Rohit Sharma: రోహిత్‌ అప్పటిదాకా..

కనీసం 2024 టీ20 ప్రపంచకప్‌ వరకు రోహిత్‌ టీ20 కెప్టెన్‌గా ఉండాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌ రోహిత్‌తోపాటు కోహ్లి.

Updated : 02 Dec 2023 12:36 IST

కోల్‌కతా: కనీసం 2024 టీ20 ప్రపంచకప్‌ వరకు రోహిత్‌ టీ20 కెప్టెన్‌గా ఉండాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌ రోహిత్‌తోపాటు కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి  తెలిసిందే. ముందు ముందు తీరిక లేని క్రికెట్‌ ఉన్న నేపథ్యంలో వారికి విశ్రాంతి సమంజసమేనని గంగూలీ చెప్పాడు. ‘‘రోహిత్‌ తిరిగి అన్ని ఫార్మాట్లు ఆడడం మొదలెట్టాక.. అతడే కెప్టెన్‌గా ఉండాలి. ఎందుకంటే వన్డే ప్రపంచకప్‌లో సారథిగా అతడు గొప్పగా రాణించాడు. జట్టు ఎంత బాగా ఆడిందో చూశాం’’ అని అన్నాడు. రోహిత్‌, కోహ్లిలు ఇద్దరూ 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. ‘‘ద్వైపాక్షిక సిరీస్‌లకు ప్రపంచప్‌లు పూర్తిగా భిన్నమైనవి. ఈ వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు చాలా బాగా ఆడింది. ఆరేడు నెలల తర్వాత వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ బాగా ఆడతారని ఆశిద్దాం. రోహిత్‌ నాయకుడు. 2024 టీ20 ప్రపంచకప్‌ వరకు అతడు సారథిగా కొనసాగుతాడని భావిస్తున్నా’’ అని గంగూలీ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని