వోజ్నియాకికి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వైల్డ్‌కార్డ్‌

మహిళల మాజీ నంబర్‌వన్‌ కరోలిన్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌)కి 2024 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌ లభించింది. తొలి దశలో ఆమెతో పాటు ఆరుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్‌కార్డులు ఇచ్చారు.

Published : 07 Dec 2023 02:40 IST

మెల్‌బోర్న్‌: మహిళల మాజీ నంబర్‌వన్‌ కరోలిన్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌)కి 2024 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌ లభించింది. తొలి దశలో ఆమెతో పాటు ఆరుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్‌కార్డులు ఇచ్చారు. 33 ఏళ్ల వోజ్నియాకి 2018 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌. మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఆగస్టులో ఆమె టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. యుఎస్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్లో కొకో గాఫ్‌ చేతిలో ఓడిపోయింది. ‘‘మెల్‌బోర్న్‌లో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడం నా కెరీర్‌లోనే హైలైట్‌’’ అని చెప్పింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు తన ఇద్దరు పిల్లలను తీసుకురానున్నట్లు చెప్పింది. వోజ్నియాకి ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 242వ స్థానంలో ఉంది.


డబ్ల్యూపీఎల్‌ రెండు నగరాల్లో..

బెంగళూరు: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌ ఒకటి కంటే ఎక్కువ నగరాల్లో నిర్వహించే అవకాశముంది. ఈ ఏడాది తొలి సీజన్‌కు ముంబయిలోని డీవై పాటిల్‌, బ్రబోర్న్‌ స్టేడియాలు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది. ఈ లీగ్‌ను విస్తరించడానికి ఇదే మంచి సమయం. డిసెంబరు 9న డబ్ల్యూపీఎల్‌ వేలం సందర్భంగా ఆతిథ్య నగరాలపై తుది నిర్ణయం తీసుకోవచ్చు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.


డుప్లెసిస్‌ పునరాగమనం!

అబుదాబి: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశముంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో కోచ్‌ రాబ్‌ వాల్టర్‌తో చర్చలు సాగుతున్నాయని డుప్లెసిస్‌ తెలిపాడు. 2020లో చివరి టీ20 ఆడిన డుప్లెసిస్‌.. 2021 ఫిబ్రవరిలో ఆఖరి సారిగా టెస్టు మ్యాచ్‌ బరిలో దిగాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగొస్తానని అనుకుంటున్నా.వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో జట్టు సమతూకం కోసమే ఈ ప్రయత్నం’’ అని డుప్లెసిస్‌ చెప్పాడు.


అఫ్గాన్‌తో భారత్‌ పోరు

ఆసియా అండర్‌-19 టోర్నీ రేపటి నుంచి

దుబాయ్‌: ఏసీసీ అండర్‌-19 ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది. శుక్రవారం భారత్‌, అఫ్గాన్‌ యువ జట్లు ఆరంభ మ్యాచ్‌లో పోటీపడతాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యుర్థులు భారత్‌, పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో 8  జట్లు బరిలో ఉన్నాయి. గ్రూపు-ఎలో భారత్‌, అఫ్గాన్‌, నేపాల్‌, పాక్‌.. గ్రూపు-బిలో బంగ్లాదేశ్‌, జపాన్‌, శ్రీలంక, యూఏఈ జట్లకు చోటు దక్కింది. ఇరు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈనెల 17న ఫైనల్‌ జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని