India v New Zealand: ఎవరిదో పైచేయి

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే.. కీలకమైన నాకౌట్‌లోనూ అతను ఇదే జోరు కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది.

Updated : 15 Nov 2023 08:39 IST

కోహ్లి × సౌథీ

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే.. కీలకమైన నాకౌట్‌లోనూ అతను ఇదే జోరు కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. అయితే న్యూజిలాండ్‌ సీనియర్‌ పేసర్‌ సౌథీతో అతనికి ప్రమాదం పొంచి ఉంది. విరాట్‌, సౌథీ ఇప్పటివరకూ 17 వన్డేల్లో తలపడ్డారు. ఇందులో ఆరుసార్లు కోహ్లీని సౌథీ ఔట్‌ చేశాడు. కొత్త బంతిని స్వింగ్‌ చేస్తూ, వికెట్లకు గురిపెడుతూ, ఆఫ్‌స్టంప్‌కు ఆవల వేస్తూ వికెట్‌ కోసం సౌథీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అతని బౌలింగ్‌లో ఇబ్బందిపడుతున్న కోహ్లి కేవలం 34.2 సగటు మాత్రమే నమోదు చేయగలిగాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లిని అత్యధికంగా పదిసార్లు ఔట్‌ చేసిన బౌలర్‌గా సౌథీ.. మొయిన్‌ అలీ, అండర్సన్‌లతో సమానంగా ఉన్నాడు. మరి బుధవారం సౌథీని విరాట్‌ ఎలా ఎదుర్కొంటాడో?


రోహిత్‌ × బౌల్ట్‌

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ధనాధన్‌ బ్యాటింగ్‌తో బౌలర్ల లయను దెబ్బకొడుతూ.భారీ స్కోరుకు బాటలు వేస్తున్నాడు రోహిత్‌ శర్మ. కానీ కొత్తబంతితో విజృంభించే బౌల్ట్‌ నుంచి రోహిత్‌కు సవాలు ఎదురు కానుంది. రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేసే ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. వన్డేల్లో 14 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ను నాలుగు సార్లు బౌల్ట్‌ ఔట్‌ చేశాడు. ఆ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్‌ సగటు 26.8 మాత్రమే. మెరుపు వేగం, కచ్చితత్వంతో బౌలింగ్‌ చేసే బౌల్ట్‌కు.. ఎదురుదాడికి దిగే రోహిత్‌కు మధ్య పోరు మంచి మజాను ఇస్తుందనడంలో సందేహం లేదు. బౌల్ట్‌పై ఆరంభంలోనే రోహిత్‌ పైచేయి సాధిస్తే.. ఆ ప్రభావం మిగతా బౌలర్లపైనా పడే ఆస్కారముంది. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో లంకపై మూడు వికెట్లతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన బౌల్ట్‌ను రోహిత్‌ ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.


రచిన్‌ × షమి

రచిన్‌ రవీంద్ర.. ఈ ప్రపంచకప్‌ ముందు వరకూ ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగుతోంది. ఈ కివీస్‌ యువ ఆటగాడు తన తొలి ప్రపంచకప్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు నమోదు చేశాడు. జట్టు అవసరాన్ని బట్టి ఓపెనర్‌గా, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న ఈ భారత సంతతి కుర్రాడు.. మైదానంలో కుదురుకుంటే భారత్‌కు కష్టమే. ఈ లెఫ్టార్మ్‌ బ్యాటర్‌ను వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చే బాధ్యత షమిదే. ప్రపంచకప్‌లో ఆలస్యంగా అడుగుపెట్టిన షమి వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్‌ బ్యాటర్ల పాలిట పీడకలగా మారుతున్నాడు. ఓవర్‌ ద వికెట్‌ వచ్చి, కచ్చితమైన లెంగ్త్‌లో బంతులు వేసి.. లోపలికి, బయటకు స్వింగ్‌ చేస్తూ వికెట్లు రాబడుతున్నాడు. ఇప్పుడదే వ్యూహంతో రచిన్‌ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు. లీగ్‌ మ్యాచ్‌లో స్లో ఆఫ్‌కటర్‌తో రచిన్‌ను షమి బోల్తా కొట్టించాడు.


కాన్వే × సిరాజ్‌

న్యూజిలాండ్‌ జట్టులో మరో కీలక ఆటగాడు కాన్వే. అతణ్ని కూడా ఆరంభ ఓవర్లలోనే పెవిలియన్‌ చేరిస్తే పట్టు సాధించేందుకు భారత్‌కు అవకాశం దొరుకుతుంది. కాన్వేపై మంచి రికార్డున్న సిరాజ్‌ మరోసారి అతణ్ని పెవిలియన్‌ చేరుస్తాడని జట్టు ఆశిస్తోంది. ఇప్పటివరకూ మూడు వన్డేల్లో రెండుసార్లు కాన్వేను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. ఈ ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లోనూ కాన్వే వికెట్‌ను సిరాజ్‌ సాధించాడు. పవర్‌ప్లేలో సిరాజ్‌ ప్రమాదకరమని తెలిసిందే. సెమీస్‌లోనూ అతను ఉత్తమ ప్రదర్శన చేయాలని జట్టు కోరుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని