Dravid: మెప్పించాడు ఇలా...

జూనియర్‌ కోచ్‌గా, ఎన్‌సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్‌ ఏనాడు టీమ్‌ఇండియా కోచ్‌ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్‌ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగాడు.

Updated : 30 Nov 2023 12:57 IST

జూనియర్‌ కోచ్‌గా, ఎన్‌సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్‌ ఏనాడు టీమ్‌ఇండియా కోచ్‌ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్‌ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగాడు. కానీ కోచింగ్‌ ద్రవిడ్‌కు పూల పాన్పేమీ కాలేదు. 2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్‌.. ఆరంభంలోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కోహ్లి కెప్టెన్సీపై రగడ జట్టులో ఎంత అలజడి రేపిందో తెలిసిందే. అ అశాంతిని చల్లార్చి, జట్టు ఆటపై పూర్తిగా ఏకాగ్రత నిలిపేలా చేయడమే ద్రవిడ్‌ సాధించిన మొదటి విజయం. కానీ కోచ్‌గా మొదట్లో ద్రవిడ్‌కు అంతగా మంచి మార్కులేమీ పడలేదు. మేజర్‌ టోర్నీల్లో జట్టు ప్రదర్శనే అందుకు కారణం. 2022 ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్పుల్లో టీమ్‌ఇండియా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ జట్టు ఓడిపోవడంతో ద్రవిడ్‌పై విమర్శలు తప్పలేదు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, మౌనంగా ప్రపంచకప్‌కు జట్టును ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం చేశాడు మిస్టర్‌ డిపెండబుల్‌. తగిన కూర్పు కోసం ఏడాది ముందు నుంచే ప్రక్రియను మొదలెట్టాడు.

అతడు చేసిన మొదటి పని.. ప్రపంచకప్‌లో ఆడగలరు, వారి అవసరం ఉంది అనుకున్న ఆటగాళ్లను గుర్తించి వారిపైనే దృష్టిసారించడం. ఆ ఆటగాళ్లకు తగినన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించడం. సెలక్టర్లు, కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్‌.. (దాదాపు) 24 మంది ఆటగాళ్లతో ఓ పూల్‌ను సిద్ధం చేశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే.. ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే. ఇది దాటి మరొకరు కనిపించరు. ఇందులో నుంచే ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేశారు. ద్రవిడ్‌ ముందు చూపునకు, పక్కా ప్రణాళికకు ఇది ఓ సూచిక. అలాగే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల ఫామ్‌పై, ఫిట్‌నెస్‌పై ఎన్ని అనుమానాలు, విమర్శలు వ్యక్తమైనా.. ప్రపంచకప్‌ జట్టుకు వారి ఎంపికపై వ్యతిరేకత వ్యక్తమైనా ద్రవిడ్‌ తగ్గలేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లకు వెన్నుదన్నుగా నిలిచాడు. తీవ్ర వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డ బుమ్రాను సైతం తొందరపాటు లేకుండా మెగా టోర్నీకి సిద్ధం చేసిన తీరును మెచ్చుకోవాల్సిందే.

ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అప్రతిహత విజయాల్లోనూ ద్రవిడ్‌ ముద్ర స్పష్టం. ఒక్కో ఆటగాడికి ఒక్కో ప్రత్యేక బాధ్యతను అప్పగించడం ఎంత గొప్ప ఫలితాన్నిచ్చిందో వేరే చెప్పక్కర్లేదు. ఉదాహరణ ఆరంభంలో ఎటాకింగ్‌కు దిగే పాత్ర రోహిత్‌దైతే.. ఆ తర్వాత ఓ వైపు ఇరుసులా నిలబడి మరోవైపు ఆటగాళ్లు దూకుడుగా ఆడేలా వీలు కల్పించే బాధ్యత విరాట్‌ కోహ్లీది. ప్రక్రియలో తాత్కాలిక ఎదురుదెబ్బలు తగిలినా ద్రవిడ్‌.. తన ప్రపంచకప్‌ ప్రణాళిక నుంచి పక్కకు జరగలేదు. జట్టులో విపరీతంగా మార్పులూ చేయలేదు. అన్నింటికన్నా మిన్నగా తన స్నేహశీలతతో ఆటగాళ్లందరి విశ్వాసాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందడం ద్రవిడ్‌ సాధించిన అతి పెద్ద విజయం. ఇదే జట్టు విజయవంతం కావడానికి మూలం. ఒక్క రోజు తడబడ్డ కారణంగా భారత్‌ ప్రపంచకప్‌ నెగ్గకపోయినా.. జట్టుకు మార్గనిర్దేశం చేసిన తీరుతో కోచ్‌ ద్రవిడ్‌ బీసీసీఐ సహా అందరినీ మెప్పించాడనడంలో సందేహం లేదు. ఫలితమే కోచ్‌గా మరో ఇన్నింగ్స్‌!  

ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని