Sourav Ganguly: వీరూ.. టెస్టు క్రికెట్‌ బ్యాటింగ్‌నే మార్చేశావ్‌

ప్రపంచస్థాయి బౌలర్లతో జట్లు బలంగా ఉన్న సమయంలో అద్భుతమైన ఆటతో టెస్టు క్రికెట్లో బ్యాటింగ్‌ తీరును వీరేంద్ర సెహ్వాగ్‌ మార్చేశాడని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ పేర్కొన్నాడు.

Updated : 15 Nov 2023 07:47 IST

దిల్లీ: ప్రపంచస్థాయి బౌలర్లతో జట్లు బలంగా ఉన్న సమయంలో అద్భుతమైన ఆటతో టెస్టు క్రికెట్లో బ్యాటింగ్‌ తీరును వీరేంద్ర సెహ్వాగ్‌ మార్చేశాడని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ(Sourav Ganguly) పేర్కొన్నాడు. మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌తో పాటు ఎడుల్జీ, అరవింద డిసిల్వాకు తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరూకు ఐసీసీ పంపిన ప్రశంసా పత్రంలో అతణ్ని గంగూలీ పొగడ్తల్లో ముంచెత్తాడు. ‘‘నీ (సెహ్వాగ్‌) బ్యాటింగ్‌ విధానమే నిన్ను ప్రత్యేక ఆటగాడిగా మార్చింది. టెస్టు క్రికెట్‌ టాప్‌ ఆర్డర్లో బ్యాటింగ్‌ తీరునే మార్చేశావ్‌. 2000 ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన బౌలర్లు ఉండటంతో టెస్టుల్లో అన్ని జట్లూ బలంగానే ఉన్నాయి. కానీ ఆ సమయంలోనే నీదైన శైలి బ్యాటింగ్‌తో అలరించావు. 2009లో శ్రీలంకపై నువ్వాడిన 293 పరుగుల ఇన్నింగ్స్‌ అందుకు నిదర్శనం. ముత్తయ్య మురళీధరన్‌ లాంటి బౌలర్లతో పటిష్ఠంగా ఉన్న లంకపై ఒకే రోజులో అన్ని పరుగులు చేయడం నీ సామర్థ్యాన్ని చాటింది. వన్డేల కంటే టెస్టుల్లోనే నువ్వు అత్యుత్తమ ఆటగాడివి. ముల్తాన్‌లో నువ్వు సాధించిన త్రిశతకం నాకెంతో ఇష్టమైన ఇన్నింగ్స్‌ల్లో ఒకటి. 200 పరుగులు, ఆ తర్వాత 300 పరుగులను సిక్సర్లతో చేరుకున్నావు. మాకు చెప్పి మరీ సిక్సర్లు కొట్టావు. గావస్కర్‌ తర్వాత వీరూనే అత్యుత్తమ ఓపెనర్‌. మిడిలార్డర్‌ బ్యాటర్‌గా అడుగుపెట్టిన నువ్వు పరిస్థి తుల కారణంగా ఓపెనర్‌గా మారాల్సి వచ్చింది. నీలాంటి ఆటగాణ్ని బయట కూర్చోబెట్టడం ఇష్టం లేక ఓపెనింగ్‌ చేయమని నీకు చెప్పిన సందర్భం నాకు గుర్తుంది’’ అని దాదా పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని