Fast Bowling: 150 కి.మీ. వేసే బౌలర్లు.. ఇక కనిపించరా?

ఒకప్పటి బౌలర్లు కుట్ల బంతిని ఒడుపుగా పట్టుకుని వదిలితే 150 కి.మీ వేగంతో బుల్లెట్‌లా దూసుకెళ్లేది. అలాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించేవాళ్లు. కానీ, నేటి తరంలో చాలా మంది బౌలర్లు వేగం కంటే నైపుణ్యంతోనే వికెట్లు తీస్తున్నారు.

Updated : 09 Jan 2024 17:49 IST

‘‘ఫాస్ట్‌ బౌలింగ్‌ అనేది తగ్గిపోయింది. 150 కి.మీ వేగంతో బంతులు వేసే బౌలర్లే కరువయ్యారు. ఇప్పుడు ఉన్నవాళ్లను ఏమాత్రం ఫాస్ట్‌ బౌలర్లు అనలేం’’ ఇదీ వైట్‌ లైట్నింగ్‌గా పేరొందిన దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్‌ ఇటీవల అన్న మాటలు. డొనాల్డ్‌ మాటలు అక్షర సత్యం. ఎందుకంటే ఫాస్ట్‌ బౌలింగ్‌ ఓ కళ. కుట్ల బంతిని ఒడుపుగా పట్టుకుని వదిలితే బుల్లెట్‌లా దూసుకెళ్లేది. ఒకప్పుడు వెస్టిండీస్‌ అరివీర భయంకర మాల్కమ్‌ మార్షల్, జోయల్‌ గార్నర్, ఆండీ రాబర్ట్స్, మైకేల్‌ హోల్డింగ్‌ ప్రత్యర్థి బ్యాటర్లను ఇలాగే వణికించేవాళ్లు!

వెస్టిండీస్‌ మాత్రమే కాదు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌ జట్లలోనూ మెరుపు పేసర్లు ఉండేవాళ్లు! కానీ నెమ్మది నెమ్మదిగా ఆ వేగం తగ్గిపోయింది. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే బౌలర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి! షోయబ్‌ అక్తర్, బ్రెట్‌లీ, షేన్‌ బాండ్‌ తరం తర్వాత మళ్లీ అంతటి స్పీడ్‌తో స్థిరంగా బంతులు విసిరే పేసర్లు కరవయ్యారు. పేస్‌కు భారత్‌ ఎప్పుడూ పెట్టింది పేరు కాకపోయినా ఇటీవల కాలంలో మన పేస్‌ అటాక్‌ బుమ్రా, షమి, సిరాజ్‌లతో దుర్భేద్యంగా ఉంది. కానీ వీళ్లెవరూ స్థిరంగా గంటకు 150 కి.మీ వేగంతో బంతులు వేసేవాళ్లు కాదు. నైపుణ్యంతోనే ఎక్కువగా వికెట్లు తీస్తున్నారు.

ఊపిరి సలపని మ్యాచ్‌ల వల్లే

ప్రస్తుత క్రికెటర్లు ఊపిరి సలపని షెడ్యూల్‌తో బిజీగా ఉంటున్నారు. అటు అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఇటు టీ20 లీగ్‌లను బ్యాలెన్స్‌ చేసుకుంటూ పోతున్నారు. దీంతో వాళ్లకు విశ్రాంతి దొరకట్లేదు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడడం వల్ల భారం పెరిగిపోవడంతో పేస్‌ కూడా తగ్గిపోతోంది. శరీరాన్ని ఎక్కువ శ్రమ పెడితే ఎక్కడ గాయాలు అవుతాయో అన్న భయమూ వెంటాడుతోంది. అందుకే 150 కి.మీ వేగం అనే మాటని చాలామంది పేసర్లు మర్చిపోయారు. వేగాన్ని పక్కనపెట్టి వైవిధ్యంగా బౌలింగ్‌ చేయడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎలా అయితేనేం వికెట్లు తీయాలి అనే ఆలోచనలో ఉన్నారు.

కొంతమంది పేసర్లు అయితే కాస్త స్పీడ్‌గా బంతులు వేసే స్పిన్నర్ల మాదిరిగా మారారు. ఆరంభంలో మంచి వేగంతో బంతులు వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ ఆ తర్వాత కాస్త వేగంతో బంతులు విసిరే బౌలర్‌గా మారాడు. గాయాలే ఇందుకు కారణం. ఒకప్పుడు మెరుపు వేగంతో బంతులేసి ఆ తర్వాత స్లో మీడియం పేసర్‌గా మారిన మునాఫ్‌ పటేల్‌ కూడా ఇదే కోవకు చెందుతాడు. ఒకప్పటి ఆల్‌రౌండర్‌ మనోజ్‌ ప్రభాకర్‌ కూడా ఇంతే. అతడింకా దారుణంగా కెరీర్‌ చివర్లో స్పిన్‌ కూడా వేసేవాడు.

ఉమ్రాన్‌ మాలిక్‌ వచ్చినా..

150 కిలోమీటర్ల వేగం.. అంటే బ్యాటర్లకు అంత తేలిగ్గా దొరకని వేగమది. ఆ స్పీడ్‌కి, కాస్త నైపుణ్యాన్ని జోడిస్తే ఎంతటి బ్యాటర్‌ అయినా కూడా తడబడక తప్పదు. ఐపీఎల్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ ఇలాంటి వేగంతోనే వికెట్లు తీశాడు. క్రమం తప్పకుండా ప్రతి మ్యాచ్‌లో 150 కి.మీ వేగంతో బంతిని వేసి ఔరా అనిపించాడు. వేగవంతమైన బౌలర్‌ అవార్డును ప్రతిసారీ అతడే దక్కించుకున్నాడు. అయితే స్పీడ్‌ ఉంటే సరిపోదు నియంత్రణ కూడా ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని పక్కనపెట్టి రన్‌లు ఇచ్చే మెషీన్‌గా మారిపోయాడు. పరుగులు బాగా ఇచ్చేస్తూ వెనుకబడిపోయాడు. దీంతో భారత జట్టులో చోటు దక్కించుకున్నా నిలబెట్టుకోలేకపోయాడు. బ్రెట్‌లీ, షోయబ్‌ అక్తర్‌ భీకర పేస్‌తో బంతులు వేసినా.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి ఉండడం వల్లే వికెట్లు తీయగలిగారు. ఈ విషయంలో ఫెర్గూసన్, మార్క్‌ వుడ్‌ కాస్త నయం. ప్రస్తుత తరంలో వేగంగా బంతులు వేయడంలో వీళ్లిద్దరూ ముందున్నారు.

జోఫ్రా ఆర్చర్‌ సైతం ఆరంభంలో మెరుపు వేగానికి మారు పేరుగా మారాడు. కానీ విపరీతమైన క్రికెట్లో పడి గాయాల పాలయ్యాడు. గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్‌ కూడా మునుపటి వేగంతో బంతులు వేయట్లేదు. వేగంగా బంతులు వేయాలి.. అనే కాన్సెప్ట్‌ ప్రస్తుత బౌలర్లకు ఉండట్లేదు. దీంతో ఈ నైపుణ్యం మరుగునపడిపోతోంది. RAW బౌలింగ్‌కు పెట్టింది పేరైన వెస్టిండీస్, పాకిస్థాన్‌ బౌలర్లు సైతం ఫాస్ట్‌ కళను పెంచుకోవట్లేదు. షహీన్‌షా అఫ్రిది లాంటి సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌ కూడా 150 కి.మీ వేగంతో బంతులు వేయలేని పరిస్థితి. మరి వేగానికి మారుపేరుగా నిలిచే ఫాస్ట్‌ బౌలర్లు మున్ముందైనా వస్తారేమో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని