Shakib Al Hasan: షకిబ్‌ అదో రకం.. వివాదాలతో సావాసం

బంగ్లాదేశ్‌ తరపున మొదటి ఆల్‌రౌండర్‌గా ఎన్నో రికార్డులను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇంకో వైపు చూస్తే మాత్రం షకిబ్‌ వివాదాలతో సావాసం చేశాడా? అనే సందేహం కలగకమానదు. 

Updated : 07 Nov 2023 18:58 IST

ప్రపంచంలోని మేటి ఆల్‌రౌండర్లలో అతను ఒకడు. అద్భుతమైన స్పిన్‌ నైపుణ్యాలతో వికెట్లు పడగొడుతూ.. ఉత్తమ బ్యాటింగ్‌తో పరుగులు సాధిస్తూ.. గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటుతూనే ఉన్నాడు. అంతే కాదు క్రికెట్లో బంగ్లాదేశ్‌ (Bangladesh) ఎదుగుదలలో అతనిది కీలక పాత్ర. ఆటలో అయితే అతని ప్రతిభను ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. కానీ అతను వివాదాలతో సావాసం చేస్తుంటాడు. మైదానంలో కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమవుతుంటాడు. ఓ సారి నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. ఈ ఉపోద్ఘాతమంతా ఎవరిని ఉద్దేశించిందో మీకు ఇప్పటికే తెలిసిపోయిందనుకుంటా. అవును.. ఆ ఆటగాడే షకిబ్‌ అల్‌ హసన్‌ (Shakib Al Hasan). ఈ ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో శ్రీలంక (Sri Lanka)తో మ్యాచ్‌లో మాథ్యూస్‌ టౌమ్డ్‌ ఔట్‌ విషయంలో షకిబ్‌ తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో మరోసారి షకిబ్‌ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. 

ఆటలో మేటి..

బంగ్లాదేశ్‌ జట్టు కెప్టెన్‌ ఎంతో అనుభవం ఉన్న సీనియర్‌ ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు.. ఇలా ఆటలో ప్రదర్శన పరంగా షకిబ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆల్‌రౌండ్‌ మెరుపులతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ప్రపంచ క్రికెట్లో బంగ్లాదేశ్‌ వృద్ధిలో 36 ఏళ్ల ఈ ఆటగాడిది కీలక పాత్ర. ఇప్పటివరకూ 66 టెస్టుల్లో 4454 పరుగులు చేయడంతో పాటు 233 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 7570 పరుగులు, 317 వికెట్లు సాధించాడు. 117 టీ20ల్లో 2382 పరుగులు, 140 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా, బంగ్లాదేశ్‌ తరపున కీలక ఆటగాడిగా ఎన్నో రికార్డులను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌ దిగ్గజంగా నిలిచాడు. అయితే ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇంకో వైపు చూస్తే మాత్రం షకిబ్‌ ఇలాంటి వివాదాలతో సావాసం చేశాడా? అనే సందేహం కలగకమానదు. 

గొడవలతో దిగజారి..

తాజాగా శ్రీలంక ఆటగాడు మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌ విషయంలో షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా షకిబ్‌ ప్రవర్తించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా తాను యుద్ధంలో ఉన్నానని, జట్టు గెలుపు కోసం ఏమైనా చేస్తానని షకిబ్‌ చెప్పుకొచ్చాడు. కానీ ఇలా చేసి దక్కించుకున్న విజయానికి విలువ ఉండదంటూ షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి. గతంలో షకిబ్‌ ప్రవర్తనను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. 2010లో న్యూజిలాండ్‌తో వన్డే సందర్భంగా ఎదురుగా ఉండే స్క్రీన్‌ ముందు నుంచి వెళ్లాడని ఓ గ్రౌండ్‌స్టాఫ్‌ను కొట్టేందుకు బ్యాట్‌ ఎత్తాడు. 2011లోనూ ఇలాగే గ్రౌండ్‌స్టాఫ్‌ పట్ల అమర్యాదగా వ్యవహరించాడు. 2014లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా అసభ్యకరమైన సంజ్ఞలతో టీవీకి చిక్కడంంతో అతనిపై మూడు వన్డేల నిషేధం పడింది.

అదే ఏడాది స్టేడియంలో వర్షం విరామంలో తన భార్యతో అనుచితంగా ప్రవర్తించాడని ఓ అభిమానిని షకిబ్‌ కొట్టాడు. అదే ఏడాది జట్టు నుంచి తప్పుకుంటానని హెచ్చరిస్తూ కొత్త కోచ్‌ చండిక హతురుసింఘాకు సందేశం పంపడం కలకలం రేపింది. అప్పుడు అతనిపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆరు నెలల నిషేధం విధించింది. తర్వాత దీన్ని మూడున్నర నెలలకు తగ్గించింది. 2015 బంగ్లాదేశ్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఎల్బీ అప్పీల్‌ను నిరాకరించినందుకు అంపైర్‌ను దూషించాడు. 2017లో మానసిక ఆందోళన నుంచి బయటకు వచ్చేందుకు మూడు నెలల విరామం తీసుకున్నాడు. కానీ తిరిగొచ్చాక మళ్లీ అలాగే సాగాడు. 2018 నిదహాస్‌ ట్రీఫీలో లంకతో మ్యాచ్‌లో నోబాల్‌ వివాదంలో భాగంగా మైదానం వదిలి వెళ్తానని హెచ్చరించాడు. మ్యాచ్‌ తర్వాత స్టేడియంలోని గ్లాస్‌ డోర్‌ను బద్దలుకొట్టారనే ఆరోపణలూ వచ్చాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సంప్రదింపుల విషయాన్ని ఐసీసీకి చెప్పకపోవడంతో 2019లో అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. ఢాకా ప్రిమియర్‌ లీగ్‌లో అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టంప్స్‌ను తన్ని పీకేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలా అతని కెరీర్‌లో వివాదాలకు కొదవే లేదు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు