IND vs NZ Semi final: ఎవరు నేటి హీరోలు?

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున హీరోలు ఎందరో. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుత ఆరంభాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

Updated : 15 Nov 2023 07:09 IST

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున హీరోలు ఎందరో. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుత ఆరంభాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతను 500 మార్కును దాటేశాడు. కోహ్లి ఒకప్పటి ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు. టోర్నీ టాప్‌స్కోరర్‌ అతనే. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సైతం ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడారు. శుభ్‌మన్‌ కూడా రోహిత్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలనే ఇస్తున్నాడు. సూర్యకుమార్‌ ఒక మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక బౌలింగ్‌లో బుమ్రా డాట్‌బాల్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సమయోచితంగా వికెట్లూ తీస్తున్నాడు. షమి అవకాశం అందుకున్నప్పటి నుంచి ఎలా రెచ్చిపోతున్నాడో తెలిసిందే. సిరాజ్‌ బుల్లెట్‌ బంతులతో విజృంభిస్తున్నాడు. స్పిన్నర్లు కుల్‌దీప్‌, జడేజా సైతం ప్రభావవంతంగా బౌలింగ్‌ చేస్తున్నారు.

మొత్తంగా జట్టు జట్టంతా రాణిస్తోంది. సమష్టిగా చెలరేగుతోంది. మరి సెమీస్‌లో ఎవరు హీరోలుగా నిలిచి జట్టును ఫైనల్‌ గడప తొక్కిస్తారన్నది ఆసక్తికరం. గత మూడు ప్రపంచకప్‌ల్లోనూ సెమీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లి.. ఈసారి లెక్కలు సరిచేయాల్సి ఉంది. రోహిత్‌ సైతం నాకౌట్లో జట్టుకు మంచి ఆరంభాన్నిస్తాడని ఆశిస్తున్నారు. వీళ్లిద్దరూ రాణించి మిగతా బ్యాటర్లూ తలో చేయి వేస్తే భారీ స్కోరు చేయడం, పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదు. ఇక టోర్నీలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్న బౌలింగ్‌ విభాగం.. నాకౌట్లోనూ అదే స్థాయిలో రాణిస్తేనే ఇప్పటిదాకా సాధించిన ఘనతలకు సార్థకత వస్తుంది. ఆరంభంలో బుమ్రా, పవర్‌ ప్లే తర్వాత షమి.. మధ్య ఓవర్లలో స్పిన్‌ ద్వయం కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టుకు మంచి ఆరంభం దక్కినా నిరుత్సాహ పడకుండా వికెట్లు తీయడం.. ఆరంభంలో వికెట్లు పడగొడితే ఆ తీవ్రతను చివరిదాకా కొనసాగించి తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయడం కీలకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని