క్రికెట్‌ మరీ ఎక్కువైపోతోంది.. అందుకే ఆల్‌రౌండర్ల కొరత

అన్ని ఫార్మాట్లలో అతి క్రికెట్‌ వల్లే నాణ్యమైన ఆల్‌రౌండర్లు రావట్లేదని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌. చరిత్రలోనూ ఆల్‌రౌండర్లు ఎక్కువగా లేరని అన్నాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరున్న కలిస్‌ మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకుపైగా పరుగులు చేశాడు.

Updated : 07 Dec 2023 07:21 IST

దిల్లీ

న్ని ఫార్మాట్లలో అతి క్రికెట్‌ వల్లే నాణ్యమైన ఆల్‌రౌండర్లు రావట్లేదని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌. చరిత్రలోనూ ఆల్‌రౌండర్లు ఎక్కువగా లేరని అన్నాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరున్న కలిస్‌ మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకుపైగా పరుగులు చేశాడు. దాదాపు 600 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సర్‌ గారీ ఫీల్డ్‌ సోబర్స్‌ (8032 పరుగులు, 235 వికెట్లు)కు అతి గొప్ప ఆల్‌రౌండర్‌గా ఆ పేరుండగా.. 80ల్లో ఇమ్రాన్‌ ఖాన్‌, హ్యాడ్లీ, బోథమ్‌, కపిల్‌ దేవ్‌ వంటి వారు అలరించారు. కొత్త శతాబ్దిలో కలిస్‌, ఫ్లింటాఫ్‌ వంటి వారు ఆల్‌రౌండర్లుగా ఆకట్టుకున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌, పుట్టగొడుగుల్లా వస్తున్న లీగ్‌లు, కొత్త నిబంధనలు ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఎందుకు రావట్లేదన్న ప్రశ్నకు కలిస్‌ స్పందిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఆల్‌రౌండర్లు ప్రతి రోజూ రారు. చరిత్రలో చూసినా మరీ ఎక్కువగా కనపడరు. ఇందుకు ఎన్నో కారణాలు. అతి క్రికెట్‌ కూడా ముఖ్య కారణాల్లో ఒకటి’’ అని చెప్పాడు. ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌.. లెజెండ్స్‌ లీగ్‌లో ఆడేందుకు భారత్‌కు వచ్చాడు.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఎందుకు..: ఐపీఎల్‌ పేరును ప్రస్తావించనప్పటికీ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశాడు. ‘‘కొన్ని టీ20 లీగుల్లో సబ్‌స్టిట్యూట్స్‌ను ఆడిస్తున్నారు. అది నాకు నచ్చలేదు. దాని వల్ల ఆల్‌రౌండర్‌ జట్టులో స్థానం కోల్పోతున్నాడు. మంచి ఆల్‌రౌండర్‌ లేని జట్లు ఇప్పుడు 12 మందితో ఆడుతున్నాయి. అది సమంజసంగా అనిపించట్లేదు’’ అని ఓ ఇంటర్వ్యూలో కలిస్‌ చెప్పాడు. ఆల్‌రౌండర్లు రాకపోవడానికి ఇంకా చిన్న చిన్న కారణాలు అనేకం ఉన్నాయని అతడు తెలిపాడు.

సెంచూరియన్‌లో భారత్‌కు కష్టమే..: టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన భారత్‌కు కష్టమైందే. ఇప్పటివరకు భారత్‌ అక్కడ ఒక్క టెస్టు సిరీస్‌ కూడా నెగ్గలేదు. ఈసారి టీ20ల, వన్డేలతో పాటు దక్షిణాఫ్రికాలో రెండు టెస్టు మ్యాచ్‌లు (సెంచూరియన్‌, కేప్‌టౌన్‌) ఆడనుంది. అయితే దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలో ఓడించడం చాలా కష్టమేనని కలిస్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రస్తుత భారత జట్టు బాగుంది. కానీ దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలో ఓడించడం చాలా కష్టం. సెంచూరియన్‌ దక్షిణాఫ్రికాకు బాగా సరిపోతుండొచ్చు. కేప్‌టౌన్‌ భారత్‌కు అనుకూలంగా ఉండొచ్చు. టెస్టు సిరీస్‌ హోరాహోరీగా సాగనుంది’’ అని అన్నాడు.

కాస్త అదృష్టం ఉండాలి: ఐసీసీ టోర్నీల్లో కీలక మ్యాచ్‌ల్లో తడబడి ఓడిపోయే అలవాటున్నందుకు ‘చోకర్స్‌’గా ముద్ర పడ్డ దక్షిణాఫ్రికా జట్టులో భాగమైన కలిస్‌.. ఐసీసీ ఈవెంట్లో తొమ్మిదిసార్లు సెమీఫైనల్స్‌ లేదా ఫైనల్స్‌లో ఓడిన భారత జట్టు బాధను అర్థం చేసుకోగలడు. అందుకే ఇలాంటి టోర్నీల్లో కాస్త అదృష్టం కూడా ఉండాలని అంటున్నాడు. ‘‘గెలవాలంటే ఇలాంటి టోర్నీల్లో కాస్త అదృష్టం కూడా తోడు కావాలి. మ్యాచ్‌ రోజు టాస్‌ ఓడిపోవచ్చు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాస్త అదృష్టం ఉండాలి’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని