India vs New Zealand: సమవుజ్జీతో సమరం

ఈ వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌ గెలిచిన జట్లు రెండే. అందులో ఒకటి ఆతిథ్య భారత్‌ అయితే.. ఇంకోటి న్యూజిలాండ్‌. ఇప్పుడీ రెండు అజేయ జట్ల మధ్య రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది

Updated : 22 Oct 2023 07:39 IST

న్యూజిలాండ్‌తో భారత్‌ పోరు నేడు
అజేయ జట్లలో తొలి ఓటమి ఎవరికో?
మధ్యాహ్నం 2 నుంచి
ధర్మశాల

ఈ వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌ గెలిచిన జట్లు రెండే. అందులో ఒకటి ఆతిథ్య భారత్‌ అయితే.. ఇంకోటి న్యూజిలాండ్‌. ఇప్పుడీ రెండు అజేయ జట్ల మధ్య రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగుకు నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవడమే కాదు.. ఆయా మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తీరులోనూ భారత్‌, న్యూజిలాండ్‌ ఛాంపియన్‌ జట్లనిపించాయి. బలాబలాల్లోనూ సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్లలో అజేయ రికార్డును కొనసాగించేదెవరు.. తొలి ఓటమిని రుచి చూసేదెవరు అని
క్రికెట్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఆస్ట్రేలియా సవాల్‌ను కాచుకుని, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను అలవోకగా ఓడించి సెమీఫైనల్‌ దిశగా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియాకు సవాలు ఎదురు కాబోతోంది. తనలాగే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన న్యూజిలాండ్‌ను ఆదివారం ఢీకొనబోతోంది రోహిత్‌ సేన. ప్రపంచకప్‌ ముంగిట కివీస్‌ మీద పెద్దగా అంచనాలు లేవు కానీ.. టోర్నీ ఆరంభమయ్యాక ఆ జట్టు తన సత్తా ఏంటో చూపించి సెమీస్‌కు బలమైన ఫేవరెట్‌గా మారింది. పేసర్లకు అనుకూల పరిస్థితులుండే ధర్మశాలలో మ్యాచ్‌ జరగబోతుండటం కివీస్‌కు కలిసొచ్చే విషయం కాగా.. ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరం కావడం భారత్‌కు ఎదురు దెబ్బే. కాబట్టి ఆతిథ్య జట్టుకు సవాలు తప్పకపోవచ్చు.


పిచ్‌ అందరిదీ

చల్లటి వాతావరణం ఉండే ధర్మ శాలలో పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తాయి. శనివారం పిచ్‌పై బాగా పచ్చిక కనిపించగా.. మ్యాచ్‌ సమయానికి అది చాలావరకు తగ్గిపోవచ్చు. అయినా ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే అవకాశముంది. ఇక్కడ స్పిన్నర్లకు కూడా బాగానే అవకాశముంటుంది. బ్యాటింగ్‌ మరీ కష్టమేమీ కాదు. కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. మొత్తంగా ఇది సమతూకం ఉన్న పిచ్‌గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.


టాప్‌ లేపితే...

టోర్నీలో భారత్‌కు తొలి నలుగురైదుగురు బ్యాటర్లే పని పూర్తి చేస్తూ వచ్చారు. రోహిత్‌, కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నారు. శుభ్‌మన్‌ కూడా లయ అందుకున్నాడు. శ్రేయస్‌, రాహుల్‌ కూడా అవకాశం వచ్చినపుడు సత్తా చాటుతున్నారు. అయితే పేస్‌, స్పిన్‌ రెండింట్లోనూ కివీస్‌కు నాణ్యమైన బౌలర్లున్నారు. కాబట్టి పిచ్‌ నుంచి కొంచెం సహకారం అందితే భారత బ్యాటర్లకు సవాలు తప్పదు. ఒకవేళ టాప్‌ఆర్డర్‌ విఫలమైతే.. మిడిలార్డర్‌ ఎంతమాత్రం నిలబడుతుందో చూడాలి. హార్దిక్‌ కూడా లేడు కాబట్టి అలాంటి స్థితిలో రాహుల్‌, జడేజా సత్తా చాటాలి. ఇక బౌలింగ్‌లో జోరుమీదున్న బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌, జడేజాల నుంచి అదే నిలకడను జట్టు ఆశిస్తోంది.
తుది జట్లు (అంచనా)...
భారత్‌:
రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, షమి/శార్దూల్‌, బుమ్రా, సిరాజ్‌.
న్యూజిలాండ్‌: కాన్వే, యంగ్‌, రచిన్‌, మిచెల్‌, లేథమ్‌ (కెప్టెన్‌), ఫిలిప్స్‌, చాప్‌మన్‌, శాంట్నర్‌, ఫెర్గూసన్‌, హెన్రీ, బౌల్ట్‌.


ఆ ఓటమి గుర్తుందా?

వన్డే ప్రపంచకప్‌లో చివరగా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడ్డ మ్యాచ్‌ను భారత అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌కు దిగ్భ్రాంతికర ఓటమిని మిగిల్చింది కివీసే. నాటి ఓటమికి ఆదివారం ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న కివీస్‌ను ఓడించడం అంత తేలిక కాదు. వేలి గాయంతో బాధ పడుతున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో లేథమ్‌ జట్టును నడిపించనున్నాడు. బ్యాటింగ్‌లో అతడితో పాటు ఫిలిప్స్‌, మిచెల్‌, కాన్వే, రచిన్‌ రవీంద్ర మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌల్ట్‌, హెన్రీ, ఫెర్గూసన్‌, శాంట్నర్‌లతో బౌలింగ్‌ విభాగం కూడా బలంగానే ఉంది. రచిన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.


8

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడ్డ మ్యాచ్‌లు. అయిదు మ్యాచ్‌ల్లో కివీస్‌ నెగ్గగా.. టీమ్‌ఇండియా మూడింట్లో గెలిచింది. చివరగా 2019లో సెమీస్‌లో భారత్‌పై కివీసే పైచేయి సాధించింది.


14


వన్డేల్లో 2 వేల మైలురాయిని అందుకోవడానికి శుభ్‌మన్‌కు అవసరమైన పరుగులు. ఈ మ్యాచ్‌లో అతనా పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా (38 ఇన్నింగ్స్‌ల్లో) 2 వేల మార్కును చేరుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.


871

భారత్‌పై 20 ఇన్నింగ్స్‌ల్లో లేథమ్‌ పరుగులు. అందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. సగటు 54.43.
 


‘‘హార్దిక్‌ వచ్చే వరకు పరిస్థితులను బట్టి రెండు మూడు రకాల కూర్పులను పరిశీలిస్తున్నాం. ఈ మ్యాచ్‌కు షమిని తుది జట్టులోకి తెస్తే బాగుంటుంది. లోయర్‌ మిడిలార్డర్లో బ్యాటర్‌ కావాలంటే సూర్య మెరుగైన ప్రత్యామ్నాయం’’
 ద్రవిడ్‌, భారత కోచ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని