్‌లో హోల్డర్‌ (20 నాటౌట్‌) నిలిచినా.. అతడికి సహకరించేవారే కరవయ్యారు. అశ్విన్‌ చివరి అయిదు వికెట్లనూ తన ఖాతాలోనే వేసుకుని ఇన్నింగ్స్‌కు, మ్యాచ్‌కు తెరదించాడు.

వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 150

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 421/5 డిక్లేర్డ్‌

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 7; త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ ఎల్బీ (బి) జడేజా 7; రీఫర్‌ ఎల్బీ (బి) జడేజా 11; బ్లాక్‌వుడ్‌ ఎల్బీ అశ్విన్‌ 5; అథనేజ్‌ (సి) యశస్వి (బి) అశ్విన్‌ 28; జాషువా దసిల్వా ఎల్బీ (బి) సిరాజ్‌ 13; హోల్డర్‌ నాటౌట్‌ 20; అల్జారి జోసెఫ్‌ (సి) శుభ్‌మన్‌ (బి) అశ్విన్‌ 13; రఖీమ్‌ కార్న్‌వాల్‌ (సి) శుభ్‌మన్‌ (బి) అశ్విన్‌ 4; రోచ్‌ (బి) అశ్విన్‌ 0; వారికన్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 18; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (50.3 ఓవర్లలో ఆలౌట్‌) 130; వికెట్ల పతనం: 1-8, 2-22, 3-32, 4-32, 5-58, 6-78, 7-100, 8-108, 9-108; బౌలింగ్‌: సిరాజ్‌ 6-1-16-1; జైదేవ్‌ ఉనద్కత్‌ 2-1-1-0; అశ్విన్‌ 21.3-7-71-7; జడేజా 21-5-38-2


12/131

విదేశాల్లో అశ్విన్‌కిదే ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. వెస్టిండీస్‌పై ఓ టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఉత్తమ గణాంకాలివి.


7/71

రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ గణాంకాలు. వెస్టిండీస్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఓ భారత బౌలర్‌ ఉత్తమ ప్రదర్శన ఇది.


280

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి వెస్టిండీస్‌ చేసిన పరుగులు. భారత్‌పై ఆ జట్టుకిదే అత్యంత పేలవ ప్రదర్శన. 2006లో 322 పరుగులతో నమోదైన రికార్డు బద్దలైంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని