IND vs WI: అమెరికాలో అదరగొట్టారు

రికార్డు చూస్తే మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లకే విజయావకాశాలెక్కువ! టాస్‌ పోయింది.. వెస్టిండీస్‌ 179 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ స్టేడియంలో పురుషుల టీ20లో విజయవంతమైన అత్యధిక లక్ష్య ఛేదన 95 పరుగులే.

Updated : 13 Aug 2023 07:22 IST

చెలరేగిన యశస్వి, శుభ్‌మన్‌

నాలుగో టీ20లో విండీస్‌ చిత్తు

సిరీస్‌ సమం చేసిన భారత్‌

అయిదో టీ20 నేడే

రాత్రి 8 గంటల నుంచి

రికార్డు చూస్తే మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లకే విజయావకాశాలెక్కువ! టాస్‌ పోయింది.. వెస్టిండీస్‌ 179 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ స్టేడియంలో పురుషుల టీ20లో విజయవంతమైన అత్యధిక లక్ష్య ఛేదన 95 పరుగులే. ఇలా అన్ని ప్రతికూలాంశాలే. కానీ కరీబియన్‌ గడ్డ దాటి.. అమెరికాలో అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఓపెనర్లు యశస్వి, శుభ్‌మన్‌ వీరవిహారం చేయడంతో నాలుగో టీ20లో టీమ్‌ఇండియా అలవోకగా విజయాన్ని అందుకుంది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. నిర్ణయాత్మక అయిదో టీ20 నేడే.

లాడర్‌హిల్‌

టీమ్‌ఇండియా అదరహో! వెస్టిండీస్‌తో తొలి రెండు టీ20ల్లో ఓడి.. సిరీస్‌ చేజార్చుకునే ప్రమాదంలో పడి.. అద్భుతంగా పుంజుకున్న భారత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనెగ్గింది. శనివారం నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ సమం చేసింది. మొదట వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. హెట్‌మయర్‌ (61; 39 బంతుల్లో 3×4, 4×6) అర్ధశతకానికి తోడు.. షై హోప్‌ (45; 29 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/38), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/26) బంతితో ఆకట్టుకున్నారు. ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యశస్వి జైస్వాల్‌ (84 నాటౌట్‌; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (77; 47 బంతుల్లో 3×4, 5×6) చెలరేగడంతో భారత్‌ 17 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం జరగనుంది.

ఓపెనర్లు అదుర్స్‌: ఛేదనలో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు యశస్వి, శుభ్‌మన్‌ తొలి వికెట్‌కు 165 పరుగుల జోడించి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. గత మ్యాచ్‌లో టీ20 అరంగేట్రంలో విఫలమైన యశస్వి.. ఈ సారి అవకాశాన్ని వదల్లేదు. ధనాధన్‌ షాట్లతో చెలరేగాడు. కచ్చితమైన టైమింగ్‌తో, ఖాళీల్లో నుంచి ఫోర్లు రాబట్టాడు. మోకాలు కింద ఆనించి.. స్కూప్‌తో అతను సాధించిన ఫోర్‌ ఆకట్టుకుంది. మరోవైపు శుభ్‌మన్‌ కూడా తిరిగి లయ అందుకుంటూ.. దూకుడు ప్రదర్శించాడు. ఒడియన్‌ స్మిత్‌ వేసిన ఆరో ఓవర్లో అతను.. పుల్‌ షాట్‌తో సిక్సర్‌, కట్‌ షాట్‌తో ఫోర్‌ రాబట్టిన తీరును చూడాల్సిందే. ఓపెనర్లు తగ్గకపోవడంతో భారత్‌ 66/0తో పవర్‌ప్లేను ముగించింది. ఆ తర్వాత కూడా ఓపెనర్లు జోరు కొనసాగించారు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూనే.. బౌండరీలతో స్కోరు వేగం పడిపోకుండా చూశారు. స్పిన్‌ బౌలింగ్‌నూ సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పిన్నర్‌ అకీల్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ తనదైన శైలిలో సగం షాట్‌తో చూడముచ్చటైన ఫోర్‌ రాబట్టాడు. వీళ్ల బాదుడుతో 10 ఓవర్లకు సరిగ్గా 100 పరుగులు సాధించిన టీమ్‌ఇండియా.. లక్ష్యం దిశగా వడివడిగా దూసుకెళ్లింది. ఆ వెంటనే ఓపెనర్లు ఒకరి తర్వాత ఒకరు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు విండీస్‌ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటర్లు సాధికారికంగా బ్యాటింగ్‌ కొనసాగించారు. టీ20ల్లో తొలి అర్ధశతకం సాధించిన తర్వాత అకీల్‌ బౌలింగ్‌లో రివర్వ్‌ స్వీప్‌తో యశస్వి కళ్లుచెదిరే సిక్సర్‌ కొట్టాడు. తానేమన్నా తక్కువనా అన్నట్లు స్మిత్‌ బౌలింగ్‌లో గిల్‌ ఫైన్‌ లెగ్‌ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. అదే ఓవర్‌ను యశస్వి సిక్సర్‌తో ముగించాడు. ఇలా వీళ్లిద్దరూ బౌండరీల వేటలో పోటీపడడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. మెకాయ్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన యశస్వి ఛేదనను వేగవంతం చేశాడు. షెఫర్డ్‌ ఓవర్లో భారీ సిక్సర్‌ సాధించిన గిల్‌.. మరో షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తిలక్‌ (7 నాటౌట్‌)తో కలిసి యశస్వి లాంఛనాన్ని పూర్తిచేశాడు.

మలుపులు తిరుగుతూ: అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఇన్నింగ్స్‌ మలుపులు తిరుగుతూ సాగింది. బౌలింగ్‌ దాడిని భారత్‌ ఆరంభించిన తీరు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ ఆడిన గత రెండు టీ20ల్లో కలిపి అయిదు వికెట్లు తీసిన స్పిన్నర్‌ అక్షర్‌ (1/39)తో తొలి ఓవర్‌ వేయించగా.. ఆ వ్యూహం ఫలితాన్నివ్వలేదు. మేయర్స్‌ (17) ఓ సిక్సర్‌, ఫోర్‌ కొట్టడంతో తొలి ఓవర్లో విండీస్‌కు 14 పరుగులొచ్చాయి. మరో ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌.. షార్ట్‌పిచ్‌ బంతితో మేయర్స్‌ను బోల్తా కొట్టించి వికెట్ల ఖాతా తెరిచాడు. కానీ ఓ వైపు అక్షర్‌ను కొనసాగిస్తూనే.. మరో ఎండ్‌లో వికెట్‌ తీసిన అర్ష్‌దీప్‌ను కాదని చాహల్‌ (1/36)కు బంతినివ్వడం కలిసి రాలేదు. ఆ ఓవర్లో విండీస్‌ 13 పరుగులు రాబట్టింది. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్‌.. కింగ్‌ (18)ను పెవిలియన్‌ చేర్చడంతో ఆరు ఓవర్లకు విండీస్‌ 55/2తో నిలిచింది. ఆ వెంటనే స్పిన్‌ మాయతో కుల్‌దీప్‌ మ్యాచ్‌ గమనాన్నే మార్చేలా కనిపించాడు. ఒకే ఓవర్లో ప్రమాదకర పూరన్‌ (1)తో పాటు కెప్టెన్‌ పావెల్‌ (1)ను టర్న్‌తో బుట్టలో వేసుకున్నాడు. కుల్‌దీప్‌ ఊరించే బంతితో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పూరన్‌ను ఔట్‌ చేశాడు. చకచకా వికెట్లు కోల్పోయిన విండీస్‌ ఒక్కసారిగా 57/4తో కష్టాల్లో పడింది. రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన తర్వాత.. హెట్‌మయర్‌తో కలిసి హోప్‌ బౌండరీల వేటలో సాగడంతో 12 ఓవర్లకే స్కోరు వంద దాటింది. కానీ అర్ధశతకం దిశగా సాగుతున్న హోప్‌ జోరుకు తెరదించి ఈ సారి విండీస్‌ను చాహల్‌ దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో షెఫర్డ్‌ (9), హోల్డర్‌ (3)ను పెవిలియన్‌ చేర్చిన భారత్‌.. ఆ తర్వాత పట్టు సడలించింది. హెట్‌మయర్‌ను కట్టడి చేయలేకపోయింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు వేగం పడిపోకుండా చూసిన అతను.. అర్ధశతకం అందుకున్నాడు. జట్టుకు పోరాడే స్కోరు అందించిన హెట్‌మయర్‌.. ఆఖరి ఓవర్లో ముందుకు డైవ్‌ చేస్తూ తిలక్‌ పట్టిన చక్కని క్యాచ్‌కు నిష్క్రమించాడు. స్మిత్‌ (15 నాటౌట్‌) సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ ముగించాడు. చివరి అయిదు ఓవర్లలో విండీస్‌ 57 పరుగులు రాబట్టింది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) శాంసన్‌ (బి) అర్ష్‌దీప్‌ 17; కింగ్‌ (సి) కుల్‌దీప్‌ (బి) అర్ష్‌దీప్‌ 18; హోప్‌ (సి) అక్షర్‌ (బి) చాహల్‌ 45; పూరన్‌ (సి) సూర్య (బి) కుల్‌దీప్‌ 1; పావెల్‌ (సి) గిల్‌ (బి) కుల్‌దీప్‌ 1; హెట్‌మయర్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్‌దీప్‌ 61; షెఫర్డ్‌ (సి) శాంసన్‌ (బి) అక్షర్‌ 9; హోల్డర్‌ (బి) ముకేష్‌ 3; స్మిత్‌ నాటౌట్‌ 15; అకీల్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-19, 2-54, 3-55, 4-57, 5-106, 6-118, 7-123, 8-167; బౌలింగ్‌: అక్షర్‌ 4-0-39-1; అర్ష్‌దీప్‌ 4-0-38-3; చాహల్‌ 4-0-36-1; కుల్‌దీప్‌ 4-0-26-2; హార్దిక్‌ 1-0-14-0; ముకేష్‌ 3-0-25-1
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి 84 నాటౌట్‌; శుభ్‌మన్‌ (సి) హోప్‌ (బి) షెఫర్డ్‌ 77; తిలక్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (17 ఓవర్లలో ఒక వికెట్‌కు) 179; వికెట్ల పతనం: 1-165; బౌలింగ్‌: మెకాయ్‌ 3-0-32-0; అకీల్‌ 4-0-31-0; హోల్డర్‌ 4-0-33-0; షెఫర్డ్‌ 3-0-35-1; స్మిత్‌ 2-0-30-0; పావెల్‌ 1-0-13-0


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని