IND vs NZ: వదలొద్దు ఈసారి

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ.. ఒక్క ఓటమీ లేకుండా నాకౌట్‌కు దూసుకొచ్చి అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసిన రోహిత్‌ సేన.. సెమీస్‌ సవాలుకు సిద్ధమైంది. 

Published : 15 Nov 2023 06:38 IST

అజేయ భారత్‌కు కివీస్‌ సవాల్‌
వన్డే ప్రపంచకప్‌ తొలి సెమీస్‌ నేడే
మధ్యాహ్నం 2 నుంచి
ముంబయి

ఇంకా కళ్ల ముందే ఉన్నాయి ఆ చేదు జ్ఞాపకాలు! ధోని రనౌట్‌.. 2019 ప్రపంచకప్‌ నుంచి భారత జట్టు ఔట్‌! ఇంగ్లాండ్‌ గడ్డపై ప్రపంచకప్‌ అందుకునే దిశగా సాగిపోతున్న భారత్‌ ప్రయాణానికి దిగ్భ్రాంతికర రీతిలో తెరదించిన జట్టది! ఈ గాయాలు మానేలోపే.. రెండేళ్ల తర్వాత టెస్టుల్లో కోహ్లీసేన ప్రపంచ ఛాంపియన్‌ అయ్యే అవకాశాన్ని దూరం చేసిందీ ఆ జట్టే!

ఇప్పుడిక సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో వన్డే కప్పు దిశగా పరుగులు పెడుతున్న రోహిత్‌ బృందం సెమీస్‌ ప్రత్యర్థి ఆ జట్టే. వాళ్ల మీద పెద్దగా అంచనాలుండవు. వాళ్ల ఆట మీద చర్చలు, విశ్లేషణలు కూడా తక్కువే. వాళ్లను చూసి ప్రత్యర్థులు కసితో రగిలిపోరు. కప్పులో వాళ్లు కష్టపడే ముందంజ వేస్తారు. కానీ కీలక సమరాల్లో ఫేవరెట్లు అనుకున్న జట్లను వాళ్లు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఛాంపియన్‌గా నిలవలేదన్న మాటే కానీ.. నిలకడకు మారుపేరు ఆ జట్టు.

అందుకే ఈసారి టీమ్‌ఇండియా అజేయంగా సెమీస్‌ చేరినా.. లీగ్‌ దశలో మహా మహా జట్లను మట్టికరిపించినా.. ఆ జాబితాలో ఈ ప్రత్యర్థి కూడా ఉన్నా.. ఓ మూలన ఏదో భయం! గత రెండు ప్రపంచకప్‌ల్లోనూ లీగ్‌ దశలో ఆధిపత్యం చలాయించి, నాకౌట్‌లో ఇంటిముఖం పట్టిన చరిత్ర భయపెడుతోంది. పైగా ప్రత్యర్థిని చూసినా కంగారు పుడుతోంది.

కానీ ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌సేన పరాక్రమం చూశాక.. కథ మారుతుందనే ఆశ అభిమానులది. ఇన్నాళ్లూ చూపిన పట్టుదలే ఈ రోజూ కొనసాగితే.. ప్రణాళికలన్నీ సరిగ్గా అమలైతే.. ఉదాసీనత దరి చేరనివ్వకుంటే.. సమష్టి ప్రదర్శన పునరావృతం అయితే.. కప్పు దారిలో పెద్ద అడ్డంకిని దాటినట్లే! మరి వాంఖడేలో టీమ్‌ఇండియా మరోసారి విజృంభిస్తుందా? న్యూజిలాండ్‌ సవాలును సమర్థంగా కాచుకుంటుందా? జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్లో అడుగేస్తుందా?

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ.. ఒక్క ఓటమీ లేకుండా నాకౌట్‌కు దూసుకొచ్చి అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసిన రోహిత్‌ సేన.. సెమీస్‌ సవాలుకు సిద్ధమైంది. ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా పని చేసుకుపోతూ, ప్రత్యర్థులకు షాకులిచ్చే న్యూజిలాండ్‌తో బుధవారం రోహిత్‌ సేన తలపడబోతోంది. టోర్నీలో జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల వ్యక్తిగత ఫామ్‌, వాంఖడెలో రికార్డు.. ఇలా ఏ రకంగా చూసుకున్నా మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌. కానీ చరిత్ర మాత్రం మనవైపు లేదు. దాన్ని మార్చి.. అభిమానులు ఆశలు మరోసారి సెమీస్‌ దశలోనే కూలిపోకుండా చూడాల్సిన బాధ్యత రోహిత్‌ సేనదే.

అతడే ముప్పు: ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌ పరంగా న్యూజిలాండ్‌ తరఫున సంచలన ప్రదర్శన అంటే రచిన్‌ రవీంద్రదే. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాస్తా ఈ టోర్నీతో ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. టోర్నీలో మూడు శతకాలు సహా 565 పరుగులు చేసిన అతణ్ని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చాలి. కాన్వే లీగ్‌ దశలో పెద్దగా రాణించకపోయినా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇక న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో అతి పెద్ద ముప్పు కెప్టెన్‌ విలియమ్సన్‌ నుంచే పొంచి ఉంది. ఈ మేటి బ్యాటర్‌కు భారత బౌలర్లపై మంచి రికార్డుంది. మిచెల్‌ లీగ్‌ దశలో భారత్‌పై సెంచరీ చేసిన విషయం మరువకూడదు. మిడిలార్డర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ ప్రమాదకరం. బౌలింగ్‌లో బౌల్ట్‌ ఆ జట్టుకు ఎంతో కీలకం. అతణ్ని ఆరంభ ఓవర్లలో ఎదుర్కోవడం సవాల్‌. ఫిట్‌నెస్‌ సమస్యలతోఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ.. సౌథీ, ఫెర్గూసన్‌ మంచి ఊపులోనే ఉన్నారు. శాంట్నర్‌, రచిన్‌, ఫిలిప్స్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.

విభిన్న ప్రయాణం: ఈ ప్రపంచకప్‌లో భారత్‌, కివీస్‌లది భిన్నమైన ప్రయాణం. లీగ్‌ దశ ఆరంభం నుంచి చివరి వరకు నిలకడగా ఆడి అందరికంటే ముందుగా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది టీమ్‌ఇండియా. కానీ కివీస్‌ వరుసగా నాలుగు విజయాలతో టోర్నీని ఘనంగానే ఆరంభించినా.. ఆ తర్వాత తడబడింది. వరుసగా 4 ఓటములతో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో నెగ్గి ముందంజ వేసింది. లీగ్‌ దశలో భారత్‌ విజయం కోసం ఎక్కువ కష్టపడ్డ, కొంత ఓటమి భయం కలిగిన మ్యాచ్‌ అంటే కివీస్‌తో జరిగిందే.


12

వాంఖడేలో 21 మ్యాచ్‌లాడిన భారత్‌ సాధించిన విజయాలు. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడింది.


9

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కిది తొమ్మిదో సెమీస్‌. 1975, 1979, 1992, 1999, 2007, 2011, 2015, 2019లో ఆ జట్టు సెమీస్‌ ఆడింది. కానీ 2015, 2019లో మాత్రమే గెలవగలిగింది. ఆ జట్టు వరుసగా అయిదోసారి సెమీస్‌ ఆడుతోంది.


27

వాంఖడేలో ఇప్పటివరకూ జరిగిన వన్డేలు. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 14 సార్లు, ఛేదన జట్టు 13 సార్లు గెలిచాయి. తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 261.


47

ఈ ప్రపంచకప్‌లో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు తీసిన వికెట్లు. స్పిన్నర్లు 11 వికెట్లు మాత్రమే సాధించారు.


117

ఇప్పటివరకూ వన్డేల్లో భారత్‌, కివీస్‌ తలపడ్డ మ్యాచ్‌లు. ఇందులో టీమ్‌ఇండియా 59, కివీస్‌ 50 గెలిచాయి. ఓ మ్యాచ్‌ టై కాగా.. మిగతా ఏడింట్లో ఫలితం తేలలేదు.


45

వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత గెలుపోటములు. మొత్తం 9 మ్యాచ్‌ల్లో కివీస్‌ అయిదు సార్లు, భారత్‌ నాలుగు సార్లు గెలిచాయి. ఈ ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లో కివీస్‌పై భారత్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది.


2

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఇది వరుసగా రెండో సెమీస్‌ మ్యాచ్‌. 2019 సెమీస్‌లో కివీస్‌ 18 పరుగుల తేడాతో గెలిచింది.


8

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌ చేరిన సందర్భాలు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023). మూడు సార్లు నెగ్గిన మన జట్టు, నాలుగు సార్లు ఓడిపోయింది.


ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు (85), ఉత్తమ ఎకానమీ రేటు (4.5), ఉత్తమ సగటు (19.6), ఉత్తమ స్ట్రైక్‌రేట్‌ (26.2) నమోదు  చేసిన జట్టు భారతే.


కాస్త అదృష్టం కూడా తోడు కావాల్సిన సమయమొచ్చింది. మేం చాలా ధైర్యంగా ఆడబోతున్నాం. ధైర్యవంతులకే అదృష్టం కలిసొస్తుందని ఆశిస్తున్నా. టోర్నీ ఆరంభం నుంచి చేస్తున్నదానికి భిన్నంగా మేం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఏ మ్యాచ్‌లోనైనా ఒత్తిడి ఉంటుంది. టోర్నీలో మేం ఒత్తిడిని బాగా తట్టుకున్నాం. 

 రోహిత్‌


ప్పుడూ న్యూజిలాండ్‌ను అండర్‌ డాగ్‌ అనే అంటారు. ఒకందుకు అది మంచిదే. ప్రపంచకప్‌లో భారత్‌ గొప్పగా సాగుతోంది. కానీ సెమీఫైనల్లో ఏదైనా జరగొచ్చు. మాదైన రోజున అత్యుత్తమ క్రికెట్‌ ఆడగలిగితే ఎంతటి జట్టునైనా ఓడిస్తాం. ఏదేమైనా టీమ్‌ఇండియాతో సెమీస్‌ పెద్ద సవాల్‌. యువ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర సత్తా చాటుతున్నాడు. అతడు సెమీస్‌లోనూ రాణిస్తాడని ఆశిస్తున్నా.

 కేన్‌ విలియమ్సన్‌


ఛేదన కష్టం..

సాధారణంగా వాంఖడేలో పరుగుల వరద పారుతుంటుంది. ఈ ప్రపంచకప్‌లోనూ ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టమవుతోంది. సంప్రదాయంగా ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువ. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో పేసర్లు విజృంభిస్తున్నారు. లీగ్‌ దశ మ్యాచ్‌లను అనుసరించి టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్లపై గురిపెట్టొచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 20 ఓవర్లలో పేసర్లను ఎదుర్కోవడం సవాలే. రిజర్వ్‌ డే ఉన్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

ఆ అయిదుగురు మళ్లీ..

2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌, భారత్‌ తలపడ్డాయి.  అప్పుడు రెండు జట్ల తరపున ఆడిన ఆటగాళ్లలో అయిదుగురు ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ ఆడబోతున్నారు. అప్పుడు కివీస్‌ జట్టులో విలియమ్సన్‌ (కెప్టెన్‌), సౌథీ, బౌల్ట్‌.. భారత జట్టులో కోహ్లి, జడేజా ఉన్నారు. ఇప్పుడూ వీళ్లు సెమీస్‌ బరిలో దిగబోతున్నారు. నాటి మ్యాచ్‌లో భారత్‌ నెగ్గింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, షమి, బుమ్రా, సిరాజ్‌;
న్యూజిలాండ్‌: కాన్వే, రచిన్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), మిచెల్‌, లేథమ్‌, ఫిలిప్స్‌, చాప్‌మన్‌, శాంట్నర్‌, సౌథీ, ఫెర్గూసన్‌, బౌల్ట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని