Team India: బౌలర్లు పుంజుకునేనా!

పొట్టి సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్‌ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్‌ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్‌ ఆశలను ఆసీస్‌ సజీవంగా ఉంచుకుంది.

Published : 01 Dec 2023 04:45 IST

ఆసీస్‌తో భారత్‌ నాలుగో టీ20 నేడు
రాత్రి 7 గంటల నుంచి
రాయ్‌పుర్‌

పొట్టి సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్‌ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్‌ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్‌ ఆశలను ఆసీస్‌ సజీవంగా ఉంచుకుంది. సిరీస్‌ ఫలితం ఇక్కడే తేలుతుందా లేదా ఆఖరి మ్యాచ్‌లో నిర్ణయమవుతుందా అన్నది చూడాలి.
బౌలింగే సమస్య!: టీమ్‌ఇండియాకు బౌలింగే ఆందోళన కలిగిస్తోంది. యువ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. నెగ్గాలంటే ఆఖరి ఓవర్ల బౌలింగ్‌ బాగా మెరుగుపడడం అత్యవసరం. మూడో మ్యాచ్‌లో భారత బౌలర్లు చివరి రెండు ఓవర్లలో 40కి పైగా పరుగులను కాపాడలేకపోయారు. మ్యాక్స్‌వెల్‌ ఊచకోతతో కంగారూ జట్టు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో 21 సహా నాలుగు ఓవర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ ఏకంగా 68 పరుగులిచ్చాడు. ప్రసిద్ధ్‌తో పాటు అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లోనూ వైవిధ్యం లోపించింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు 131 పరుగులిచ్చి కేవలం రెండు వికెట్లే పడగొట్టాడు. ఆసీస్‌ విధ్వంసక వీరుడు మ్యాక్స్‌వెల్‌ గైర్హాజరీ సానుకూలాంశమే అయినా.. బౌలర్లు పుంజుకోకుంటే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. మూడో మ్యాచ్‌కు ముందు జట్టులోకి వచ్చిన దీపక్‌ చాహర్‌.. ప్రసిద్ధ్‌ స్థానంలో నాలుగో టీ20లో ఆడే అవకాశముంది. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సూపర్‌ ఫామ్‌ భారత్‌కు పెద్ద సానుకూలాంశం. అతడితోపాటు యశస్వి, ఇషాన్‌, సూర్యకుమార్‌, రింకూలతో లైనప్‌ బలంగా ఉంది. ఇక చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులోకి వచ్చాడు. తిలక్‌ వర్మ స్థానంలో అతడు తుది జట్టులో ఆడే అవకాశముంది. మరో వైపు స్టార్‌ బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌తో పాటు స్మిత్‌, జంపా వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయినా.. ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. కంగారూ తుది జట్టులో అనేక మార్పులు జరగనున్నాయి. మ్యాచ్‌లో పైచేయి సాధించాలంటే మాత్రం ట్రావిస్‌ హెడ్‌, కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌లను భారత బౌలర్లు నిలువరించాల్సిందే. మ్యాచ్‌ వేదిక షహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియంలో పిచ్‌ కాస్త మందకొడిగా ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని