India vs England: ఒక్క రోజులో.. ఎన్ని మెరుపులో!

కోరుకున్నట్లే యశస్వి ద్విశతకం సాధించాడు. స్కోరు 400కు చేరువైంది. కానీ బజ్‌బాల్‌ ఆటతో బెంబేలెత్తించే ఇంగ్లాండ్‌.. బ్యాటింగ్‌ అంత కష్టంగా లేని పిచ్‌పై చెలరేగకుండా ఉంటుందా అన్న సందేహం! అందుకు తగ్గట్లే ఇంగ్లిష్‌ జట్టు స్కోరు 20 ఓవర్లలో 105/1కు చేరుకుంది.

Updated : 04 Feb 2024 06:57 IST

నిప్పులు చెరిగిన బుమ్రా
ఇంగ్లాండ్‌ 253
యశస్వి ద్విశతకం.. భారత్‌ 396
విశాఖలో రెండో టెస్టు

కోరుకున్నట్లే యశస్వి ద్విశతకం సాధించాడు. స్కోరు 400కు చేరువైంది. కానీ బజ్‌బాల్‌ ఆటతో బెంబేలెత్తించే ఇంగ్లాండ్‌.. బ్యాటింగ్‌ అంత కష్టంగా లేని పిచ్‌పై చెలరేగకుండా ఉంటుందా అన్న సందేహం! అందుకు తగ్గట్లే ఇంగ్లిష్‌ జట్టు స్కోరు 20 ఓవర్లలో 105/1కు చేరుకుంది. కానీ అప్పుడో సూపర్‌ క్యాచ్‌.. ఆ తర్వాత ఓ బౌలర్‌ సంచలన బౌలింగ్‌ ప్రదర్శనతో కథ మొత్తం మారిపోయింది. చివరికి టీమ్‌ఇండియా తిరుగులేని స్థితిలి నిలిచింది. జస్‌ప్రీత్‌ బుమ్రా విశాఖలో అద్భుత బౌలింగ్‌ విన్యాసాలు ప్రదర్శించిన ఇంగ్లాండ్‌ కకావికలమైంది. శనివారం ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. సాయంత్రానికి రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టింది. మధ్యలో ఎన్నో మలుపులు, మెరుపులు!

విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్‌ (India vs England) పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన రోహిత్‌ సేన.. రెండో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 28/0తో నిలిచింది. యశస్వి జైస్వాల్‌ (15 బ్యాటింగ్‌), రోహిత్‌ శర్మ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. బుమ్రా (6/45) సంచలన బౌలింగ్‌కు తలవంచిన ఇంగ్లిష్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌటైంది. కుల్‌దీప్‌ (3/71) కూడా రాణించాడు. క్రాలీ (76; 78 బంతుల్లో 11×4, 2×6) టాప్‌స్కోరర్‌. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 336/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (209; 290 బంతుల్లో 19×4, 7×6) తొలి డబుల్‌ సెంచరీ అందుకున్నాడు. ఇంగ్లిష్‌ బౌలర్లలో అండర్సన్‌ (3/47), షోయబ్‌ బషీర్‌ (3/138), రెహాన్‌ అహ్మద్‌ (3/65) మెరిశారు.

ఆ క్యాచే మలుపు..: ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు క్రాలీ, డకెట్‌ (21) దూకుడుగా మొదలెట్టారు. అశ్విన్‌ బౌలింగ్‌లో క్రాలీ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను గిల్‌ పట్టలేకపోయాడు. ఆ వెంటనే బుమ్రా ఓవర్లో క్రాలీ నాలుగు ఫోర్లు కొట్టాడు. 10 ఓవర్లలోనే 59 పరుగులొచ్చాయి. ఆ దశలో డకెట్‌ను కుల్‌దీప్‌ బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే పోప్‌ (23)ను స్టంపౌట్‌ చేసే అవకాశాన్ని భరత్‌ వృథా చేశాడు. క్రాలీ 52 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. 20 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 దాటింది. పరిస్థితి భారత్‌ చేజారుతోందేమో అనిపించిన సమయంలో అక్షర్‌ (1/24)కు రోహిత్‌ బంతి అందించడం.. శ్రేయస్‌ అద్భుతమైన క్యాచ్‌తో క్రాలీ పెవిలియన్‌ చేరడంతో కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత 22 పరుగులకే ఇంగ్లాండ్‌ 3 వికెట్లు కోల్పోయింది. బంతిని చూస్తూ వెనక్కి పరుగెత్తి, ముందుకు డైవ్‌ చేస్తూ ఆ క్యాచ్‌ను శ్రేయస్‌ అందుకున్న తీరు అమోఘం. ఈ వికెట్‌ పడ్డాక మరో ఎండ్‌ నుంచి బుమ్రా రెచ్చిపోయాడు. ఆడటానికి సాధ్యం కాని రివర్స్‌ స్వింగ్‌ బంతులతో విజృంభించాడు. 4-2-3-2.. ఇవీ ఆ స్పెల్‌లో బుమ్రా గణాంకాలు. రూట్‌ (5)పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఎనిమిదోసారి ఔట్‌ చేశాడు. బంతిని వదలాలా లేదా అనే అనుమానంతోనే ఆడిన రూట్‌ స్లిప్‌లో గిల్‌ చేతికి చిక్కాడు. తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా తిరుగులేని యార్కర్‌తో పోప్‌ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్‌ 155/4తో టీ విరామానికి వెళ్లింది.

బుమ్రా మరింతగా..: చివరి సెషన్లో బుమ్రా మరింతగా చెలరేగాడు. బంతిని లోపలికి, బయటకు పంపిస్తూ.. బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. వరుసగా రెండు మొయిడెన్లు వేసిన అతను.. బెయిర్‌స్టో (25)కు గాలం వేశాడు. ఇన్‌స్వింగర్‌కు ఎల్బీ కావొద్దనే ఉద్దేశంతో బెయిర్‌స్టో కొంచెం వెనక్కి జరిగి బ్యాటింగ్‌ చేశాడు. ఇది గమనించిన బుమ్రా.. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతి వేసి ఆడేలా ప్రేరేపించాడు. అది ఎడ్జ్‌ తీసుకుని గిల్‌ చేతుల్లో పడింది. ఇక కుల్‌దీప్‌ స్పిన్‌, అధిక బౌన్స్‌ను ఉపయోగించుకున్నాడు. అతని ఓవర్లో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతి తిరుగుతుందేమోనని అడ్డుకునేందుకు ఫోక్స్‌ (6) ప్రయత్నించాడు. కానీ అది అనుకున్నంత తిరగకుండా వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. కొద్దిసేపటికే షార్ట్‌ మిడ్‌వికెట్లో గాల్లోకి ఎగిరి గిల్‌ పట్టిన క్యాచ్‌కు రెహాన్‌ (6) నిస్సహాయంగా పెవిలియన్‌ చేరాడు. వికెట్లు పడతుండటంతో స్టోక్స్‌ (47) బాదుడుకు తెరలేపి, ఫాలోఆన్‌ గండం నుంచి జట్టును బయటపడేశాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో అతనాడిన బంతి స్లిప్‌లో ఉన్న రోహిత్‌ వేళ్లను తాకుతూ వెళ్లింది. హార్ట్‌లీ (21) కూడా భారీ షాట్లు ఆడాడు. వీళ్ల భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతుండటంతో మరోసారి బుమ్రా బౌలింగ్‌కు వచ్చాడు. వరుస ఓవర్లలో స్టోక్స్‌, హార్ట్‌లీని పెవిలియన్‌ చేర్చాడు. అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను బౌల్డ్‌ చేశాడు. ఇంకేం చేయాలి? అన్నట్లు బ్యాట్‌ కిందపడేసి స్టోక్స్‌ నిరాశ వ్యక్తం చేశాడు. చివరిగా అండర్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు బుమ్రా ముగింపు పలికాడు.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వి (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 209; రోహిత్‌ (సి) పోప్‌ (బి) బషీర్‌ 14; శుభ్‌మన్‌ (సి) ఫోక్స్‌ (బి) అండర్సన్‌ 34; శ్రేయస్‌ (సి) ఫోక్స్‌ (బి) హార్ట్‌లీ 27; రజత్‌ (బి) రెహాన్‌ 32; అక్షర్‌ (సి) రెహాన్‌ (బి) బషీర్‌ 27; భరత్‌ (సి) బషీర్‌ (బి) రెహాన్‌ 17; అశ్విన్‌ (సి) ఫోక్స్‌ (బి) అండర్సన్‌ 20; కుల్‌దీప్‌ నాటౌట్‌ 8; బుమ్రా (సి) రూట్‌ (బి) రెహాన్‌ 6; ముకేశ్‌ (సి) రూట్‌ (బి) బషీర్‌ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (112 ఓవర్లలో ఆలౌట్‌) 396
వికెట్ల పతనం: 1-40, 2-89, 3-179, 4-249, 5-301, 6-330, 7-364, 8-383, 9-395
బౌలింగ్‌: అండర్సన్‌ 25-4-47-3; రూట్‌ 14-0-71-0; హార్ట్‌లీ 18-2-74-1; షోయబ్‌ బషీర్‌ 38-1-138-3; రెహాన్‌ అహ్మద్‌ 17-2-65-3

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) శ్రేయస్‌ (బి) అక్షర్‌ 76; డకెట్‌ (సి) రజత్‌ (బి) కుల్‌దీప్‌ 21; పోప్‌ (బి) బుమ్రా 23; రూట్‌ (సి) శుభ్‌మన్‌ (బి) బుమ్రా 5; బెయిర్‌స్టో (సి) శుభ్‌మన్‌ (బి) బుమ్రా 25; స్టోక్స్‌ (బి) బుమ్రా 47; ఫోక్స్‌ (బి) కుల్‌దీప్‌ 6; రెహాన్‌ (సి) శుభ్‌మన్‌ (బి) కుల్‌దీప్‌ 6; హార్ట్‌లీ (సి) శుభ్‌మన్‌ (బి) బుమ్రా 21; అండర్సన్‌ ఎల్బీ (బి) బుమ్రా 6; బషీర్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (55.5 ఓవర్లలో ఆలౌట్‌) 253
వికెట్ల పతనం: 1-59, 2-114, 3-123, 4-136, 5-159, 6-172, 7-182, 8-229, 9-234
బౌలింగ్‌: బుమ్రా 15.5-5-45-6; ముకేశ్‌ 7-1-44-0; కుల్‌దీప్‌ 17-1-71-3; అశ్విన్‌ 12-0-61-0; అక్షర్‌ 4-0-24-1

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: యశస్వి బ్యాటింగ్‌ 15; రోహిత్‌ బ్యాటింగ్‌ 13; మొత్తం: (5 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా) 28
బౌలింగ్‌: అండర్సన్‌ 2-0-6-0; బషీర్‌ 2-0-17-0; రెహాన్‌ 1-0-5-0


అందుకున్నాడు..: ఉదయం గంటన్నరలోనే భారత తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. మరో 19 ఓవర్లలో 60 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లపై ఆధిపత్యం చలాయిస్తూ జైస్వాల్‌ (ఓవర్‌నైట్‌ స్కోరు 179) సాగిపోయాడు. బషీర్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్లతో వరుసగా సిక్సర్‌, ఫోర్‌ రాబట్టిన అతను ద్విశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. కుల్‌దీప్‌ (8 నాటౌట్‌) సహకారంతో జైస్వాల్‌.. జట్టు స్కోరును 400 దాటిస్తాడేమో అనిపించింది. కానీ అసాధారణ ఇన్నింగ్స్‌ను అతను పేలవ షాట్‌తో ముగించాడు. ఫీల్డర్లు బౌండరీల దగ్గర ఉన్నారని తెలిసి కూడా అండర్సన్‌ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపి నిష్క్రమించాడు. ఆ కొద్దిసేపటికే జట్టు ఆలౌటైంది.


1

టెస్టుల్లో యశస్వికి ఇదే తొలి డబుల్‌ సెంచరీ. తన అరంగేట్ర టెస్టులో వెస్టిండీస్‌పై చేసిన 171 పరుగులే గత అత్యధిక స్కోరు.


4

టెస్టుల్లో ద్విశతకం చేసిన నాలుగో భారత లెఫ్ట్‌హ్యాండర్‌ జైస్వాల్‌. కాంబ్లి, గంగూలీ, గంభీర్‌ ముందున్నారు.


152

టెస్టుల్లో బుమ్రా వికెట్లు. అతి తక్కువ మ్యాచ్‌ (34)ల్లో 150 వికెట్ల మైలురాయి చేరుకున్న భారత పేసర్‌ అతనే. ప్రపంచ క్రికెట్లో వకార్‌ (27) మాత్రమే బుమ్రా కంటే ముందున్నాడు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని