NeeraJ Chopra: అందుకు నీరజే కారణం

భారత అథ్లెటిక్స్‌లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్‌ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్‌ త్రో అథ్లెట్‌ కిశోర్‌ కుమార్‌ పేర్కొన్నాడు.

Updated : 08 Dec 2023 09:56 IST

దిల్లీ: భారత అథ్లెటిక్స్‌లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్‌ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్‌ త్రో అథ్లెట్‌ కిశోర్‌ కుమార్‌ పేర్కొన్నాడు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న కిశోర్‌ ఈ ఏడాది ఆసియా క్రీడల్లో 87.54 మీటర్ల ప్రదర్శనతో రజతం నెగ్గిన సంగతి తెలిసిందే. ‘‘వచ్చే ఏడాది ఈటెను విసిరే దూరం గురించి ఆలోచించడం లేదు. పారిస్‌ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన రాబట్టాలనుకుంటున్నా. నీరజ్‌ చోప్రాను ఆరాధిస్తా. భారత అథ్లెటిక్స్‌లో జరుగుతున్న మంచి విషయాలకు అతనే కారణం. నా టెక్నిక్‌ విషయంలో అతనిచ్చిన సలహాలు పాటిస్తా. ఒలింపిక్స్‌కు ముందు అన్ని రకాలుగా మెరుగవుతా. ఎక్కువ భాగం భారత్‌లోనే శిక్షణ కొనసాగిస్తా. ఒలింపిక్స్‌కు ముందు విదేశాల్లో కొన్ని పోటీల్లో పాల్గొంటా’’ అని గురువారం ‘ది మ్యాన్‌ వూ మేడ్‌ హిస్టరీ: ది నీరజ్‌ చోప్రా స్టోరీ’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో కిశోర్‌ తెలిపాడు. ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన మహిళా జావెలిన్‌ త్రో అథ్లెట్‌ అన్ను రాణి కూడా ఈ కార్యక్రమంలో పొల్గొంది. ‘‘చెరకు గడను విసురుతూ నా కెరీర్‌ మొదలెట్టా. అమ్మాయికి ఆటలెందుకని గ్రామస్థులు అన్నారు. మా నాన్నకు కూడా జావెలిన్‌ విసరడం నచ్చలేదు. అందుకే పాఠశాల నుంచి తెచ్చుకున్న జావెలిన్‌ను నాన్నకు కనబడకుండా దాచేదాణ్ని. కానీ ఓ రోజు అసలు విషయం తెలిసింది. అప్పుడు ఆయన కోపాన్ని భరించాల్సి వచ్చింది’’ అని అన్ను వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని