Sourav Ganguly: ఆ ఒక్క స్థానంతో పెద్ద తేడా ఉండదు: గంగూలీ

భారత జట్టులో నాలుగో నంబరు బ్యాటింగ్‌ స్థానానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని దిగ్గజ ఆటగాడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు.

Updated : 22 Aug 2023 07:21 IST

ముంబయి: భారత జట్టులో నాలుగో నంబరు బ్యాటింగ్‌ స్థానానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని దిగ్గజ ఆటగాడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఒక్క స్థానంతో పెద్ద తేడా ఏమీ ఉండదని అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్‌లో అపారమైన ప్రతిభ ఉంది. మనకు ఇది లేదు.. అది లేదనడం తరచుగా వింటున్నా. కాని మన దగ్గర అన్నీ ఎక్కువే ఉన్నాయి. నిర్ణయం తీసుకోలేకపోతుండటమే సమస్య. నాలుగో స్థానం గురించి రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌శర్మ, సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రావాలి. నాలుగో నంబరులో ఫలానా ఆటగాడితోనే కొనసాగుతామని కట్టుబడి ఉండాలి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఒక్క స్థానంతో పెద్ద తేడా ఏమీ రాదు. నాలుగో స్థానం ఒక సంఖ్య మాత్రమే. అక్కడ ఎవరైనా ఆడొచ్చు. వన్డే క్రికెట్లో మొదట నేను మిడిలార్డర్‌లో ఆడా. కెప్టెన్‌ సచిన్‌ తెందుల్కర్‌ అడగడంతో ఓపెనర్‌గా వచ్చా. సచిన్‌ విషయంలోనూ అదే జరిగింది. సచిన్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌ అతణ్ని ఓపెనింగ్‌ చేయమన్నాడు. ఆ తర్వాత సచిన్‌ ప్రపంచ స్థాయి ఆటగాడిగా మారాడు. నాలుగో స్థానంలో ఎవరైనా ఆడొచ్చు. విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. తిలక్‌వర్మ బాగా ఆడుతున్నాడు. కానీ పెద్ద టోర్నీల్లో ఆడుతున్నప్పుడు అతని ఖాతాలో ఇంకొన్ని పరుగులుంటే బాగుంటుంది’’ అని గంగూలీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు