India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..

దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా సిద్ధం. అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్‌, వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ భారత్‌కు నాయకత్వం వహించనున్నారు.

Updated : 01 Dec 2023 09:07 IST

టెస్టు జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌
వన్డేలకు రాహుల్‌, టీ20లకు సూర్య
దిల్లీ

దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా(India vs South Africa) సిద్ధం. అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్‌, వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ భారత్‌కు నాయకత్వం వహించనున్నారు. టెస్టు కెప్టెన్‌ రోహిత్‌.. ఈ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలాగే కోహ్లి కూడా.

దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్‌ కమిటీ... గురువారం జట్లను ప్రకటించింది. డిసెంబరు 26న ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్‌ నేతృత్వంలో పోటీపడే భారత జట్టుకు బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి తనకు విశ్రాంతినివ్వాలన్న కోహ్లి విజ్ఞప్తిని కూడా బీసీసీఐ మన్నించింది. హార్దిక్‌ పాండ్య గైర్హాజరీలో టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపికయ్యాడు. రోహిత్‌ విశ్రాంతి నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ కేఎల్‌ రాహుల్‌కు లభించింది. వన్డే జట్టుకు ఎంపికైన ఆటగాళ్లలో చాలా మంది టెస్టులు లేదా టీ20లకు లేకపోవడం గమనార్హం. ముగ్గురు ఆటగాళ్లు.. శ్రేయస్‌ అయ్యర్‌, ముకేశ్‌ కుమార్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మాత్రమే మూడు జట్లలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలో భారత్‌ మూడేసి వన్డేలు, టీ20లు, రెండు టెస్టుల్లో ఆడనుంది. డిసెంబరు 10న టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ఆరంభమవుతుంది.

వన్డే జట్టు కొత్తగా..: ప్రస్తుతానికి వన్డేలకు ప్రాధాన్యం తక్కువే అయినా.. రాహుల్‌ నేతృత్వంలోని వన్డే జట్టు కొత్తగా కనిపిస్తోంది. రజత్‌ పటీదార్‌, సాయి సుదర్శన్‌, రింకు సింగ్‌ ఈ ఫార్మాట్లో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. టెస్టుల్లో లేని కుల్‌దీప్‌ యాదవ్‌ వన్డే, టీ20 జట్లు రెండింటిలోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్‌లో ఆడలేకపోయిన చాహల్‌ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్‌కి టీ20ల్లో అవకాశం దక్కించుకోగా.. ఈ ఫార్మాట్లో అక్షర్‌ పటేల్‌పై వేటు పడింది. జడేజా టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సంజు శాంసన్‌ వన్డే జట్టులో స్థానం సంపాదించాడు.

భారత్‌-ఎ కెప్టెన్‌గా భరత్‌: దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్‌-ఎ జట్టుగా కెప్టెన్‌గా కోన భరత్‌ నియమితుడయ్యాడు. ఈ పర్యటనలో భారత్‌-ఎ రెండు నాలుగు రోజులు మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు మ్యాచ్‌లకు భిన్న జట్లను ఎంపిక చేశారు. ఓ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ కూడా ఆడతాడు.


వాళ్ల కథ ముగిసినట్లేనా!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో 89 పరుగులు చేసిన రహానెకు అదే చివరి టెస్టేమో. మరో సీనియర్‌ పుజారా పరిస్థితి కూడా అంతే. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులో పునరాగమనం చేసిన నేపథ్యంలో సెలక్టర్లు వెటరన్‌ ఆటగాళ్లపై  వేటు వేశారు. వీళ్లిద్దరితో పాటు ఉమేశ్‌ యాదవ్‌కు కూడా అవకాశం దక్కలేదు. టెస్టు జట్టులో స్థానం కోసం కుర్రాళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నందున ఈ ముగ్గురు మళ్లీ టెస్టు జట్టులోకి రావడం కష్టమే.


టీ20 జట్టు

సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, శ్రేయస్‌, ఇషాన్‌ కిషన్‌, జితేశ్‌ శర్మ, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌.


వన్డే జట్టు

రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌, సాయి సుదర్శన్‌, తిలక్‌ వర్మ, రజత్‌ పటీదార్‌, రింకు సింగ్‌, శ్రేయస్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, ముకేశ్‌ కుమార్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌.


టెస్టు జట్టు

రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, కోహ్లి, శ్రేయస్‌, రుతురాజ్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌, అశ్విన్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, షమి, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు