Sreesanth - Gambhir: గంభీర్‌ నన్ను ఫిక్సర్‌ అన్నాడు

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ తనను ఫిక్సర్‌ అన్నాడని మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ గురువారం ఆరోపించాడు.

Updated : 08 Dec 2023 09:55 IST

సూరత్‌: టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ తనను ఫిక్సర్‌ అన్నాడని మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ గురువారం ఆరోపించాడు. లెజెండ్స్‌ లీగ్‌లో బుధవారం ఇండియన్‌ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా గంభీర్‌, శ్రీశాంత్‌ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘గంభీర్‌ నన్ను ఫిక్సర్‌, ఫిక్సర్‌ అని పిలుస్తూనే ఉన్నాడు. ప్రత్యక్ష ప్రసారమవుతున్న మ్యాచ్‌లో అతను నన్ను ఫిక్సర్‌ అన్నాడు. ఏమంటున్నావు అని తనని అడిగా. శాంతపరిచేందుకు ప్రయత్నించిన అంపైర్లతోనూ అతను అలాగే మాట్లాడాడు. నేను ఒక్క చెడు మాట కూడా అనలేదు. ఓవర్‌ అయిపోయిన తర్వాత అతనెందుకు అలా చేశాడో అర్థం కావట్లేదు. దయచేసి వాస్తవానికి మద్దతుగా నిలవండి. గంభీర్‌ ఎంతో మందితో ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇప్పుడు అతని వర్గం వాళ్లు మాత్రం గంభీర్‌ సిక్సర్‌, సిక్సర్‌ అన్నాడని చెబుతున్నారు. కానీ అతను ఫిక్సర్‌ అనే అన్నాడు. ఇలా మాట్లాడటం సరికాదు. ఈ విషయాన్ని వదిలేద్దామనుకున్నా. కానీ అతని మద్దతుదారులు గంభీర్‌ను కాపాడాలని చూస్తున్నారు. అదనపు జీతానికి ఆశపడే పీఆర్‌ల మాటలు నమ్మొద్దని కోరుతున్నా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

అనంతరం టీమ్‌ఇండియా జెర్సీలో నవ్వుతూ ఉన్న తన ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేసిన గంభీర్‌.. ‘‘ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించాలని చూసినప్పుడు నవ్వుతూ ఉండాలి’’ అనే శీర్షిక పెట్టాడు. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంగా శ్రీశాంత్‌పై బీసీసీఐ మొదట జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ సుప్రీం కోర్టు 2019లో దీన్ని ఏడేళ్లకు తగ్గించడంతో శ్రీశాంత్‌ నిషేధం నుంచి బయటపడ్డాడు. బుధవారం కూడా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడుతూ గంభీర్‌పై శ్రీశాంత్‌ రెచ్చిపోయాడు. ఏ కారణంగా లేకుండానే సహచర ఆటగాళ్లతో గంభీర్‌ గొడవ పెట్టుకుంటాడని, సెహ్వాగ్‌ సహా ఏ సీనియర్‌ ఆటగాడి పట్ల అతనికి గౌరవం లేదని ఆరోపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ హోదాలో గంభీర్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లితో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు