స్పెయిన్‌ చేతిలో భారత్‌ ఓటమి

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం.

Published : 08 Dec 2023 02:02 IST

జూ.హాకీ ప్రపంచకప్‌

కౌలాలంపుర్‌: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం. గురువారం పూల్‌-సి రెండో మ్యాచ్‌లో ఉత్తమ్‌సింగ్‌ బృందం 1-4 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ చేతిలో చిత్తయింది. పెనాల్టీకార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలం కావడం, బలహీనమైన డిఫెన్స్‌ భారత్‌ను దెబ్బ కొట్టాయి. ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే భారత్‌కు షాక్‌ తగిలింది. తొలి నిమిషంలో కాబ్రె గోల్‌ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఆండ్రెస్‌ (18వ) బంతిని లక్ష్యానికి చేర్చడంతో స్పెయిన్‌ ఆధిక్యం రెట్టింపు అయింది. ఈ మధ్యలో భారత్‌కు పెనాల్టీకార్నర్లు దక్కినా నిష్ఫలమయ్యాయి. మూడో క్వార్టర్‌లో రోహిత్‌ (33వ) గోల్‌ చేయడంతో ఎట్టకేలకు భారత్‌ ఖాతా తెరిచింది. కానీ ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ కాబ్రె (41వ) మరో గోల్‌ సాధించి స్పెయిన్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. చివర్లో ఆండ్రెస్‌ (60వ) మరో గోల్‌ కొట్టి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. భారత్‌ (3 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. కొరియా కూడా ఇన్నే పాయింట్లు సాధించినా గోల్స్‌ అంతరంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. స్పెయిన్‌ (6) అగ్రస్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని