అథ్లెట్లకు కఠోర ఆర్మీ శిక్షణ

వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Updated : 08 Dec 2023 03:40 IST

ఒలింపిక్స్‌ కోసం దక్షిణ కొరియా నిర్ణయం

సియోల్‌: వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వందలాది అథ్లెట్లకు మూడు రోజుల పాటు కఠోరమైన సైన్యం తరహా శిక్షణ ఇప్పించేందుకు కొరియా మెరీన్‌ కార్ప్స్‌ శిబిరానికి పంపించాలని వివిధ క్రీడా సంఘాలకు కొరియా ఒలింపిక్‌ కమిటీ సూచించింది. మహిళలు సహా సుమారు 320 మంది అథ్లెట్లు ఈ శిబిరంలో పాల్గొనబోతున్నారు. గతంలో భారీ క్రీడా టోర్నీలకు ముందు సైన్యం తరహా శిక్షణ తీసుకోవాలని క్రీడా సంఘాలు తమ అథ్లెట్లకు చెబుతుండేవి. కానీ ఒలింపిక్‌ కమిటీ ఇలా సూచించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో పసిడి పతకాల సంఖ్యలో చైనా, జపాన్‌ తర్వాత దక్షిణ కొరియా నిలవడంతో ఒలింపిక్‌ కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఈ శిబిరం నిర్వహణ కోసం ఇంకా చర్చలు సాగుతున్నాయి. కానీ గతంలో ఒలింపిక్స్‌కు ముందు నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఫెన్సర్లు, రెజ్లర్లు, హ్యాండ్‌బాల్‌ అథ్లెట్లు ర్యాపెలింగ్‌ కోర్సుతో పాటు 140 కిలోల పడవలను తలలపై మోశారు. తాజాగా దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఇంకా సైన్యం పాలనలోనే దేశం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఒలింపిక్స్‌లో ఏదైనా పతకం గెలిచే పురుష అథ్లెట్లు 18 నుంచి 21 నెలలు కచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నిబంధన నుంచి మినహాయింపు పొందుతారన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని