ODI World Cup 2023: ఒకటికి మించి మరొకటి

కొన్ని సంచలనాలు.. మరికొన్ని అద్భుతాలు! ఇదివరకెప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా.. అంచనాలకు అందని రీతిలో ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగిసింది.  10 జట్ల మధ్య లీగ్‌ పోరు అనూహ్య ఫలితాలతో.. అచ్చెరువొందే ప్రదర్శనలతో అభిమానులను అలరించింది.

Updated : 14 Nov 2023 07:08 IST

ఈనాడు క్రీడావిభాగం

కొన్ని సంచలనాలు.. మరికొన్ని అద్భుతాలు! ఇదివరకెప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా.. అంచనాలకు అందని రీతిలో ప్రపంచకప్‌ లీగ్‌ దశ ముగిసింది.  10 జట్ల మధ్య లీగ్‌ పోరు అనూహ్య ఫలితాలతో.. అచ్చెరువొందే ప్రదర్శనలతో అభిమానులను అలరించింది. ఇప్పుడిక కప్పు వేటలో మిగిలింది నాలుగు జట్లే. జరగాల్సింది మూడు మ్యాచ్‌లే. కప్పు యుద్ధం ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క! వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచే జట్టే విశ్వవిజేత! మరి ఈ కీలక సమరంలో సత్తా చాటేదెవరు?


అజేయ భారత్‌..

స్వదేశంలో ప్రపంచకప్‌ అనగానే టీమ్‌ఇండియాపై నెలకొన్న అంచనాలు.. అభిమానులు పెట్టుకున్న ఆశలు అన్నీఇన్నీ కావు. అంచనాలను నిలబెట్టుకుంటూ.. ఒక్కో మ్యాచ్‌కు మరింత బలంగా మారుతూ.. టీమ్‌ఇండియా సాగుతోంది. తొమ్మిదికి తొమ్మిది విజయాలతో దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో మన జట్టు పెత్తనం మామూలుగా లేదు. అన్ని విభాగాల్లోనూ మనకు తిరుగులేదు. ఆస్ట్రేలియాతో పోరు మొదలు.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ వరకూ మన జట్టు ఆట అదుర్స్‌. మొదట బ్యాటింగ్‌ అయినా, ఛేదన అయినా మనదే దూకుడు. 9 మ్యాచ్‌ల్లో 99 సగటుతో 594 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్న కోహ్లి జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. రోహిత్‌ శర్మ (503) బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ రాణిస్తున్నాడు. శ్రేయస్‌ (421), కేఎల్‌ రాహుల్‌ (347), శుభ్‌మన్‌ గిల్‌ (270) కూడా ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్‌లో ఇబ్బంది లేదు. లీగ్‌ మ్యాచ్‌ల్లో చాలావరకూ టాప్‌ఆర్డరే పని పూర్తిచేసింది. ఒకవేళ టాప్‌ఆర్డర్‌ విఫలమైనా శ్రేయస్‌, రాహుల్‌ నిలబడుతున్నారు. బౌలింగ్‌ పరంగానూ మనకు ఎదురులేదు. పేస్‌ త్రయం బుమ్రా (17 వికెట్లు), షమి (16), సిరాజ్‌ (12) బ్యాటర్లను వణికిస్తున్నారు. జడేజా (16), కుల్‌దీప్‌ (14) స్పిన్‌తో తిప్పేస్తున్నారు.


అబ్బురపరుస్తూ దక్షిణాఫ్రికా..

టోర్నీ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరుతుందన్న అంచనాలూ లేవు. కానీ ఇప్పుడు సఫారీ జట్టు టైటిల్‌కు గట్టిపోటీనిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, రెండే ఓటముల (భారత్‌, నెదర్లాండ్స్‌పై)తో పట్టికలో రెండో స్థానంతో ఆ జట్టు ముందంజ వేసింది. బ్యాటింగ్‌లో దూకుడుతో, బౌలింగ్‌లో నిలకడతో రెచ్చిపోతోంది. మొదట బ్యాటింగ్‌ చేస్తే మాత్రం అలవోకగా 350కి అటూఇటూగా పరుగులు సాధిస్తోంది. ప్రపంచకప్‌ల్లో అత్యధిక స్కోరు (శ్రీలంకపై 428/5) రికార్డునూ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న డికాక్‌ (591) వీడ్కోలుకు ముందు విధ్వంసం సాగిస్తున్నాడు. ఇప్పటికే 4 సెంచరీలు చేశాడు. ఓపెనర్‌గా అతను అందించే మెరుపు ఆరంభాలతోనే సఫారీ జట్టు భారీ స్కోర్లు సాధించగలుగుతోంది. వాండర్‌ డసెన్‌ (442), మార్‌క్రమ్‌ (396), క్లాసెన్‌ (326), మిల్లర్‌ (255) కూడా బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. పేసర్లు కొయెట్జీ (18), జాన్సన్‌ (17), రబాడ (12), ఎంగిడి (10), స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ (14) బౌలింగ్‌లో సత్తాచాటుతున్నారు. అయితే తమ మూడో మ్యాచ్‌లోనే నెదర్లాండ్స్‌ లాంటి చిన్నజట్టు చేతిలో ఓటమి తర్వాత కూడా ఆ జట్టు చూపించిన పట్టుదల, పుంజుకున్న తీరు మెచ్చుకోవాల్సిందే.


అదరగొడుతూ ఆస్ట్రేలియా..

వరుసగా రెండు ఓటముల (భారత్‌, దక్షిణాఫ్రికా)తో టోర్నీ మొదలెట్టింది ఆస్ట్రేలియా. ఆసీస్‌ పనైపోయినట్లే అన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. అక్కడితోనే ఆగిపోతే అది ఆసీస్‌ ఎందుకవుతుంది? ఆ రెండు ఓటముల తర్వాత ఆసీస్‌ ఎక్కడా ఆగలేదు. వరుసగా ఏడు విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఒకరు కాకపోతే మరొకరు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తూ జట్టును గెలిపిస్తున్నారు. బ్యాటింగ్‌లో వార్నర్‌ (499) మూలస్తంభంలా నిలుస్తున్నాడు. మిచెల్‌ మార్ష్‌ (8 మ్యాచ్‌ల్లో 426) జోరు ప్రదర్శిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై అతనాడిన 177 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ అమోఘం. అతను చెలరేగిన తీరు సెమీస్‌కు ముందు జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఇక వన్డే క్రికెట్లోనే మేటిగా చెప్పుకునే ఇన్నింగ్స్‌తో మ్యాక్స్‌వెల్‌ (7 ఇన్నింగ్స్‌ల్లో 397) సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అఫ్గానిస్థాన్‌పై 201 పరుగులతో అజేయంగా నిలిచి ఓటమి కోరల్లోంచి తన జట్టును రక్షించాడు. తిమ్మిర్లు, కండరాలు పట్టేయడంతో క్రీజులో నిలబడే పరిస్థితి లేకపోయినా ఒంటి కాలితోనే అతను సాగించిన పోరాటం అద్భుతం. బౌలింగ్‌లో స్పిన్నర్‌ జంపా (22) తిప్పేస్తున్నాడు. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు అతనే. పేసర్లు హేజిల్‌వుడ్‌ (12), కమిన్స్‌ (10), స్టార్క్‌ (10) కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారు.


అడ్డంకులు దాటుతూ న్యూజిలాండ్‌..

గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ రన్నరప్‌ న్యూజిలాండ్‌. అంతేకాదు 2007 నుంచి వరుసగా సెమీస్‌ చేరింది. అలాంటి జట్టు మరోసారి బలమైన బృందంతో బరిలో దిగింది. గాయాల కారణంగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ విలియమ్సన్‌ ఒక్కదాంట్లోనే ఆడినప్పటికీ కివీస్‌.. వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది. ఇక ఆ జట్టుకు తిరుగులేదనే అనుకున్నారు. కానీ భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌ లయ తప్పింది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ (ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌)ల్లో ఓడింది. సమష్టిగా రాణించలేకపోయింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విలియమ్సన్‌ తిరిగొచ్చినా.. ఆ జట్టు 401 పరుగులు చేసినా.. చివరకు ప్రత్యర్థి పోరాటం, వర్షం కారణంగా ఓటమి వైపే నిలవాల్సి వచ్చింది. చివరకు శ్రీలంకపై భారీతేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ మెరుగుపర్చుకుని నాలుగో జట్టుగా సెమీస్‌ చేరింది. ఒడుదొడుకులు దాటి ఆ జట్టు నాకౌట్‌కు అర్హత సాధించడం వెనుక యువ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర (565) ఉన్నాడు. అతడు అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యాలతో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. డరైల్‌ మిచెల్‌ (418), కాన్వే (359), ఫిలిప్స్‌ (244) కూడా బ్యాటింగ్‌లో మెరుస్తున్నారు. స్పిన్నర్‌ శాంట్నర్‌ (16), పేసర్లు బౌల్ట్‌ (13), ఫెర్గూసన్‌ (6 ఇన్నింగ్స్‌ల్లో 10) బౌలింగ్‌లో రాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని