Sports News: ఆ ఒక్క అథ్లెట్‌ డోపీనే

ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్‌ మీట్‌లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్‌ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్‌ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు.

Updated : 06 Dec 2023 10:18 IST

దిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్‌ మీట్‌లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్‌ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్‌ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు. వాళ్లెవరూ తిరిగి రాకపోవడంతో ఒక్కడితోనే పరుగు నిర్వహించారు. అదే రోజు అథ్లెట్‌ నుంచి నమూనాలు తీసుకోగా.. అతను పాజిటివ్‌గా తేలాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు అక్టోబరులో నాడా నిర్ధరించింది. ‘‘డోపింగ్‌కు పాల్పడి ఉంటే ఫైనల్‌కు వచ్చేవాడినే కాదు. మిగతా వాళ్ల మాదిరే పారిపోయేవాడిని. జీవితంలో ఎప్పుడూ ఉత్ప్రేరకాలు తీసుకోలేదు. కొంతమంది కోచ్‌లు నన్ను ఇరికించారని అనిపిస్తుంది. నాడా కార్యాలయానికి వెళ్లినప్పుడు ‘బి’ నమూనాల్ని పరీక్షించాలంటే రూ.16,500 కట్టాలని చెప్పారు. నా దగ్గర డబ్బులు లేవు. నేను అప్పీల్‌ చేయలేను. నా కెరీర్‌ ప్రారంభం కాకముందే నాశనమైంది’’ అని సదరు అథ్లెట్‌ పేర్కొన్నాడు.


ప్రణయ్‌కి 8వ ర్యాంకు

దిల్లీ: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మంగళవారం ప్రకటించిన జాబితాలో పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌ 8,  లక్ష్యసేన్‌ 17, కిదాంబి శ్రీకాంత్‌ 24, ప్రియాన్షు రజావత్‌ 30వ ర్యాంకులు సాధించారు. మహిళల సింగిల్స్‌ పి.వి.సింధు 12వ స్థానంలో నిలిచింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీ రెండో ర్యాంకులో కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జంట 19వ స్థానంలో నిలిచింది.


8 తర్వాత డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల తేదీ ప్రకటన

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సంఘం (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలకు కొత్త  తేదీని ప్రకటించనున్నారు. పంజాబ్‌- హరియాణా హైకోర్టు నిలుపుదల   ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దుచేసిన నేపథ్యంలో ఈనెల 8న లేదా ఆ తర్వాత డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల తేదీ ప్రకటన వెలువడనుంది. ‘‘ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఓటర్ల జాబితాలో ఏమైనా మార్పులు ఉంటే అందించాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అడ్‌హక్‌ కమిటీని కోరాం. 8వ తేదీన ఎన్నికల తుది  ప్రకటన వెలువడుతుంది’’ అని   సహాయక రిటర్నింగ్‌ అధికారి తపస్‌ భట్టాచార్య తెలిపాడు.


తొలిసారి సిరీస్‌ గెలవాలని..

నేటి నుంచి కివీస్‌తో బంగ్లా రెండో టెస్టు

మిర్పూర్‌: న్యూజిలాండ్‌పై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలుపే లక్ష్యంగా బుధవారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ బరిలో దిగబోతోంది. తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లిన  బంగ్లా.. రెండో టెస్టులోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసిన స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ మరోసారి విజృంభిస్తే బంగ్లాకు గెలుపు కష్టం కాబోదు. కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో ఫామ్‌ కూడా ఆ జట్టుకు కీలకం. అయితే బంగ్లాకు సిరీస్‌ కోల్పోకూడదని కివీస్‌ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆశలు ఉండాలంటే స్పిన్‌ బౌలింగ్‌లో ఆ జట్టు ఇంకా మెరుగ్గా ఆడాలి. ఇష్‌ సోధి, అజాజ్‌ పటేల్‌ ప్రభావం చూపించలేకపోతున్నారు. అంతేకాదు కివీస్‌ బ్యాటర్లు.. బంగ్లా స్పిన్నర్లను కూడా సమర్థంగా ఎదుర్కోవాలి.


ఆ సందేశం వల్లే నేనిలా..

సిడ్నీ: టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌కావాలని నిర్ణయించుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు వీడ్కోలు టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా సెలక్టర్లు అవకాశం కల్పించడం, పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు అతణ్ని ఎంపిక చేయడం తెలిసిందే. అయితే ఫామ్‌లో లేని, బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణంలో సూత్రధారి అయిన వార్నర్‌కు ఇలాంటి అవకాశం ఎలా కల్పిస్తారంటూ మాజీ పేసర్‌ జాన్సన్‌ మండిపడడం ఆస్ట్రేలియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ బెయిలీని కూడా జాన్సన్‌ తప్పు పట్టాడు. వార్నర్‌కు అతడు చాలా సన్నిహితుడని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. కొన్ని నెలల కింద వార్నర్‌ నుంచి వచ్చిన ఒక సందేశం కూడా తాను వ్యాసం రాయడానికి కారణమని అతడు తాజాగా వెల్లడించాడు. ‘‘వార్నర్‌ను ఉద్దేశిస్తూ ఇంతకుముందు నేను ఓ వ్యాసం రాశాను. అప్పుడు అతడి నుంచి నాకు సందేశం వచ్చింది. అది చాలా వ్యక్తిగతమైంది. నేను ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించా. కానీ సాధ్యం కాలేదు. ఈ సందేశం వచ్చే వరకు వార్నర్‌తో వ్యక్తిగతంగా నాకెలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఇప్పుడు నేను ఈ వ్యాసం రాయడానికి బహుశా ఆ సందేశం కూడా కారణం కావొచ్చు. ఆ సందేశంలో విషయాలు చాలా బాధించాయి’’ అని జాన్సన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని