IND vs AUS: కంగారూలను తిప్పేశారు

టీమ్‌ఇండియా అదరహో. నాలుగో టీ20లో కంగారూలను మట్టికరిపించిన ఆతిథ్య జట్టు.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే పొట్టి సిరీస్‌ను పట్టేసింది. గత మ్యాచ్‌లో కొండంత స్కోరు చేసినా పరాజయంపాలైన భారత్‌.. ఈసారి 174 పరుగులను కాపాడుకుంది. అక్షర్‌ పటేల్‌ అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రింకు మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు.

Updated : 02 Dec 2023 06:46 IST

అక్షర్‌, బిష్ణోయ్‌ మాయ
నాలుగో టీ20లో భారత్‌ విజయం
సిరీస్‌ కైవసం
రాయ్‌పుర్‌

టీమ్‌ఇండియా అదరహో. నాలుగో టీ20లో కంగారూలను మట్టికరిపించిన ఆతిథ్య జట్టు.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే పొట్టి సిరీస్‌ను పట్టేసింది. గత మ్యాచ్‌లో కొండంత స్కోరు చేసినా పరాజయంపాలైన భారత్‌.. ఈసారి 174 పరుగులను కాపాడుకుంది. అక్షర్‌ పటేల్‌ అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రింకు మరోసారి బ్యాటుతో ఆకట్టుకున్నాడు.

స్ట్రేలియాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఆ జట్టు 20 పరుగుల తేడాతో కంగారూలను ఓడించింది. రింకు సింగ్‌ (46; 29 బంతుల్లో 4×4, 2×6), జితేశ్‌ శర్మ (35; 19 బంతుల్లో 1×4, 3×6) మెరవడంతో మొదట భారత్‌ 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఛేదనలో ‘ప్లేయర్‌ ఆఫ్‌  మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (3/16) విజృంభించడంతో ఆసీస్‌ 7 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. రవి బిష్ణోయ్‌   (1/17) పొదుపుగా బౌలింగ్‌ చేసి కంగారూలను కట్టిపడేశాడు. వేడ్‌ (36 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. అవేష్‌ ఖాన్‌ (1/33), దీపక్‌ చాహర్‌ (2/44) స్పిన్నర్లకు సహకరించారు. ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ 3-1తో ఆధిక్యంలో నిలిచింది.

కంగారూ కట్టడి: ఆసీస్‌ ఛేదనలో స్పిన్నర్ల మాయాజాలం భారత్‌ను బలంగా నిలిపింది. ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మొదట్లో భారత్‌కు కలవరం తప్పలేదు.హెడ్‌ (31; 16 బంతుల్లో 5×4, 1×6) విరుచుకుపడడంతో ఆసీస్‌ 3 ఓవర్లలో 40/0తో నిలిచింది. అయితే నాలుగో ఓవర్లో మరో ఓపెనర్‌ ఫిలిప్‌ (8)ను ఔట్‌ చేయడం ద్వారా బిష్ణోయ్‌.. భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. ఆ తర్వాత అక్షర్‌ వరుస ఓవర్లలో ప్రమాదకర హెడ్‌, హార్డీ (8)లను ఔట్‌ చేయడంతో ఆసీస్‌ 52/3కు పరిమితమైంది. ఆ దశలో మెక్‌డెర్మట్‌ (19)తో కలిసి టిమ్‌ డేవిడ్‌ (19) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ అక్షర్‌, అవేష్‌, బిష్ణోయ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ 11 ఓవర్లలో 83/3తో నిలిచింది. తర్వాతి ఓవర్లో మెక్‌డెర్మట్‌ను అక్షర్‌ వెనక్కి పంపాడు. దూకుడుగా ఆడిన షార్ట్‌(22) రెండు ఫోర్లు, సిక్స్‌తో ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చే ప్రయత్నం చేసినా.. టిమ్‌ డేవిడ్‌ను దీపక్‌ చాహర్‌ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ 15 ఓవర్లలో 108/5తో నిలిచింది. చివరి 5 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన పరిస్థితి. షార్ట్‌, వేడ్‌ క్రీజులో ఉండడంతో ఆసీస్‌ రేసులోనే ఉంది. ముకేశ్‌ 16వ ఓవర్లో 14 పరుగులిచ్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. కేవలం ఆరు పరుగులే ఇచ్చిన చాహర్‌.. షార్ట్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌ పట్టు సంపాదించింది. 18వ ఓవర్లో ఆరు పరుగులే ఇచ్చిన అవేష్‌.. డ్వార్షిస్‌ను వెనక్కి పంపడంతో మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ చేతుల్లోకి వచ్చినట్లయింది. ఆసీస్‌ చివరి రెండు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి ఉండగా.. 19వ ఓవర్లో ముకేశ్‌ 9 పరుగులే ఇవ్వడంతో టీమ్‌ఇండియా విజయం ఖాయమైపోయింది. వేడ్‌ కడవరకూ ఉన్నా ఫలితం లేకపోయింది. స్పిన్నర్లు అక్షర్‌, బిష్ణోయ్‌ కలిసి 8 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 33 పరుగులే ఇవ్వడం విశేషం.

మెరిసిన రింకు, జితేశ్‌: అంతకుముందు భారత్‌ ఇన్నింగ్స్‌లో రింకు, జితేశ్‌ మెరుపులే హైలైట్‌. జట్టు ఇంకా పెద్ద స్కోరు చేయాల్సింది. కానీ ఆఖర్లో కంగారూ బౌలర్లు భారత్‌ను కట్టడి చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా.. 5.5 ఓవర్లలో 50/0తో నిలిచింది. నెమ్మదిగా ఆరంభించిన యశస్వి జైస్వాల్‌ (37).. క్రమంగా బ్యాట్‌ ఝుళిపించాడు. డ్వార్షిస్‌ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. గ్రీన్‌ ఓవర్లో 4, 6 దంచాడు. కానీ స్కోరు బోర్డు సాఫీగా సాగిపోతున్న దశలో భారత్‌ ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. 13 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు పడ్డాయి. మంచి ఊపు మీదున్న దశలో, ఆరో ఓవర్లో.. హార్డీ బౌలింగ్‌లో జైస్వాల్‌ వెనుదిరిగాడు. ఆ  తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (8), సూర్యకుమార్‌ (1) కూడా వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. అయితే రుతురాజ్‌ (32) ధాటిగా ఆడకపోయినా.. రింకుతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి 16 బంతుల్లో 14 పరుగులు చేసిన అతడు.. పదో ఓవర్లో సంఘా బౌలింగ్‌లో ఓ సిక్స్‌ బాదాడు. రింకు మొదట్లో నెమ్మదిగా ఆడినా.. క్రమంగా బ్యాట్‌కు పని చెప్పాడు. షార్ట్‌ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌ సిక్స్‌తో ఆకట్టుకున్న అతడు.. డ్వార్షిస్‌ ఓవర్లో లెగ్‌సైడ్‌ సిక్స్‌తో అలరించాడు. 14వ ఓవర్లో రుతురాజ్‌ ఔట్‌ కావడంతో 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి స్కోరు 111. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ వచ్చీ రావడంతోనే బాదుడు మొదలెట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అరంగేట్ర బౌలర్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన అతడు.. హార్డీ బౌన్సర్‌నూ లెగ్‌ సైడ్‌ కళ్లు చెదిరే షాట్‌తో సిక్స్‌గా మలిచాడు. రింకు కూడా చకచకా బౌండరీలు బాదాడు. కానీ ఆఖర్లో ఆసీస్‌ బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేశారు. 17.2 ఓవర్లలో 155/4తో ఉన్న భారత్‌.. మిగతా ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది. 19వ ఓవర్లో హార్డీ 7 పరుగులే ఇచ్చి జితేశ్‌, అక్షర్‌లను ఔట్‌ చేశాడు. ఆఖరి ఓవర్లో (బెరెండార్ఫ్‌) భారత్‌ ఆరు పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) మెక్‌డెర్మట్‌ (బి) హార్డీ 37; రుతురాజ్‌ (సి) డ్వార్షిస్‌ (బి) సంఘా 32; శ్రేయస్‌ (సి) గ్రీన్‌ (బి) సంఘా 8; సూర్యకుమార్‌ (సి) వేడ్‌ (బి) డ్వార్షిస్‌ 1; రింకు సింగ్‌ ఎల్బీ (బి) బెరెండార్ఫ్‌ 46; జితేశ్‌ శర్మ (సి) హెడ్‌ (బి) డ్వార్షిస్‌ 35; అక్షర్‌ పటేల్‌ (సి) సంఘా (బి) డ్వార్షిస్‌ 0; దీపక్‌ చాహర్‌ (సి) గ్రీన్‌ (బి) బెరెండార్ఫ్‌ 0; రవి బిష్ణోయ్‌ రనౌట్‌ 4; అవేష్‌ ఖాన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10

మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174

వికెట్ల పతనం: 1-50, 2-62, 3-63, 4-111, 5-167, 6-168, 7-168, 8-169, 9-174

బౌలింగ్‌: హార్డీ 3-1-20-1; బెరెండార్ఫ్‌ 4-0-32-2; బెన్‌ డ్వార్షిస్‌ 4-0-40-3; క్రిస్‌ గ్రీన్‌ 4-0-36-0; తన్వీర్‌ సంఘా 4-0-30-2; మాథ్యూ షార్ట్‌ 1-0-10-0

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: ట్రావిస్‌ హెడ్‌ (సి) ముకేశ్‌ (బి) అక్షర్‌ 31; జోష్‌ ఫిలిప్‌ (బి) బిష్ణోయ్‌ 8; మెక్‌డెర్మట్‌ (బి) అక్షర్‌ 19; హార్డీ (బి) అక్షర్‌ 8; టిమ్‌ డేవిడ్‌ (సి) జైస్వాల్‌ (బి) దీపక్‌ చాహర్‌ 19; షార్ట్‌ (సి) జైస్వాల్‌ (బి) చాహర్‌ 22; వేడ్‌ నాటౌట్‌ 36; డ్వార్షిస్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 1; క్రిస్‌ గ్రీన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8

మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154

వికెట్ల పతనం: 1-40, 2-44, 3-52, 4-87, 5-107, 6-126, 7-133

బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-44-2; ముకేశ్‌ కుమార్‌ 4-0-42-0; రవి బిష్ణోయ్‌ 4-0-17-1;  అక్షర్‌ పటేల్‌ 4-0-16-3; అవేష్‌ ఖాన్‌ 4-0-33-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని