డబ్ల్యూపీఎల్‌ కమిటీ అధ్యక్షుడిగా రోజర్‌

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) అభివృద్ధి కోసం బీసీసీఐ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

Published : 08 Dec 2023 01:58 IST

దిల్లీ: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) అభివృద్ధి కోసం బీసీసీఐ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తాడు. బీసీసీఐ కార్యదర్శి జైషా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అరుణ్‌ ధూమల్‌ (ఐపీఎల్‌ ఛైర్మన్‌), రాజీవ్‌ శుక్లా (బీసీసీఐ ఉపాధ్యక్షుడు), అశిష్‌ శీలర్‌ (బీసీసీఐ కోశాధికారి), దేవ్‌జిత్‌ సైకియా (బీసీసీఐ సంయుక్త కార్యదర్శి), మధుమతి లెలె, ప్రభ్‌తేజ్‌ భాటియా ఈ కమిటీలో సభ్యులు. ముంబయిలో శనివారం డబ్ల్యూపీఎల్‌ వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.


రెండో రోజు వర్షార్పణం

బంగ్లా-కివీస్‌ రెండో టెస్టు

మిర్పూర్‌: బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టులో తొలి రోజు స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో రోజు ఆటను వరుణుడు శాసించాడు. గురువారం, వర్షం కారణంగా ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక దశలో వాన తగ్గినా.. క్రికెట్‌ ఆడే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. శుక్రవారం షెడ్యూల్‌ కన్నా ముందే కివీస్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం కానుంది. మొదటిరోజు న్యూజిలాండ్‌ స్పిన్నర్ల ధాటికి బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. ఆపై కివీస్‌ కూడా తడబడింది. ఆట చివరికి 55/5తో కష్టాల్లో చిక్కుకుంది. మిచెల్‌ (12), ఫిలిప్స్‌ (5) క్రీజులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని