India World Cup 2023 Squad: ప్రశ్నలు అలాగే..

మొత్తానికి సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టేదో తేలిపోయింది. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే.. అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది సెలక్షన్‌ కమిటీ. ఉన్నంతలో మెరుగైన జట్టునే ఎంపిక చేసినట్లు కనిపిస్తున్నా.. ఎంపికైంది గెలుపు గుర్రాలేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

Updated : 06 Sep 2023 08:16 IST

ఈనాడు క్రీడావిభాగం

మొత్తానికి సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టేదో తేలిపోయింది. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే.. అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది సెలక్షన్‌ కమిటీ. ఉన్నంతలో మెరుగైన జట్టునే ఎంపిక చేసినట్లు కనిపిస్తున్నా.. ఎంపికైంది గెలుపు గుర్రాలేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కొందరు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, సామర్థ్యంపై ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి.

ఈ ఇద్దరి ఫిట్‌నెస్‌?

ప్రపంచకప్‌కు ఎంపికైతే అయ్యారు కానీ.. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల ఫిట్‌నెస్‌ మీద ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి. వీళ్లిద్దరూ గాయాలకు శస్త్రచికిత్స చేయించుకుని కొన్ని నెలల పాటు జాతీయ క్రికెట్‌ అకాడమీలో గడిపారు. ముఖ్యంగా రాహుల్‌కు ఐపీఎల్‌లో అయింది తీవ్ర గాయమే. దాన్నుంచి కోలుకుని నెల కిందటే ఫిట్‌నెస్‌ సాధించినట్లు వార్తలు వచ్చాయి. రెండు వారాల కిందట మ్యాచ్‌ సిమ్యులేషన్‌లో కూడా పాల్గొన్నాడు. అతను పూర్తిగా కోలుకున్నట్లే అనుకుంటుండగా.. ఆసియా కప్‌కు అతణ్ని ఎంపిక చేసినట్లే చేసి చిన్న మెలిక పెట్టారు సెలక్టర్లు. కొత్తగా ఇంకేదో చిన్న గాయం అయిందని, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడడని పేర్కొంటూ రాహుల్‌కు బ్యాకప్‌గా సంజు శాంసన్‌ను ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు ఇంకో నెల రోజులే సమయం ఉండగా.. గాయం నుంచి కోలుకున్నాక ఇంకా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని రాహుల్‌ను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయడం సరైందేనా అన్న చర్చ నడుస్తోంది. గాయానికి ముందు రాహుల్‌ గొప్ప ఫామ్‌లో ఏమీ లేడు. ఇప్పుడు అతడి ఫామ్‌ ఎలా ఉందో తెలియదు. ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయి. ఇంత అనిశ్చితి మధ్య ఒక ఆటగాడిని ఎంపిక చేయాల్సిన అవసరముందా.. అతను అంత గొప్ప ఆటగాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌, ఫిట్‌నెస్‌ మీదా సందేహాలున్నాయి. అతను రెడ[ు మ్యాచ్‌ల్లో ఆడాడు కానీ.. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఫీల్డింగ్‌లో కొంత ఇబ్బంది పడ్డాడు. మరి టోర్నీలో ఈ ఇద్దరికి ఫిట్‌నెస్‌ సమస్యలు తిరగబెడితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. ప్రపంచకప్‌ లోపు వీళ్లిద్దరూ బ్యాటింగ్‌లో లయ అందుకుని జట్టుకు ఉపయోగపడతారా అన్నది చూడాలి.

ఈ ముగ్గురి ఆట?

ప్రపంచకప్‌కు ఎంపికైన ముగ్గురు ఆటగాళ్ల ఫామ్‌ ఆశాజనకంగా లేదు. జట్టుకు ఆ ముగ్గురూ భారమవుతారేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ముగ్గురే అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌. అక్షర్‌ చాన్నాళ్లుగా వివిధ ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కానీ.. అతడి ప్రదర్శన అంతంతమాత్రం. సొంతగడ్డపై స్పిన్‌కు బాగా సహకరించిన వికెట్లపై టెస్టుల్లో రాణించడం మినహా అతను సాధించిందేమీ లేదు. అప్పుడప్పుడూ బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడు కానీ.. బౌలింగ్‌ మాత్రం సాధారణమే. ఇప్పటికే జడేజా రూపంలో ఒక లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఉండగా.. అక్షర్‌ అవసరం ఏంటన్నది ప్రశ్న. ఇక పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు చాలా అవకాశాలు ఇస్తున్నా ఉపయోగించుకోవడం లేదు. అతను ధారాళంగా పరుగులిచ్చేస్తాడు. తీసే వికెట్లు తక్కువ. బ్యాటింగ్‌ కూడా చేయగలడన్న ఉద్దేశంతో అతడికి అవకాశం ఇస్తున్నారు. తనకంటే ప్రసిద్ధ్‌ కృష్ణనే మంచి పేస్‌ ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయాలున్నాయి. సూర్యకుమార్‌ టీ20ల్లో మాదిరి వన్డేల్లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదు. చివరగా వెస్టిండీస్‌ పర్యటనలో ఆడిస్తే.. అందులోనూ నిరాశ పరిచాడు. ఆసియా కప్‌లో అతడికి తుది జట్టులో చోటు లేదు. మరి ప్రపంచకప్‌కు సూర్యకుమార్‌ ఏమాత్రం ఉపయోగపడతాడో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని