IND vs SA: సఫారీ సవాలుకు సై

ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించింది.. న్యూజిలాండ్‌ను ఆ దేశంలోనే మట్టికరిపించింది.. ఆస్ట్రేలియా గడ్డపై విజయకేతనం ఎగరేసింది.

Updated : 09 Dec 2023 10:00 IST

ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించింది.. న్యూజిలాండ్‌ను ఆ దేశంలోనే మట్టికరిపించింది.. ఆస్ట్రేలియా గడ్డపై విజయకేతనం ఎగరేసింది. కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలకాలని.. టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ గెలుపు తీరాలకు చేరాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా బరిలో దిగనుంది. సఫారీ సవాలుకు సై అంటోంది. మహాత్మా గాంధీ- నెల్సన్‌ మండేలా జ్ఞాపకార్థం ఫ్రీడమ్‌ సిరీస్‌గా పిలుస్తున్న సిరీస్‌లో మూడేసి టీ20లు, వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారమే టీ20తో ఈ సిరీస్‌ ఆరంభమవుతుంది.

ఈనాడు క్రీడావిభాగం

వన్డేల్లో ఒక్కసారే..

వన్డే ఫార్మాట్లో దక్షిణాఫ్రికాలో ఆ జట్టుపై భారత్‌ ఒక్కసారి మాత్రమే సిరీస్‌ విజయాన్ని అందుకుంది. ఈ రెండు జట్లు అక్కడ ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడ్డాయి. 2018లో జరిగిన ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 5-1తో విజయఢంకా మోగించింది. కోహ్లి సారథ్యంలోని జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి ప్రత్యర్థిని దాని గడ్డపైనే దెబ్బకొట్టింది. టీ20ల విషయానికి వస్తే భారత్‌దే పైచేయి. 2018లోనే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో సొంతం చేసుకుంది. అంతకంటే ముందు 2006, 2011లో ఏకైక టీ20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. 2012లో ఓ టీ20లో భారత్‌ ఓడింది.

దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ విజయం భారత్‌కు అందని ద్రాక్షగా ఊరిస్తూనే ఉంది. ఇప్పటివరకూ సఫారీ గడ్డపై టీమ్‌ఇండియా ఎనిమిది టెస్టు సిరీస్‌లు ఆడింది. కానీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 1992-93లో అజహరుద్దీన్‌ సారథ్యంలో మొట్టమొదటి సారి దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లింది. అప్పుడు నాలుగు టెస్టుల సిరీస్‌లో మన జట్టు 0-1తో ఓడింది. 1996-97లో సచిన్‌ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌లో సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. 2001లో సౌరభ్‌ గంగూలీ నాయకత్వంలో భారత్‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1తో చేజార్చుకుంది. 2006-07లో  (ద్రవిడ్‌ కెప్టెన్‌) 1-2తో, 2013లో (ధోని కెప్టెన్‌) 0-1తో పరాజయం పాలైంది. కోహ్లి కెప్టెన్సీలో 2018, 2021-22లో 1-2తో భారత్‌ ఓడింది. 2010-11లో ధోని సారథ్యంలో సిరీస్‌ గెలిచేందుకు జట్టుకు మంచి అవకాశం వచ్చింది. కానీ చివరి టెస్టు డ్రా కావడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-1తో ముగించింది.

ఈ వివాదాలు..

దక్షిణాఫ్రికాలో భారత పర్యటన అంటే మ్యాచ్‌లతో పాటు వివాదాలూ గుర్తుకొస్తాయి. 1997లో ఓ వన్డేలో 279 పరుగుల ఛేదనలో ద్రవిడ్‌, సచిన్‌ గొప్పగా ఆడారు. వికెట్‌ తీయలేకపోతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు. ద్రవిడ్‌ సిక్సర్‌ కొట్టగానే డొనాల్డ్‌ మాటలతో రెచ్చిపోయాడు. ద్రవిడ్‌ కూడా దీటుగా నిలబడటంతో వాగ్వాదం తారస్థాయికి చేరింది. అయితే తన కెరీర్‌లోనే అతి అత్యంత చెత్త సందర్భం అని వ్యాఖ్యానించిన డొనాల్డ్‌ 25 ఏళ్ల తర్వాత ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పడం గమనార్హం. 2001లో ఓ టెస్టు సందర్భంగా బాల్‌ టాంపరింగ్‌ చేస్తున్నాడని సచిన్‌పై నిషేధం విధించాలని మ్యాచ్‌ రిఫరీ మైక్‌ డెన్నిస్‌ చెప్పడం కలకలం రేపింది. రెండో టెస్టు మూడో రోజు ఆటలో బౌలింగ్‌ చేస్తూ సచిన్‌ స్పిన్‌ రాబట్టాడు. దీంతో వీడియోను పరీక్షించిన రిఫరీ.. ఎడమ చేతి బొటన, చూపుడు వేలితో బంతిని దెబ్బతీస్తున్నాడని సచిన్‌పై ఏడాది నిషేధం విధిస్తానని చెప్పి, ఓ మ్యాచ్‌ ఆడకుండా సస్పెండ్‌ చేయడం వివాదానికి దారితీసింది. అంతకుముందు సెహ్వాగ్‌, హర్భజన్‌, శివ్‌సుందర్‌, దీప్‌ దాస్‌గుప్తా, కెప్టెన్‌ గంగూలీపైనా వివిధ కారణాలతో రిఫరీ చర్యలు తీసుకున్నాడు. రిఫరీ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన బీసీసీఐ.. అతణ్ని తప్పించాలని కోరింది. మూడో టెస్టుకు డెన్నిస్‌ను రిఫరీగా తప్పించిన ఐసీసీ.. ఆ మ్యాచ్‌కు టెస్టు హోదా కూడా తొలగించింది. ఇక 2022లో ఓ టెస్టులో ఎల్గర్‌ ఎల్బీ విషయంలో డీఆర్‌ఎస్‌ నిర్ణయం వ్యతిరేకంగా రావడంతో కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, అశ్విన్‌.. దక్షిణాఫ్రికాపై మాటలతో చెలరేగిన సంగతి తెలిసిందే.

ప్రత్యర్థితో ప్రమాదమే..

ఈసారి కూడా దక్షిణాఫ్రికాలో భారత్‌కు కఠిన పరీక్ష తప్పదు. మూడు ఫార్మాట్లలోనూ ప్రత్యర్థి ప్రమాదకరంగా ఉంది. విధ్వంసక ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు దూకుడుగా ఆడింది. చాలా మ్యాచ్‌ల్లో అలవోకగా 350కి పైగా పరుగులు సాధించింది. కానీ సెమీస్‌లో దురదృష్టవశాత్తూ ఓడిపోయింది. ఇప్పుడు భారత్‌పైనా జోరు కొనసాగించేందుకు సఫారీ జట్టు సిద్ధమైంది. పరిమిత ఓవర్ల సిరీస్‌కు బవుమా విశ్రాంతి తీసుకోవడంతో టీ20 కెప్టెన్‌ మార్‌క్రమ్‌ వన్డేలకూ సారథిగా వ్యవహరించనున్నాడు. అతనితో పాటు రీజా హెండ్రిక్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌, స్టబ్స్‌, జాన్సన్‌, ఫెలుక్వాయో, కొయెట్జీ, కేశవ్‌ మహరాజ్‌, షంసీ, ఎంగిడితో టీ20 జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. వన్డేల్లో నిలకడగా రాణించే వాండర్‌ డసెన్‌ కూడా జట్టుతో చేరతాడు. టెస్టుల్లో బవుమా, ఎల్గర్‌, రబాడ కూడా తోడవడంతో ఆ జట్టు మరింత బలంగా మారనుంది. పైగా అక్కడి పరిస్థితులు మనకు సవాలు విసిరేవే. ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌ విజయాలు అందుకోవాలంటే టీమ్‌ఇండియా శక్తికి మంచి పోరాడాల్సిందే.

1

మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లతో భారత్‌ ఓ సిరీస్‌లో తలపడతుండటం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికాలో టీ20లకు సూర్యకుమార్‌, వన్డేలకు కేఎల్‌ రాహుల్‌, టెస్టులకు రోహిత్‌ కెప్టెన్లగా వ్యవహరించనున్నారు

67

అన్ని ఫార్మాట్లలో కలిపి దక్షిణాఫ్రికాలో భారత్‌ ఆడిన మ్యాచ్‌లు. 23 టెస్టుల్లో కేవలం 4 మాత్రమే నెగ్గిన మన జట్టు 12 ఓడింది. ఏడు డ్రా అయ్యాయి. 37 వన్డేల్లో 10 విజయాలు సాధించగా.. 25 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. రెండింట్లో ఫలితం తేలలేదు. 7 టీ20ల్లో 5 నెగ్గి, 2 ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని