IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్‌కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్‌.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది.

Updated : 30 Nov 2023 13:03 IST

గువాహటి: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్‌కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్‌.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ 4 ఓవర్లలో 68 పరుగులిచ్చి టీ20ల్లో భారత్‌ తరఫున ఘోరమైన ప్రదర్శన కనబరిచాడు. ‘‘బౌలర్ల ప్రదర్శన ఆందోళన కలిగించట్లేదు. తడి బంతితో బౌలింగ్‌ చేస్తున్నట్లుగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. మంచు పరిస్థితుల్లో ఓవర్‌కు 12 లేదా 13, 14 పరుగుల ఛేదన కూడా సాధ్యమే. తొలి మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని మేం సునాయాసంగా ఛేదించాం. కాబట్టి బౌలింగ్‌ ప్రదర్శనపై ఆందోళన అవసరం లేదు. పరిస్థితులు బౌలర్లకు కఠినంగా ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. మ్యాక్స్‌వెల్‌ అద్భుతంగా ఆడాడు. అత్యంత క్లిష్టమైన ఇన్నింగ్స్‌ అది. మా బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించారు. మంచు విపరీతంగా ఉండటంతో బంతి జారిపోతుంది’’ అని రుతురాజ్‌ వివరించాడు.


సిరీస్‌ విలువ తగ్గిపోయింది

గువాహటి: వన్డే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే జరుగుతుండడం వల్ల భారత్‌, ఆస్ట్రేలియా మధ్య అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ విలువ తగ్గిపోయిందని ఆసీస్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ హసి అన్నాడు. అతి క్రికెట్‌ వల్ల ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా ఆలసిపోతున్నారని అభిప్రాయపడ్డాడు. భారత్‌, ఆసీస్‌ మధ్య సిరీస్‌లో అత్యుత్తమ జట్లు తలపడట్లేదని హసి అన్నాడు  ‘‘ఈ టీ20 సిరీస్‌ విలువ తగ్గిపోయిందని భావిస్తున్నా. ప్రపంచకప్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు టీ20 సిరీస్‌లో ఉండాల్సిన వాళ్లే. టెస్టు సిరీస్‌కు వెళ్లడానికి వాళ్లు ఇంటికైనా వెళ్లిపోయారు లేదా విశ్రాంతి తీసుకుంటున్నారు’’ అని హసి అన్నాడు. ‘‘అత్యుత్తమ ఆసీస్‌ టీ20 జట్టు.. అత్యుత్తమ భారత టీ20 జట్టుతో తలపడట్లేదు’’ అని చెప్పాడు. రెండు జట్ల నుంచి చాలా మంది ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని