Hardik Pandya: వారసుడు ఇతనేనా?

అతడి కోసం గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ఆల్‌రౌండర్‌ను వదులుకుంది. అతడి కోసం రూ.15 కోట్లు చెల్లించింది.

Updated : 28 Nov 2023 10:06 IST

ఈనాడు క్రీడావిభాగం

అతడి కోసం గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ఆల్‌రౌండర్‌ను వదులుకుంది. అతడి కోసం రూ.15 కోట్లు చెల్లించింది. అంతే కాకుండా భారీ మొత్తంలోనూ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంత చేసి ఆ ఆటగాణ్ని ఆ జట్టు తిరిగి దక్కించుకుంది. ఆ ఆటగాడు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అయితే.. ఆ జట్టు ముంబయి ఇండియన్స్‌. సొంతగూటికి హార్దిక్‌ను చేర్చేందుకు ముంబయి ఇంత శ్రమపడటం చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌ వారసుడిగా హార్దిక్‌ను జట్టు కెప్టెన్‌గా చేయడం కోసమే ఈ తతంగం నడిపించినట్లు తెలుస్తోంది.

హాగానాలకు తెరపడింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌లో జట్టు మారాడు. గుజరాత్‌ టైటాన్స్‌ను వదిలి తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికి చేరిపోయాడు. 2022లో లీగ్‌లో అడుగుపెట్టిన టైటాన్స్‌కు మొట్టమొదటి కెప్టెన్‌ హార్దిక్‌ (Hardik Pandya). సారథిగా తొలి సీజన్‌లోనే జట్టుకు మొదటి టైటిల్‌ అందించాడు. ఈ ఏడాది ఫైనల్‌ కూడా చేర్చాడు. అలాంటి కెప్టెన్‌ను గుజరాత్‌ ఎలా వదులుకుంది? అతని కోసం ముంబయి ఎందుకు పట్టుబట్టింది? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

అందుకేనా?: 2015లో ముంబయితోనే ఐపీఎల్‌ కెరీర్‌ మొదలెట్టిన హార్దిక్‌ 2021 వరకూ ఆ జట్టుతోనే ఆడాడు. నాలుగు టైటిళ్లలో భాగమయ్యాడు. కానీ 2022 ఐపీఎల్‌కు ముందు మెగా వేలం కోసం ముంబయి నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవాల్సి వచ్చింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌ను కొనసాగించిన ముంబయి హార్దిక్‌ను వద్దనుకుంది. కానీ ఇప్పుడా జట్టే పట్టుబట్టి మరీ జట్టులోకి తీసుకుంది. ముంబయి భవిష్యత్‌ కెప్టెన్‌గా, రోహిత్‌ వారసుడిగా హార్దిక్‌ను గుర్తించే ముంబయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముంబయికి అయిదు టైటిళ్లు అందించిన రోహిత్‌.. లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ అనడంలో సందేహం లేదు. టీమ్‌ఇండియా సారథ్యం అతనికి దక్కడానికి ఐపీఎల్‌లో నాయకత్వ ప్రదర్శన కూడా ఓ కారణమే. కానీ ఇప్పుడు రోహిత్‌ 37 ఏళ్లకు చేరువవుతున్నాడు. అతని కెరీర్‌ చరమాంకానికి చేరుకుంది. దీంతో అతని తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగానే హార్దిక్‌ను ముంబయి ఎంచుకుందని చెప్పాలి. ఇటు లీగ్‌లో గుజరాత్‌ సారథిగా, అటు టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ తన నాయకత్వ లక్షణాలు చాటుకున్నాడు. నిరుడే లీగ్‌లో కొత్తగా అడుగుపెట్టిన టైటాన్స్‌ను సమర్థంగా నడిపించి విజేతగా నిలిపాడు. అలాగే వరుసగా రెండో ఏడాదీ జట్టును ఫైనల్‌ చేర్చాడు. మరోవైపు నిరుడు టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు సారథిగా హార్దిక్‌ కొనసాగుతున్నాడు. భవిష్యత్‌లో అతను అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టును నడిపించే అవకాశముంది.

అందుకే ముంబయి ఇండియన్స్‌ను కూడా అతని చేతుల్లో పెట్టేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలిసింది. అయితే వచ్చే సీజన్‌కే రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయకపోవచ్చు. కానీ మున్ముందు ముంబయి సారథిగా హార్దిక్‌ను చూడొచ్చు. మరోవైపు ముంబయిలోకి తిరిగి వెళ్లేందుకు కూడా హార్దిక్‌ మొగ్గుచూపాడు. టైటాన్స్‌కు ఆడుతుంటే పేరుకు పేరు, డబ్బు, గౌరవం అన్నీ ఉన్నా.. ముంబయి లాంటి జట్టు కెప్టెన్సీ అంటే అవన్నీ దిగదుడుపే అనుకుని హార్దిక్‌ జట్టు మారి ఉండొచ్చు. ఇప్పుడు ముంబయికి వైస్‌ కెప్టెన్‌గా సూర్యకుమార్‌ ఉన్నాడు. కానీ ఇకపై హార్దిక్‌ అంతా తానై.. క్రమంగా జట్టుకు సారథిగా మారే ఆస్కారముంది. ఇక ఆల్‌రౌండర్‌గానూ ముంబయికి హార్దిక్‌ సేవలు ఎంతో అవసరం. ఆ జట్టుకు ఆడుతున్నప్పుడు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అతను రాణించాడు. పొలార్డ్‌తో కలిసి జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కానీ 2022లో హార్దిక్‌ లేకపోవడం, ఆ తర్వాత పొలార్డ్‌ కూడా దూరమవడంతో ఆల్‌రౌండర్‌ లోటు ఏర్పడింది. ఈ సీజన్‌లో కామెరూన్‌ గ్రీన్‌తో ఆ ఖాళీని భర్తీ చేసినా.. హార్దిక్‌ లాంటి ఆటగాడు ఉంటే జట్టుకు వచ్చే సమతూకమే వేరు. అందుకే ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకుని హార్దిక్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారనే చెప్పాలి. మరోవైపు హార్దిక్‌ వెళ్లాలనే ఆసక్తి చూపడంతో గుజరాత్‌ కూడా కాదనలేకపోయిందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు