వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్‌ఇండియా

సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్‌, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్‌లో ఎస్‌ఎల్‌సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది.

Updated : 30 Nov 2023 04:18 IST

కొలంబో: సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్‌, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్‌లో ఎస్‌ఎల్‌సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. అందులో 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లు ఉన్నాయి. ప్రభుత్వం జోక్యం కారణంగా ఎస్‌ఎల్‌సీపై ఐసీసీ ఇటీవలే నిషేధం విధించింది. అండర్‌-19 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాకు తరలించింది. అయితే శ్రీలంక పురుషులు, మహిళల జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనేందుకు అనుమతిచ్చింది.


ఇంగ్లాండ్‌-ఎపై భారత్‌ విజయం

ముంబయి: ఇంగ్లాండ్‌-ఎతో మూడు మ్యాచ్‌ల మహిళల టీ20 సిరీస్‌లో ఇండియా-ఎ శుభారంభం చేసింది. బుధవారం తొలి మ్యాచ్‌లో ఇండియా-ఎ మూడు పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్‌-ఎపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఎ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు రాబట్టింది. దినేశ్‌ వృందా (22), దిశ కసట్‌ (25), జ్ఞానానంద దివ్య (22) రాణించారు. అంనతరం ఇంగ్లాండ్‌-ఎ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసింది. హోలీ ఆర్మిటేజ్‌ (52) అర్ధ సెంచరీ వృథా అయింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతమ్‌ (2/23), శ్రేయాంక పాటిల్‌ (2/26), మన్నత్‌ కశ్యప్‌ (1/21), మిన్ను మని (1/28), ప్రకాశిక నాయక్‌ (1/28) రాణించి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు.


హైదరాబాద్‌, ఆంధ్ర ఓటమి  

విజయ్‌ హజారె ట్రోఫీ

ముంబయి: విజయ్‌ హజారె ట్రోఫీలో బుధవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ చేతిలో ఓడిపోయింది. నితిన్‌ యాదవ్‌ (3/53), అర్జున్‌ (2/37), పుల్‌కిత్‌ (2/27) ధాటికి మొదట హైదరాబాద్‌ 50 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ బుద్ధి (80) టాప్‌ స్కోరర్‌. తన్మయ్‌ అగర్వాల్‌ (45) రాణించాడు. వినీత్‌ (78), రజత్‌ (77) చెలరేగడంతో లక్ష్యాన్ని సర్వీసెస్‌.. 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో మ్యాచ్‌ (గ్రూప్‌-డి)లో ఆంధ్ర 38 పరుగుల తేడాతో రాజస్థాన్‌ చేతిలో ఓడింది. మొదట రాజస్థాన్‌ 50 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్‌ తోమర్‌ సెంచరీ (124) సాధించాడు. ఛేదనలో ఆంధ్ర 47.4 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ హెబ్బర్‌ (68), హనుమ విహారి (68) రాణించారు.


భారత్‌ శుభారంభం

ప్రపంచ మహిళల జూనియర్‌ హాకీ

సాంటియాగో: ప్రపంచ మహిళల జూనియర్‌ హాకీలో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం తొలి మ్యాచ్‌లో 12-0తో కెనడాను చిత్తుగా ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి భారత అమ్మాయిలదే ఆధిపత్యం. కెనడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్‌లో ముంతాజ్‌ ఖాన్‌ 4 గోల్స్‌ కొట్టగా.. అన్ను, దీపిక, హ్యాట్రిక్‌ నమోదు చేశారు. మ్యాచ్‌ తొలి ఆరు నిమిషాల్లోనే రెండు పెనాల్టీ కార్నర్‌లను సద్వినియోగం చేసి అన్ను జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చింది. రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి 4-0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరింత చెలరేగిపోయింది. మోనికా, నీలమ్‌ తలో గోల్‌ కొట్టారు.


శ్రీకాంత్‌ పరాజయం

లఖ్‌నవూ: భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ పేలవమైన ఫామ్‌ కొనసాగుతోంది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ టోర్నీ తొలి రౌండ్లోనే శ్రీకాంత్‌ ఇంటిముఖం పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-23, 8-21తో చియా హావో లీ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశాడు. మిథున్‌ మంజునాథ్‌ 16-21, 14-21తో అలెక్స్‌ లానియెర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. ప్రియాన్షు రజావత్‌ 21-17, 21-19తో దిమిత్రి పనరిన్‌ (కజకిస్తాన్‌)పై, కిరణ్‌ జార్జ్‌ 21-16, 14-21, 21-13తో చిరాగ్‌ సేన్‌పై, సతీశ్‌కుమార్‌ 21-8, 21-13తో హువాంగ్‌ కాయ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో రుత్విక శివాని 21-14, 21-14తో కెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్‌)పై, ఉన్నతి హుడా 15-21, 21-19, 21-18తో ఆకర్షి కశ్యప్‌పై, అనుపమ ఉపాధ్యాయ 14-21, 21-15, 21-9తో ఎమిలీ షూజ్‌ (డెన్మార్క్‌)పై, అష్మితా చాలిహా 21-15, 21-15తో పోలినా బురోవా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీ 21-9, 21-16తో అపూర్వ- సాక్షి జంటపై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.


క్వార్టర్స్‌లో థాపా, అమిత్‌

షిల్లాంగ్‌: జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్టార్‌ క్రీడాకారులు శివ థాపా (అస్సాం), అమిత్‌ పంఘాల్‌ (ఎస్‌ఎస్‌సీబీ) క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం 63.5 కేజీల ప్రిక్వార్టర్స్‌లో థాపా 5-0తో సంతోష్‌ (కర్ణాటక)పై విజయం సాధించాడు. 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో పంఘాల్‌ 4-1తో జైషన్‌దీప్‌ సింగ్‌ (పంజాబ్‌)పై గెలుపొందాడు. 92 కేజీలలో సంజీత్‌ (ఎస్‌ఎస్‌సీబీ) 5-0తో సావన్‌ గిల్‌ (చండీగఢ్‌)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో శశాంక్‌ ప్రధాన్‌ (దిల్లీ)తో థాపా, మహ్మద్‌ ఆరిఫ్‌ (జమ్మూకాశ్మీర్‌)తో పంఘాల్‌, నమన్‌ తన్వర్‌ (ఆర్‌ఎస్‌పీబీ)తో సంజీత్‌ తలపడతారు.


అథ్లెటిక్స్‌ను ఆకర్షణీయంగా మార్చాలి

బెంగళూరు: భారత అభిమానులకు అనుగుణంగా అథ్లెటిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగాల్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అన్నాడు. మార్కెటింగ్‌ చేయగలిగేలా తీర్చిదిద్దాలని ఆర్‌సీబీ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ లీడర్స్‌ సదస్సులో నీరజ్‌ సూచించాడు. ‘‘డైమండ్‌ లీగ్‌, కాంటినెంటల్‌ టోర్నీలు, ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లకు భారత్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వాలి. పోటీలను అభిమానులు చూడాలనుకున్నా హైలైట్స్‌ మాత్రమే వస్తున్నాయి. రాత్రి 1-2 గంటల వరకు ఎదురుచూస్తున్నా నిరాశే ఎదురవుతుంది. కెన్యా, గ్రెనెడా వంటి దేశాలు ప్రపంచ స్థాయి వసతుల్లో అంతర్జాతీయ టోర్నీలను తరచుగా నిర్వహిస్తున్నప్పుడు భారత్‌కు కూడా ఆతిథ్యం సాధ్యమే’’ అని నీరజ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని