జైపుర్‌-బెంగాల్‌ సగం సగం

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో తొలి టై. జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ చివరికి 28-28తో సమమైంది.

Published : 08 Dec 2023 02:07 IST

అహ్మదాబాద్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10లో తొలి టై. జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ చివరికి 28-28తో సమమైంది. ఈ మ్యాచ్‌ ఆరంభంలో డిఫెన్స్‌లో సత్తా చాటిన జైపుర్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎనిమిది ట్యాకిల్‌ పాయింట్లు సాధించి విరామ సమయానికి 13-9తో ముందంజలో నిలిచింది. కానీ బెంగాల్‌ పట్టు వదలకుండా పోరాడింది. ఒక్కో పాయింట్‌ కూడగడుతూ అంతరాన్ని తగ్గించింది. బెంగాల్‌ జట్టులో భవానీ రాజ్‌పుత్‌ (10) సూపర్‌ టెన్‌తో అదరగొట్టడంతో జైపుర్‌ను ఆలౌట్‌ చేసిన బెంగాల్‌ 16-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. జైపుర్‌ తగ్గలేదు. శ్రీకాంత్‌ జాదవ్‌ (7) జోరుతో మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. గేమ్‌ అటుఇటు మొగ్గుతూ.. చివరికి టైగా ముగిసింది. మరో హోరాహోరీ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 33-30తో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది. సుధాకర్‌ (6), నీరజ్‌ కుమార్‌ (4), సచిన్‌ (4), సందీప్‌ కుమార్‌ (4) పట్నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌ ఆరంభంలో గుజరాత్‌ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్నా పుంజుకుని స్కోరు సమం చేసింది. విరామ సమయానికి రెండు జట్లు 12-12తో సమానంగా నిలిచాయి. ఆ తర్వాత పట్నా దూకుడుగా ఆడింది. సచిన్‌ విజృంభించడంతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఒక దశలో ఆ జట్టు 11 పాయింట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. కానీ రాకేశ్‌ (11) సూపర్‌-10 సాధించడంతో గుజరాత్‌ పుంజుకుని పాయింట్ల అంతరాన్ని తగ్గించింది. ఆఖర్లో మ్యాచ్‌పై పట్నా పట్టు కొనసాగించడంతో గుజరాత్‌కు ఓటమి తప్పలేదు.

ప్రొ కబడ్డీలో ఈనాడు

బెంగళూరు బుల్స్‌ × దబాంగ్‌ దిల్లీ (రా. 8 నుంచి)

పుణెరి పల్టాన్‌ × యు ముంబా (రా. 9 నుంచి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని