Pro Kabaddi League: టైటాన్స్‌ మరోసారి..

ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్‌ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్‌ కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.

Updated : 07 Dec 2023 09:43 IST

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్‌ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్‌ కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు గట్టిపోటీనిచ్చిన టైటాన్స్‌ బుధవారం పట్నా పైరేట్స్‌తో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయింది. 28-50 తేడాతో చిత్తుగా ఓడింది. అంచనాలకు తగ్గట్టుగా పవన్‌ (11) రాణించినా మిగతా వారి నుంచి అతడికి సరైన మద్దతు లభించలేదు. మ్యాచ్‌ ఆరంభంలో కాసేపు టైటాన్స్‌ పోటాపోటీగా తలపడింది. పవన్‌ సూపర్‌ రెయిడ్‌ కారణంగా 6-3తో ఆధిక్యంలో వెళ్లింది. మరోవైపు పట్నా స్టార్‌ రెయిడర్‌ సచిన్‌ (14) దూకుడు ప్రదర్శించినా.. 8-7తో ఆధిక్యంలోనే నిలిచింది. కానీ సచిన్‌ జోరు కొనసాగిన వేళ టైటాన్స్‌ నెమ్మదిగా వెనకబడిపోయింది. 13వ నిమిషంలో టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసిన పట్నా.. ప్రథమార్ధం ముగియడానికి ముందు మరోసారి ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి పాయింట్లు కొల్లగొట్టింది. విరామ సమయానికి 28-16తో ఆధిక్యంలో నిలిచిన ఆ జట్టు.. ఆ తర్వాత తగ్గలేదు. పవన్‌ మినహా మిగతా ఆటగాళ్ల నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడంతో టైటాన్స్‌ ఓటమి చాలా ముందే ఖరారైపోయింది. ఆ జట్టులో సందీప్‌ (4)దే రెండో అత్యుత్తమ ప్రదర్శన. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 57-27తో హరియాణ స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది.

ప్రొ కబడ్డీలో ఈనాడు

బెంగాల్‌ వారియర్స్‌ × జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ రాత్రి 8 నుంచి
గుజరాత్‌ జెయింట్స్‌ × పట్నా పైరేట్స్‌ రాత్రి 9 నుంచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని